-
సాక్షిలో ఎన్టీఆర్ యాడ్‌పై వైసీపీ శ్రేణుల ఫైర్
-
సాక్షికి యాడ్ ఇచ్చిన నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి
-
టీడీపీ యాడ్ ఎలా తీసుకుంటారని విరుచుకుపడుతున్న వైసీపీ సోషల్‌మీడియా సైనికులు
-
సంపాదించింది ఇంకా చాలలేదా అంటూ ఆగ్రహం
-
డబ్బుల కోసం ఇంత కక్కుర్తి ఎందుకంటూ కనెర్ర
-
జగన్, భారతికి డబ్బులే ముఖ్యమా అంటూ ప్రశ్నల వర్షం
-
రామోజీ ఎప్పుడూ మడమ తిప్పలేదన్న వ్యాఖ్యలు
-
అసలు తనకు సర్కారీ ప్రకటనలే వద్దంటూ లేఖ
-
ఇదేనా మీ విలువలు, విశ్వసనీయత అంటూ జగన్‌పై వైకాపా సోల్జర్స్ చిందులు
-
యాడ్ కోసం ఇంతగా దిగజారాలా అంటూ నిప్పులు
-
అటు టీడీపీలోనూ అదే దృశ్యాలు
-
అసలు సాక్షికి వేమిరెడ్డి ఎలా యాడ్ ఇస్తారని సోషల్‌మీడియా సోల్జర్స్ మండిపాటు
-
పాత వాసనలు ఇంకా పోలేదా అంటూ ఫైర్
-
వేమిరెడ్డిని అడిగే ధైర్యం ఎవరికి ఉందంటూ కామెంట్లు
-
అదే యాడ్ మరో నేత ఇస్తే పార్టీ సహిస్తుందా అంటూ ప్రశ్నల వర్షం
-
టీడీపీ-వైసీపీలో ‘యాడ్’ యుద్ధం
( మార్తి సుబ్రహ్మణ్యం)
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ను గుండెల్లో పెట్టుకుని పూజించే ఆ పార్టీ సోషల్‌మీడియా సైనికులు.. తొలిసారి జగనన్నపై నిర్దయగా-నిర్మొహమాటంగా నిప్పులు కురిపిస్తున్న వైనమిది. జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, దానిని గుడ్డిగా సమర్ధించే వైసీపీ సోషల్‌మీడియా సోల్జర్స్.. ఇప్పుడు ఆయన ‘కక్కుర్తివిలాస్ కాఫీక్లబ్’ను తూర్పారపడుతున్నారు. డబ్బులకు ఆశపడి విలువలు, విశ్వసనీయతను తాకట్టుపెట్టారంటూ విరుచుకుపడుతున్నారు. దానికి కారణం నెల్లూరు టీడీపీ ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి స్వర్గీయ ఎన్టీఆర్ వ ర్ధంతి సందర్భంగా ఇచ్చిన యాడ్‌ను, వైసీపీ అధికార పత్రిక సాక్షి పత్రికలో, మూడవ పేజీలో ప్రముఖంగా ప్రచురించడమే.
నిజానికి జగన్ భార్య భారతీరెడ్డి సారథ్యంలోని సాక్షి మీడియాకు, టీడీపీ ప్రకటనలు తీసుకునే సంప్రదాయం మొదటినుంచీ లేదు. ఎన్నికల సందర్భంలో కూడా, టీడీపీ అభ్యర్ధులు యాడ్ ఇస్తామన్నా తీసుకోలేదు. దానికి కారణం దాని సర్క్యులేషన్. అదే జగన్‌పై యుద్ధం ప్రకటించిన ఈనాడు కూడా, వైసీపీ పార్టీ ప్రకటనలు తీసుకోలేదు. ఎన్నికలకు ముందయితే.. అసలు తమకు ప్రభుత్వ ప్రకటనలు వద్దంటూ లిఖితపూర్వకంగా రాసిచ్చింది. అదీ రామోజీ చిత్తశుద్ధి!
అయితే దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా.. నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆయన భార్య-ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఫొటోతో కూడిన నిలువెత్తు యాడ్ ఒకటి సాక్షిలో ప్రత్యక్షం కావడం, వైసీపీ సోషల్‌మీడియా దళాలకు రుచించలేదు. సరికదా.. వారి ఆగ్రహానికి గురయింది. ఆ ప్రటనలో టీడీపీ సభ్యత్వాల గురించి కూడా ఉంది.
టీడీపీ ఎంపీ అయిన వేమిరెడ్డి యాడ్ అటు ఈనాడులోగానీ, ఇటు ఆంధ్రజ్యోతిలోగానీ ఇవ్వలేదు. చివరకు నెల్లూరు ఎడిషన్‌లో కూడా కనిపించలేదు. సహజంగా టీడీపీ ఎమ్మెల్యే-ఎంపి-నాయకులు, ఆ రెండు పత్రికలకే ఎక్కువ యాడ్స్ ఇస్తుంటారన్నది బహిరంగమే. కానీ వేమిరెడ్డి వారికీ ప్రకటనలు ఇవ్వకపోవడం ఆశ్చర్యం. ఎన్నికల ముందు వేమిరెడ్డి దంపతులు వైసీపీని వీడి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.
ఇప్పుడు టీడీపీ ఎంపీ-ఎమ్మెల్యేలుగా ఉన్న వేమిరెడ్డి దంపతులు ఇచ్చిన టీడీపీ యాడ్‌ను, సాక్షిలో ప్రచురించడంపై వైసీపీ సోషల్‌మీడియా సైనికులు విరుచుకుపడుతున్నారు. నిజానికి టీడీపీ సోషల్‌మీడియా వారియర్స్ కంటే, వైసీపీ సోషల్‌మీడియా సోల్జర్స్ తన పార్టీని గుడ్డిగా బలపరుస్తుంటారు. టీడీపీ నాయకత్వం చేసే తప్పులను ఆ పార్టీ సోషల్‌మీడియా సోల్జర్స్ నిర్మొహమాటంగా విమర్శిస్తారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టేందుకు ఏమాత్రం వెనుకాడరు.
సీఐ, ఐపిఎస్, ఐఏఎస్ పోస్టింగులలో దొర్లిన పొరపాట్లపై.. టీడీపీ సైనికులు ధ్వజమెత్తిన వెంటనే, దిద్దుబాటకు దిగాల్సిన పరిస్థితి ఉంది. అందుకే చాలామంది బాధితులకు న్యాయం జరిగింది. సూటిగా చెప్పాలంటే.. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్షం వైసీపీ కాదు. టీడీపీ సోషల్‌మీడియానే! అందుకే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఒకరకంగా ఇది నాయకత్వానికి ఇబ్బందిగానే మారింది.
కానీ వైసీపీ సోషల్ మీడియా దళాలు మాత్రం, జగన్ ఏ తప్పు చేసినా పట్టించుకోవు. సరికదా.. గుడ్డిగా సమర్ధిస్తాయి. కులం కోణంలో జగన్‌ను సమర్ధిస్తాయి. కానీ ఇప్పుడు తొలిసారి టీడీపీ ఎంపి వేమిరెడ్డి.. సాక్షిలో ఇచ్చిన యాడ్‌పై జగన్ దంపతుల డబ్బాశపై దునుమాడుతుండటం, వైసీపీ నాయకత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.‘‘ వేల కోట్లు సంపాదించిన జగన్ కుటుంబానికి ఇంకా డబ్బుల ఆశ ఎందుకు? ఉన్నది సరిపోదా? టీడీపీ యాడ్ వేశారంటే మీ కక్కుర్తి ఏమిటన్నది తెలుస్తూనే ఉంది. ఇక మీకు విలువలు, విశ్వసనీయత ఏమున్నాయి? ఆ పేరుతో చెప్పే కబుర్లనీ ఉత్తిమాటలే కదా? టీడీపీ యాడ్ వేయకపోతే మీ ఆదాయం పోతుందా? పైసల కోసం ఎంతకయినా దిగజారతారా? అంటూ జగన్‌ను వైసీపీ సోషల్‌మీడియా దళాలు తూర్పారపడుతున్నాయి.
ఈ సందర్భంగా కరుడుగట్టిన ఓ వైసీపీ రెడ్డిగారు సోషల్‌మీడియాలో పెట్టిన పోస్టు వైసీపీ నాయకత్వానికి షాక్ ఇచ్చింది.
ఆ పోస్టు యధాతథంగా…
జగనన్న పైసలు సంపాయించుకోవాలి – మనం ఆయన విలువలు గురించి మాట్లాడుకోవాలి. ఇన్నాళ్లూ మన వైకాపా పార్టీకి వ్యతిరేకంగా ఎల్లో మీడియా అని ముద్ర వేశాం. కానీ ఈనాడు వాళ్లు చివరి వరకు పోరాడారు. ఏ రోజూ రామోజీరావు మడమ తిప్పలేదు. విలువలు కోల్పోలేదు. మన ఘోర ఓటమిని చూసి భీష్ముడిలా మరణించాడు.
ఇవాళ ప్రతిపక్షం కూడా లేకుండా సచ్చిన పాములా 11తో పడి వున్న మన పార్టీని, మానసిక స్థైర్యం కోల్పోయేలా మన సాక్షి. పైసల కోసం అమ్ముడుపోయింది. ఇదా.. మన విలువలు, విశ్వసనీయత?
అదేమన్నా కనీసం ప్రభుత్వ ప్రకటనా? ప్రధాన శత్రు పార్టీ అయిన తెలుగుదేశం యాడ్. ఎంత డబ్బు కావాలి? ఆ పైసలు తీసుకొని మన కార్యకర్తలకు ఏమన్నా బీమా చెయ్యిస్తామా?
ఎందుకు ఇంత పైసల కక్కుర్తి? ఎన్ని వేల కోట్లు అయితే సరిపోతుంది?
