– ఇప్పుడు కేంద్రం రాష్ట్రానికి యూరియా సంవృద్ధిగా ఇస్తున్నా ఇంకా ఎరువుల షాపుల ముందు చెప్పులు, రైతుల క్యూలు సిగ్గుచేటు
– కేంద్రం 12.02 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా యూరియా తెలంగాణ రాష్ట్రానికి పంపిణీ
– అంటే అదనంగా దాదాపు 3 లక్షల టన్నుల యూరియా పంపిణీ
– ఆ యూరియా ఏమవుతోందని గ్రామాలకు వెళ్లి చర్చ పెట్టండి
– రైతులకు మోదీ సర్కారు సంక్షేమాన్ని రచ్చబండ పెట్టి వివరించండి
– సెప్టెంబరు లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి
– రైతులు బీజేపీ వైపు చూస్తున్నారు
-భారతీయ కిసాన్ సంఘ్ గుజరాత్లో బిజెపి గెలుపునకు మూలస్తంభంగా నిలిచింది
-బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర పదాధికారుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు
హైదరాబాద్: బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర పదాధికారుల సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు
పాల్గొన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ,బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి ,రాష్ట్ర స్థాయి పదాధికారులు, జిల్లా ఇంఛార్జులు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావు ఏమన్నారంటే.. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, రైతుల సమస్యలు, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతుల ఆత్మహత్యలు వంటి విషయాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్నా, ఇప్పటికీ రైతుల సమస్యల గురించి పట్టించుకోలేదు.
ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్నాయని రైతుల శ్రేయస్సు గురించి మాట్లాడటం సిగ్గుచేటు. ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసిన
“రైతు భరోసా”ను పూర్తిగా అమలు చేయలేదు. ధరణిని భూభారతిగా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, రైతులకు ఉపశమనంగా మారాల్సిన ఈ వ్యవస్థను సమస్యల కూపంగా మార్చింది. అనేకమంది రైతులు రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
వ్యవస్థలో పారదర్శకత లేకపోవడం, సాంకేతిక లోపాలు రైతుల భూముల విషయంలో ఇబ్బందులకు దారితీస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రైతులకు జరుగుతున్న మేలు, నష్టాలపై కిసాన్ మోర్చా నాయకులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయాలి. హైకోర్టు సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి.
హైకోర్టు సూచన మేరకు సెప్టెంబరు లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాలి. హైకోర్టు చివాట్లు పెట్టిన తర్వాతే
కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 6 వేల చొప్పున రైతు భరోసా ఇచ్చినట్లు చెబుతోంది.
ఎన్నికల సమయంలో ప్రతి రైతుకు రూ. 15,000 చొప్పున భరోసా అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, తరువాత దానిని రూ. 12,000కి తగ్గించింది.
ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ, హడావుడిగా కేవలం రూ.6,000 చొప్పున మాత్రమే నిధులు విడుదల చేసింది.ఒకవైపు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలిచ్చే పరిస్థితి లేదు. రిటైర్మెంట్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. మోదీ ప్రభుత్వం
దేశ వ్యాప్తంగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో మార్కెటింగ్ మరియు రుణ సదుపాయాలు కల్పిస్తోంది. 14 రకాల పంటలకు ఎంఎస్పీ పెంచింది.
అయితే రాష్ట్ర ప్రభుత్వం అబద్ధపు ప్రచారంతో ప్రజల దృష్టిని మరల్చుతోంది. యూపీఏ హయాంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.రాత్రిపగలు ఫర్టిలైజర్ షాపుల ముందు పడిగాపులు కాసేవారు. చెప్పులు క్యూలైన్లలో పెట్టి మరీ వేచి ఉండేవారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక,బ్లాక్ మార్కెటింగ్ ను నిర్మూలించేలా నీమ్ కోటెడ్ యూరియా ను అన్ని రాష్ట్రాలకు సరిపడేలా పంపిణీ చేస్తోంది. కానీ, తెలంగాణ రాష్ట్రంలో
కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యూరియా పంపిణీ చేయలేదని, యూరియా కొరత ఉందని అవాస్తవాలు ప్రచారం చేస్తోంది.
కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం యూరియా ఇవ్వలేదంటూ తప్పుడు ప్రచారం చేస్తోంది. వాస్తవానికి 2024–25 రబీ సీజన్ కోసం అవసరమైన 9.5 లక్షల మెట్రిక్ టన్నులకు బదులుగా, కేంద్రం 12.02 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా యూరియాను తెలంగాణ రాష్ట్రానికి పంపిణీ చేసింది. అంటే అదనంగా దాదాపు 3 లక్షల టన్నుల యూరియాను పంపించింది. ఎరువులన్నింటినీ కేంద్రం అందిస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీరాజ్ ఎన్నికల రాజకీయ లబ్ధి కోసమే యూరియా కొరత అంటూ అపోహలు సృష్టిస్తోంది. అధికారంలోకి వచ్చినప్పుడు 14 పంటలకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే ఇప్పటికీ ఆ బోనస్ చెల్లింపులు ఎక్కడా జరగలేదు.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, సాయిల్ హెల్త్ కార్డులు, ఫసల్ బీమా యోజనతో మోదీ ప్రభుత్వం రైతులకు భరోసా ఇస్తోంది. సాగునీటిని విస్తరించేందుకు
ప్రధాన్ మంత్రి కృషి సించాయీ యోజన అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాల నుంచి పంట నష్టపోయిన రైతులను ఆదుకునేలా కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేస్తోంది. కాని రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడం లేదు.
గుజరాత్లో రైతు ఉద్యమాల కేంద్రబిందువుగా భారతీయ కిసాన్ సంఘ్ పనిచేసింది. దీని మూలంగా రైతులలో భారతీయ జనతా పార్టీ మీద ప్రజల
విశ్వాసాన్ని చూరగొంది. దీంతో గుజరాత్లో బిజెపి గెలుపునకు ఒక మూలస్తంభంగా నిలిచింది. గుజరాత్లో పలు సందర్భాల్లో ఈ సంఘం రైతు సమస్యలపై ఉద్యమాలు చేపట్టింది. అందుకే అన్ని మోర్చాల కంటే ఎక్కువ బాధ్యత కిసాన్ మోర్చాదే. అన్ని జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల్లో రైతులతో మమేకమై, వారి సమస్యలపై ఉద్యమించాలి.
ప్రస్తుతం రైతులు బీజేపీ వైపు చూస్తున్నారు. కష్టపడే రైతుల పక్షాన బిజెపి నిలుస్తుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కిసాన్ మోర్చా నాయకత్వంలో రైతుల సమస్యలను పరిష్కరించుకునేలా కష్టపడి పనిచేయాలి. నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ పథకాల్ని గ్రామీణ స్థాయిలో చైతన్యం కల్పిస్తూ విస్తృతంగా తెలియజేయాలి.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిన మోసాలను బహిర్గతం చేయాలి. రానున్న పంచాయతీరాజ్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలి.