Suryaa.co.in

Editorial

సంక్రాంతి తర్వాత రణ.. జనక్షేత్రంలోకి రాజు

– తిరుమల వెంకన్న దర్శనంతో ఆంధ్రాలోకి అడుగుపెట్టిన ఎంపి రఘురామకృష్ణంరాజు
– సంక్రాంతి తర్వాత నర్సాపురం నియోజకవర్గంలో విస్తృత పర్యటనలు
– తొలుత ఆత్మీయ-కుల సమావేశాలు
– ప్రభుత్వ-వైసీపీ బాధితులతో భేటీలు
– వైసీపీ అసమ్మతి నేతలతో నియోజకవర్గాల వారీగా సమావేశాలు
– ఎన్నికల్లో పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరులో ప్రచారం
– చట్ట-న్యాయపరమైన బందోబస్తుతో ఆంధ్రాలోకి ఎంపి రాజు రీ ఎంట్రీ
– ఇప్పటిదాకా అక్రమ కేసుల బెదిరింపులతో హస్తినకే పరిమితం
– అయినా ఢిల్లీలోనూ జగన్ సర్కారును వదలిపెట్టకుండా రాజు ‘రచ్చబండ’
( మార్తి సుబ్రహ్మణ్యం)

నాలుగేళ్ల విరామానంత నర్సాపురం వైసీపీ రెబెల్ ఎంపీ కె.రఘురామకృష్ణంరాజు తిరిగి ఆంధ్రాలో కాలుమోపనున్నారు. సీఎం జగన్‌పై తిరుగుబాటుబావుటా ఎగరేసిన రాజును, ఆయన స్వంత నియోజకవర్గమైన నర్సాపురంలో ఒంటరిని చేశారు. ఆయన స్థానంలో పార్టీపరంగా ఒక ఇన్చార్జిని నియమించారు. చివరకు తన నియోజకవర్గంలో జరిగిన ప్రధాని మోదీ ఆవిష్కరించిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికీ రాజును రాకుండా అడ్డుకున్నారు. సీఐడీ పోలీసులు హైదరాబాద్ వెళ్లి మరీ రాజును చెరబట్టి, కస్టడీలో హింసించిన వైనం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇది పార్లమెంటులో ప్రివిలేజ్ కమిటీ వరకూ వెళ్లింది. ఇక లెక్కలేనన్ని కేసులు. ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులకయితే లెక్కలేదు.

అప్పటినుంచీ అటు ఆంధ్రా-ఇటు నియోజకవర్గానికి దూరంగా ఉంటున్న రాజు.. తన నియోజకవర్గ సమస్యలు మాత్రం మర్చిపోలేదు. పెండింగ్ ప్రాజెక్టులు, సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళుతూనే ఉన్నారు. రైల్వే బడ్జెట్‌లోనూ తన నియోజకవర్గ ప్రజల కోసం మాట్లాడారు. సమయం వచ్చినప్పుడల్లా పార్లమెంట్‌లో.. జగన్ ప్రభుత్వ వైఫల్యాలు, నిధుల మళ్లింపు, అడ్డగోలు అప్పులు, ఏపీలో దారి తప్పుతున్న శాంతిభద్రతల అంశాలపై గళం విప్పుతూనే ఉన్నారు. ఆయన ఇప్పటికే జగన్ సర్కారుకు సాగిలబడిన పలువురు ఏఐఎస్, ఐపిఎస్‌లకు వ్యతిరేకంగా ప్రధాని, హోంమంత్రి, డిఓపీటీకి ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలన్నది ఆయన ఫిర్యాదు.

రాష్ట్రానికి సంబంధించి జగన్ సర్కారు తీసుకుంటున్న అనేక నిర్ణయాలను వ్యతిరేకిస్తూ, రాజు కేంద్రానికి రాసిన లేఖలు ఇప్పటికి వందల్లోనే ఉంటాయి. అంటే ఏపీలో జగన్ పాలనను, ఆయన ఎంత నిశితంగా పరిశీలిస్తున్నారో స్పష్టమవుతుంది. ప్రధానంగా కేంద్రం వివిధ పథకాలకు ఇస్తున్న నిధులను.. దారిమళ్లిస్తున్న జగన్ సర్కారు తీరుపై, రాజు చేసిన ఫిర్యాదులు రచ్చ అయ్యాయి. తన లేఖలకు రుజువులు కూడా జతపరిచే రాజు ఫిర్యాదులకు.. కేంద్రం స్పందించడం, రాష్ట్రానికి లేఖలు రాయడం అనివార్యంగా మారిందనేకంటే.. రాజునే దానిని అనివార్యం చేశారనడం సబబు.

