బెంగాల్ శాసనసభలో అడుగుపెట్టకపోతే, రాబోయే రోజుల్లో ‘సుత్తి కొడవలి నక్షత్రం’ గుర్తుపై పట్టు కోల్పోయే ప్రమాదం
ఈ సంవత్సరం వామపక్షాలకు చాలా క్లిష్టమైన సంవత్సరం. కేరళ, పశ్చిమబెంగాల్ లాంటి రెండు ముఖ్యమైన రాష్ట్రాలలో ఎన్నికలు సమీపించాయి. ఒక రాష్ట్రంలో గతవైభవం కోసం పెనుగులాట, మరో రాష్ట్రంలో ఉన్న వైభవాన్ని నిలుపుకొని మరింత పెంచుకోవాలనే తాపత్రయం. ఇప్పటికే వామపక్ష పార్టీలలో ప్రధానపార్టీ సీపీఐ తన జాతీయహోదాను కోల్పోయింది. సీపీఎం మాత్రం కేరళ, పశ్చిమబెంగాల్, త్రిపుర, తమిళనాడు రాష్ట్రాలలో రాష్ట్రపార్టీ హోదాను కాపాడుకొని జాతీయపార్టీ హోదాలో కొనసాగుతున్నది.
ఒకనాడు “భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం” అంటూ జరిగిన తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనేంత శక్తివంతంగా ఉన్న కమ్యూనిస్టుపార్టీ(లు), నేడు రెండు తెలుగురాష్ట్రాలలో కనీసం రాష్ట్రపార్టీ హోదాలో కూడా లేకపోవటం బాధాకరం. ఇక తుపాకీ పట్టుకొని అడవుల్లోకి వెళ్ళిన మరో పార్టీ పరిస్థితి అంతిమఘడియల్లో ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో సీపీఎం కేరళలో అధికారాన్ని నిలబెట్టుకోవటంతో పాటు, తన జాతీయహోదాను కూడా కాపాడుకోవలసి ఉంటుంది.
ప్రాంతీయ పార్టీల హవా మొదలయ్యాక జాతీయపార్టీలకు గడ్డుకాలం దాపురించింది. ప్రాంతానికో సమస్య ఉంటుంది. ఆయా సమస్యలపై ప్రాంతీయపార్టీలు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోగలుగుతాయి. అవసరమైతే ప్రాంతీయ భావోద్వేగాలను ప్రేరేపించగలవు. మరికొన్ని పార్టీలు ఆ భావోద్వేగాలను చెక్కుచెదరకుండా సజీవంగా ఉంచే ప్రయత్నం చేస్తుంటాయి. కానీ జాతీయ పార్టీలకు అది కష్టం.
ఇప్పుడు సీపీఎం పార్టీని గమనిస్తే, జాతీయ పార్టీ హోదాకు తామే అధికారంలో ఉన్న కేరళతో పాటు తమిళనాడులో ఉన్న రాష్ట్ర పార్టీ హోదా కూడా అవసరమే. కానీ ఈ రెండు రాష్ట్రాల మధ్య ‘నీటి పంచాయతీ’ ఉన్నది. ప్రభుత్వంగా కేరళ ప్రజల అవసరాలను, ఆకాంక్షలను కాపాడాలి. అదే సమయంలో తమిళనాడు ప్రజల నీటికొరతను అర్థం చేసుకోవాలి. తమిళనాడులో సొంతంగా పోటీచేసి అవసరమైన ఓట్ల శాతాన్ని పొందటం అసాధ్యమని 2016 శాసనసభ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి.
2016 తమిళనాడు ఎన్నికలలో మార్క్సిస్టు పార్టీ డీఎంకే, ఏఐఏడీఎంకే లాంటి బలమైన పార్టీలతో కాకుండా ‘పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్’ అనే కూటమితో జతకట్టి 25 స్థానాల్లో పోటీ చేసినా, కేవలం 0.72 శాతం ఓట్లను మాత్రమే సాధించగలిగింది. ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. కానీ 2021 శాసనసభ ఎన్నికలలో డీఎంకే నేతృత్వంలోని ‘సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్’తో పొత్తు పెట్టుకున్న సీపీఎం, 6 స్థానాల్లో పోటీచేసి రెండు స్థానాలను కైవసం చేసుకున్నది. పోటీచేసిన స్థానాల్లో 35 నుండి 45 శాతం వరకు ఓట్లను సాధించింది.