లోకేశ్ నేతృత్వంలో కోటి పార్టీ సభ్యత్వాలతో ఘన నివాళి అని, దాని సభ్యత్వ నమోదుల్లో రికార్డుల గురించి, వాళ్ల కార్యకర్తల కోసం ఇచ్చే ప్రమాద బీమా గురించి ఇచ్చిన యాడ్‌ను ప్రచురించి, వైకాపాను నమ్ముకొన్న మన కార్యకర్తలకు ఏ సందేశం ఇచ్చారు?
మానసిక స్థైర్యం కోల్పోయిన మన పార్టీ కార్యకర్తలను తలెత్తుకోలేకుండా.. మానసికంగా మరింత దెబ్బ కొట్టింది మన సాక్షి కాదా?
యాడ్ కోసం ఇంత దిగజారాలా?
ఎన్ని కోట్లు ఇస్తే పోయిన మన విలువలు, విశ్వసనీయత తిరిగివస్తుంది?
ఆ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టి, ఇన్నాళ్లూ సాధించి, మాకేదో వారు భూమి మీద శత్రువులు అన్నట్లు చేసి, ఇవ్వాళ ఆ పార్టీ నాయకులు ఇచ్చిన ముష్టి యాడ్ డబ్బులకు చెయ్యి చాచి, డబ్బుల కోసం ఎంతైనా దిగజారే పార్టీ అని తలెత్తుకోలేకుండా చేశారు.
మానసికంగా ఇంకా ఇంకా ఇలా దెబ్బకొడుతూ.. ఆత్మ వంచన చేసుకొని మన పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుంది అంటే నమ్మే వారు మనలో ఎవరైనా వున్నారా?
సాక్షిని ప్రారంభించిన కొత్తలో అతి తక్కువ ధర పెట్టి, అన్ని పత్రికలను ఆ ధరకు అమ్మమని సవాల్ చేసి, మళ్లీ వాటి ధరలకు సమానంగా పెంచింది మనమే.
ఇవాళ వాళ్లు పాటించే విలువలు పాటించక దిగజారింది మన సాక్షినే.
ఛీ.. ఇందుకా ఈ రోజు సాక్షిని కొన్నది, ఇన్నాళ్లు కొని అచ్చేసిన చెత్త అంతా చదివింది అని కళ్లు తెరిచేలా చేసినందుకు జగనన్నకు కృతజ్ఞతలు.
ఇట్లు
వైకాపా కార్యకర్తగా సిగ్గుపడుతూ..
మీ వైఎస్సార్ అభిమాని.
దీన్నిబట్టి.. టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ఇచ్చిన యాడ్‌ను డబ్బాశకు కక్కుర్తి పడి ప్రచురించిన సాక్షి యాజమాన్యమైన జగన్ కుటుంబంపై, కరుడుగట్టిన జగన్ అభిమానులు ఏ స్ధాయిలో నిప్పులు కురిపిస్తున్నారో స్పష్టమవుతోంది.
వేమిరెడ్డిని మందలిస్తారా?
ఇదే అంశంపై అటు టీడీపీ సోషల్‌మీడియా సైనికులు.. ఎంపీ వేమిరెడ్డి తీరుపై నిప్పులు కురిపిస్తున్నారు. కులాభిమానంతోనో, పాత వాసనలు మర్చిపోలేకనో ఆ యాడ్ ఇచ్చినట్లుందని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అసలు టీడీపీపై విషం చిమ్మే సాక్షికి యాడ్ ఇవ్వడమేమిటి? రాష్ట్రంలో ఏ ఎంపి, ఏ ఎమ్మెల్యే సాక్షికి యాడ్స్ ఇవ్వనప్పుడు వేమిరెడ్డి ప్రత్యేకత ఏంటి? మరి దీనిపై నాయకత్వం ఆయనను మందలిస్తుందా? అసలు ఆయనకు ఇది పద్ధతి కాదని చెప్పేదెవరు? పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లకు టికెట్లు ఇస్తే ఫలితాలు ఇంతకుమించి ఎలా ఉంటాయి? వాళ్లకు పార్టీ సిద్ధాంతాలు, కార్యకర్తల మనోభావాలతో పనేముంటుంది? వాళ్ల అవసరాలకు పార్టీలో చేరతారు. మనం కూడా మన అవసరాలకు పార్టీలో చేర్చుకుంటున్నాం. ఇక కమిట్‌మెంట్ ఎక్కడుంటుంది? ఇదే యాడ్ ఏ బీసీనో, ఎస్సీనో, ఏ కమ్మ ఎంపీనో ఇస్తే పార్టీ సహిస్తుందా? మరి వేమిరెడ్డి ప్రత్యేకత ఏమిటి? ఇప్పుడు వ్యక్తులు ముఖ్యమా? పార్టీ ముఖ్యమా అన్నది తేల్చాల్సిందే నాయకత్వమే’’నని టీడీపీ సోషల్‌మీడియా సైనికులు శివాలెత్తుతున్నారు.