ఇక ఏపీలో జగన్ సర్కారుకు వ్యతిరేకంగా గళం విప్పేవారికి.. ఢిల్లీలో ఆయనే ఆశ్రయం ఇచ్చి, ఢిల్లీలో ఉద్యమాలకు భుజం తడుతున్నారు. అమరావతి రైతుల ఉద్యమం, ఉపాథి హామీ పథకం బిల్లుల కోసం ఢిల్లీకి వెళ్లిన బాధితులు, ఏపీలో శాంతిభద్రతలు కాపాడాలని ఢిల్లీలో ధర్నాలు చేసిన వారికి, రాజు సొంత ఖర్చులతో వసతి కల్పిస్తున్నారు. వారిని సంబంధిత శాఖల మంత్రుల వద్దకు కూడా ఆయనే తీసుకువెళుతున్నారు.

ఇక రచ్చబండ పేరుతో ఢిల్లీలోనే ప్రతిరోజూ ప్రెస్‌మీట్లు నిర్వహిస్తూ, అసలు సిసలు విపక్ష నేతగా అవతరించారు. ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రస్తావించలేని అనేక కుంభ కోణాలు, కొత్త విషయాలను, ప్రధానంగా వైసీపీ అంతర్గత వ్యవహారాలను మీడియాకు వెల్లడిస్తున్నారు. ఎంపి రాజు నిర్వహించే ప్రెస్‌మీట్లకు, యూట్యూబ్‌లో లక్షలసంఖ్యలో ఆదరణ లభిస్తోంది. పెద్ద పెద్ద మీడియా సంస్థలకు సైతం.. ఎంపి రాజు ప్రెస్‌మీట్, డిబేట్లు ఒక ఆదాయవనరుగా మారడం విశేషం.

అంటే ఎంపి రాజు ఎన్ని లక్షల మందిని ప్రభావితం చేస్తున్నారు? ఎంతమందిని జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారు చేస్తున్నారన్నది స్పష్టమవుతోంది. ఒక్కముక్కలో చెప్పాలంటే… నిత్యం నియోజకవర్గాల్లో ఉంటూ, ఏమీ చేయని అనేకమంది ఎంపీల కంటే… ఢిల్లీలో ఉన్నా ఆంధ్రాగళాన్ని వినిపిస్తున్న ఏకైక ఎంపీ రఘురామకృష్ణంరాజేనన్నది నిష్ఠుర నిజం.

అక్రమ కేసులు- బెదిరింపులతో ఇన్నాళ్లూ తనను.. ఢిల్లీకే పరిమితం చేసిన వైసీపీ సర్కారును, ఇకపై ఖాతరు చేయకూడదని ఎంపి రాజు నిర్ణయించుకున్నారు. అన్నింటికీ తెగించి ఇక ఆంధ్రాలో అడుగుపెట్టాలని నిర్ణయించారు. అందుకు తొలి అడుగుగా కొద్దిరోజుల క్రితమే తిరుమల వెళ్లి, తన ఇష్టదైవమైన వెంకన్న ఆశీర్వాదాలు తీసుకున్నారు. సంక్రాంతి తర్వాత నర్సాపురం వెళ్లితీరతానని, తనకు ఎదురయ్యే అడ్డంకులన్నీ ప్రజల మద్దతు-ఆశీర్వాదంతో ఎదుర్కొంటానని రాజు చెబుతున్నారు.

అయితే ముందుగా నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సభలు, తర్వాత కుల సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు. దానితోపాటు.. తన లోక్‌సభ నియోజకవర్గంలో, వైసీపీ పార్టీ-సర్కారు బాధితులతో నియోజకవర్గాల వారీగా భేటీ కావాలని యోచిస్తున్నారు. వైసీపీ అసమ్మతి నేతలతో ఇప్పటికే టచ్‌లో ఉన్న ఆయన, వారితో నేరుగా సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు.