2024 లోక్సభ ఎన్నికలలో కూడా డీఎంకే పొత్తుతో మధురై, దిండిగల్ రెండు పార్లమెంటు స్థానాలలో పోటీ చేసి, వందశాతం స్ట్రైక్ రేటుతో రెండింటినీ గెలుచుకున్నది. తమిళనాడులోని మధురై, కోయంబత్తూర్, నాగపట్టణం, కన్యాకుమారి లాంటి పారిశ్రామికవాడల్లోని కార్మికులలోనూ, వ్యవసాయ కూలీలలోనూ పార్టీకి మంచి పట్టు ఉంది. స్థిరమైన ఓటు బ్యాంకు కూడా ఉన్నది.
కానీ పొత్తుల్లో భాగంగా తక్కువ సీట్లకే పరిమితమవటం వలన, రాష్ట్రస్థాయిలో ఓట్ల శాతం తక్కువగా కనిపిస్తున్నది. అలా అని ఒంటరిగా పోటీ చేస్తే ప్రాంతీయ భావోద్వేగాల మధ్య నెగ్గుకురాలేని పరిస్థితి. అందువలనే సైద్ధాంతికంగా డీఎంకేతో విభేదాలు ఉన్నప్పటికీ, రాబోయే శాసనసభ ఎన్నికలలో పొత్తు కోసమే చర్చలు జరుపుతున్నది.
వాస్తవంగా చూస్తే తమిళనాడులోని ప్రాంతీయపార్టీలన్నీ కరడుగట్టిన ప్రాంతీయవాదంతో ఉంటాయి. సీపీఎం ప్రాంతీయవాదానికి ఆమడ దూరం. తెలంగాణ ఉద్యమ సమయంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఉద్యమ అనివార్యతను అర్థం చేసుకుని తన ఉనికిని కాపాడుకున్నది. కానీ సీపీఎం మాత్రం ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’ నినాదానికే కట్టుబడి ఉండిపోయింది. అటువంటి సీపీఎం, ఇప్పుడు తమిళనాడులో డీఎంకేతో పొత్తు కోసం తాపత్రయపడక తప్పని పరిస్థితి.
ఒక వారం పదిరోజుల తేడాతో జరగబోయే రెండురాష్ట్రాల ఎన్నికలలో సీపీఎం నీటి సమస్యపై రెండు రకాలుగా స్పందించవలసి ఉంటుంది. కోయంబత్తూరులో మార్క్సిస్టు పార్టీ బలంగానే ఉన్నది. కోయంబత్తూరుకు తాగునీటి సమస్యను తీరుస్తున్నది ‘సిరువాణి ఆనకట్ట’. ఇది కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోని సిరువాణి నది పైన 1984లో కేరళ ప్రభుత్వమే నిర్మించిన ఆనకట్ట.
మన ‘తెలుగుగంగ’ మాదిరిగానే సిరువాణి ఆనకట్ట ప్రధాన ఉద్దేశ్యం కోయంబత్తూరుకు తాగునీరు సరఫరా చేయడం. కానీ ఇప్పుడు తన రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం సిరువాణి నది పైన చెక్ డ్యామ్లు నిర్మిస్తున్నది సీపీఎం నేతృత్వంలోని పినరయి విజయన్ ప్రభుత్వం. ఈ కారణంగా సిరువాణి జలాశయానికి నీటి సరఫరా తగ్గుతున్నది. అదే సమయంలో జలాశయానికి నీటి సరఫరా చేస్తున్న ఆనకట్ట నుండి రోజుకు పది మిలియన్ లీటర్ల నీరు లీక్ అవుతున్నదని, మరమ్మతులకు అవసరమైన పర్మిషన్లు కేరళ ప్రభుత్వం ఇవ్వటం లేదని తమిళనాడు వాదన.
రెండు రాష్ట్రాల వివాదానికి నెలవైన సిరువాణి నది నీరు రుచిలో ప్రపంచంలో నైలు నది ప్రథమస్థానంలో ఉండగా, సిరువాణి రెండవ స్థానంలో ఉన్నది. నెయ్యార్ నదీ జలాల వివాదం కూడా రెండురాష్ట్రాల స్నేహ సంబంధాలను దెబ్బతీస్తున్నది. నెయ్యార్ నది కేరళలో పుట్టి కేరళలోనే సముద్రంలో కలుస్తుంది. కన్యాకుమారి పరిసర ప్రాంతాలలో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగలిగిన తమిళనాడు సీపీఎం విభాగం, ఈ విషయంలో కేరళ పార్టీతో విభేదిస్తున్నది.