రాజు అధికారికంగా వైసీపీలో లేకపోయినప్పటికీ.. నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గంలోని పలువురు వైసీపీ నేతలు, క్షత్రియ-మత్స్యకార- శెట్టిబలిజ-కాపువర్గ నేతలు, తరచూ ఢిల్లీకి వెళ్లి ఆయనను కలుస్తున్నారన్నది అందరికీ తెలిసిందే. ఎంపి రాజు హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ఆయన నివాసం భీమవరం, ఉండి, నర్సాపురం నేతలతో కిటకిటలాడుతుంటుంది.

రఘురామరాజు ఏ పరిస్థితిలో, అనివార్యంగా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారో ప్రజలకు తెలిసినప్పటికీ… ఆ కారణాలు వివరిస్తూ, ప్రజలకు లేఖ రూపంలో కరపత్రాల ద్వారా వెల్లడించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వాటిని ప్రజలకు స్వయంగా, సోషల్‌మీడియా, పత్రికల ద్వారా చేరవేయాలని భావిస్తున్నారు.

ఇక ఎన్నికల సమయంలో పులివెందులలో జగన్‌కు వ్యతిరేకంగా.. టీడీపీ అభ్యర్ధి బీటెక్ రవి, జమ్మలమడుగులో బీజేపీ అభ్యర్ధి ఆదినారాయణరెడ్డి, ప్రొద్దుటూరులో టీడీపీ అభ్యర్ధి వరదరాజులు రెడ్డి విజయానికి, స్వయంగా వెళ్లి ప్రచారం చేయాలని రాజు నిర్ణయించుకున్నారు. ఒక్కో నియోజకర్గంలో ఒక రోజు ప్రచారం నిర్వహించనున్నారు. అదేవిధంగా జగన్ మెప్పు కోసం.. తనను విమర్శించిన మంత్రుల నియోజకవర్గాల్లో కూడా, టీడీపీ-జనసేన-బీజేపీ అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది.

అయితే.. దానికంటే ముందు రాష్ట్రంలో నెలకొన్న, రాజకీయ కక్ష సాధింపు, అక్రమ కేసుల వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని, దానిని చట్ట-న్యాయపరమైన అంశాలతో ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు, ఆయన అనుచరులు చెబుతున్నారు. అన్ని రక్షణ కవచాలతోనే రాజు ఆంధ్రాలోకి అడుగుపెడుతున్నట్లు స్పష్టమయింది. బహుశా తన పర్యటనలో ప్రభుత్వం నుంచి, రక్షణ క ల్పించాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయిస్తారేమో చూడాలి.

‘నేనైతే సంక్రాతి తర్వాత నర్సాపురం నియోజకవర్గంలో పర్యటిస్తా. అక్కడే ఉంటా. నేను ఏ కారణాలతో నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నానో నా ప్రజలకు తెలుసు. నాకు రోజూ వందలమంది నియోజకవర్గ ప్రజలు ఫోన్ చేస్తూనే ఉంటారు. చానెళ్లు, యూట్యూబ్‌లో వచ్చే నా ప్రెస్‌మీట్లు ఫాలో అవుతున్నామని నాకు ఫోన్ చేసి చెబుతుంటారు. నేను భౌతికంగా అక్కడ లేకపోవచ్చు గానీ, వారి సమస్యలను అటెండ్ చేస్తూనే ఉన్నా. నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం కేంద్రానికి లేఖలు రాస్తూనే ఉన్నా’నని రాజు గుర్తు చేశారు.

‘నన్ను బహిరంగంగా సమర్థిస్తే స్థానికంగా వారికి నా వల్ల ఇబ్బంది కలుగుతుందని నాకు తెలుసు. అందుకే నాకోసం ఎవరూ మాట్లాడవద్దు. ఫ్లెక్సీలు కట్టవద్దని నేనే చెప్పా. ఈ ప్రభుత్వాన్ని నేను ఒక్కడినే ఎదుర్కొంటానని వారికి చెప్పా. నేను అన్నింటికీ సిద్ధమయ్యే ఆంధ్రాకు వెళుతున్నా. నా వ్యూహం నాకుంది. వెంకటేశ్వరస్వామి దయ వల్ల ప్రాణాలతో సీఐడీ చెర నుంచి బయటపడ్డా. నిజానికి అది నాకు రెండో జన్మ. అంతకుమించి నన్నేం చేస్తారు? నేను పకడ్బందీగా అన్ని అస్త్రాలతోనే వస్తున్నా’ అని రఘురామకృష్ణంరాజు చెప్పారు.

LEAVE A RESPONSE