ఇక 125 సంవత్సరాల క్రితం పెరియార్ నది పైన నిర్మించి, 99 సంవత్సరాల లీజుతో నీటిని పొందుతున్న తమిళనాడుకు, కేరళకు మధ్య ఉన్న ‘ముల్లపెరియార్’ వివాదం రెండురాష్ట్రాలను శత్రువుల్లా మార్చింది. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉండటం వలన ఎవరూ మాట్లాడే పరిస్థితి లేదు. జాతీయపార్టీ హోదాను పొందటంలో సీపీఎంకు ఈ రెండు రాష్ట్రాలూ అవసరమే కాబట్టి, ఈ ‘కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్’ ను సీపీఎం జాగ్రత్తగా డీల్ చేయవలసి ఉంటుంది.
మార్క్సిస్టు పార్టీకి మరో అతి ముఖ్యమైన రాష్ట్రం పశ్చిమ బెంగాల్. పువ్వులమ్మిన చోటే కట్టెలమ్మే పరిస్థితి బెంగాల్లో సీపీఎం అనుభవిస్తోంది. 34 సంవత్సరాలు నిరాటంకంగా రాష్ట్రాన్ని ఏలిన పార్టీకి ప్రస్తుతం ప్రతిపక్ష హోదా కూడా లేకపోవటం దారుణం. కారణాలు అన్వేషించి చక్కదిద్దుకునే సమయం ఏనాడో చేజారిపోయింది. శాసనసభలో సీపీఎం ప్రతినిధులే లేకపోవటం విచిత్రం. అధికారంలో ఉన్నప్పుడే కలకత్తా లాంటి ప్రాంతాల్లో ప్రాభవాన్ని కోల్పోయింది.
కార్మికులు ఉన్నచోట ‘కార్మిక నియంతృత్వాన్ని’ పంథాగా ఎంచుకున్న పార్టీలకు కాకుండా, ఎన్నికల ఎజెండానే పంథాగా ఎంచుకున్న పార్టీలను ఓటర్లు ఆదరించారంటే… లోపం ఎక్కడుందో తెలుసుకోవటంలో సీపీఎం విఫలమైందనే చెప్పాలి.ఇప్పుడు కొత్తతరాన్ని రంగంలోకి దించే ప్రయత్నంలో పార్టీ ఉన్నది. కానీ కమ్యూనిస్టు పార్టీల సమస్య, నాయకుల జీవితాలలో ఉన్నంత సరళత్వం, వారు ఉపయోగించే భాషలో ఉండకపోవటం. వాడుక భాష కాకుండా పడికట్టు పదాలతో వారి ప్రసంగాలు నిండి ఉంటాయి.
ఆ మధ్య మధురైలో జరిగిన సమావేశంలో వక్తలు ప్రసంగించిన ప్రసంగాలలో, కొద్దిగా సరళమైన భాషను ఉపయోగిస్తే బాగుండేదనిపించింది. రాజకీయ పార్టీలు ప్రజలను అంతర్జాతీయ సమస్యల వైపు కాకుండా, నిత్య జీవితంలో రోజువారి ఎదురయ్యే సమస్యల పరిష్కారం కంటే మరేమీ ఆశించనిస్థాయికి తీసుకువెళ్తున్నాయి. ‘పంచవర్ష ప్రణాళిక’ అంటే ప్రజలకు అర్థం కావటం లేదు. “2047 నాటికి దేశం వెలిగిపోతుంది” అంటే, “2046 డిసెంబర్ 31న కూడా రేపటి నుండే కదా వెలిగేది” అనేంత సర్దుబాటు ధోరణిలోకి ప్రజలు వెళ్ళిపోయారు.
ప్రజల దృష్టిలో సంప్రదాయవాదులు జాతీయవాదులు అయిపోయారు. సంప్రదాయ రాజకీయపార్టీలది చాందసవాదం అయిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు చాలా క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. సీపీఎం ఒక వ్యూహంతో బెంగాల్ శాసనసభలో అడుగుపెట్టకపోతే, రాబోయే రోజుల్లో ‘సుత్తి కొడవలి నక్షత్రం’ గుర్తుపై పట్టు కోల్పోయే ప్రమాదం ఉన్నది.
“సీపీఐ, సీపీఎం ఏకమవ్వాలంటే ఏం చేయాలి?” అనే చర్చల మధ్య పెరిగిన వామపక్ష అభిమానులకు, ఇప్పుడు ఎర్రజెండా రెపరెపలు కనిపిస్తేనే సంతోషించే పరిస్థితి రావడం అత్యంత బాధాకరం. ప్రస్తుతానికి వామపక్ష అభిమానులు కోరుకోగలిగేది ఒక్కటే… భవిష్యత్తులో రెండు పార్టీలూ జాతీయహోదాను కలిగి ఉండేలా ప్రణాళికలు రచించుకుని ఎదగాలని! ముఖ్యంగా సీపీఎం తన హోదాను నిలబెట్టుకుంటూ ముందుకు సాగాలని.!
– ఇంద్రాణి