Suryaa.co.in

Editorial

తొందరపడి ముందే కూస్తున్న తమ్ముళ్లు

– ఇసుక అమ్మకాల్లో తమ్ముళ్ల దూకుడు
– వైసీపీ నేతలు దాచిన ఇసుక డంపులపై తమ్ముళ్ల కన్ను
– ఆరునెలల వరకూ ఢోకాలేని ఇసుక ఆదాయం
– బాబు ఆదేశాలు బేఖాతర్
– చెడ్డపేరు తీసుకురావద్దన్న చంద్రబాబు
– అయినా ఆకలితో పట్టించుకోని తమ్ముళ్లు
– నెల్లూరులో 3 కోట్లకు ఇసుక అమ్మేసుకున్న ఓ రెడ్డిగారు
– లారీ ఓనర్లకు ఖరీదై కట్టేసిన ఆ రాష్ట్ర ప్రముఖుడు
– ఇటీవలే కీలక పదవి దక్కించుకున్న ఆ నేత
– రావులపాలెం, కొవ్వూరు, నిడదవోలులో ఇసుక అమ్మకాలు
– రాంభొట్లపాలెంలో జనసేన-టీడీపీ నేతల ప్రొక్లైయినర్ల యుద్ధం
– పోటాపోటీగా మట్టి తవ్వకాలు
– ఆకలితో పార్టీని అప్రతిష్ఠపాలు చేస్తున్న తెలుగుతమ్ముళ్లు
– చర్యలకొరడా ఝళిపించకపోతే నష్టమేనంటున్న పార్టీ వర్గాలు
– ఉచిత ఇసుక పాలసీ ప్రకటనే దీనికి పరిష్కారమంటున్న నేతలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

‘గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను మీరూ చేయవద్దు. గత ప్రభుత్వానికి- మన ప్రభుత్వానికి మార్పు ఏమిటన్నది ప్రజలు గమనించాలి. మీరు ఎలాంటి తప్పులు చేసినా దానిని భూతద్దంలో చూపేందుకు జగన్ సాక్షి మీడియా సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే పనులు చేయకండి’’

– ఇది పార్టీ ప్రతిష్ఠను కాపాడాలంటూ కుప్పం సహా, మరికొన్ని వేదికలపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు చేసిన సూచన. కానీ.. తమ్ముళ్ల ఆకలి ముందు, అధినేత హెచ్చరికలు వినిపించకుండా పోతున్నాయి. స్వయంగా రాష్ట్రంలో కీలక పదవి పొందిన నెల్లూరు రెడ్డిగారే దానిని ధిక్కరించిన వైనం. ఆయనొక్కడే కాదు. రావులపాలెం, కొవ్వూరు, నిడదవోలులో తమ్ముళ్లు ఐదేళ్ల ఆకలితో ఇసుకను మింగేసే బరితెగింపు వైనం పార్టీని ప్రజల్లో అప్రతిష్ఠపాలు చేస్తోంది.

గత ఐదేళ్ల జగన్‌రెడ్డి విధ్వంస పాలనలో వైకాపేయులు ఇసుక రీచ్‌లు పిండేసుకున్నారు. మట్టిని పెళ్లగించి కోట్లు సంపాదించారు. సోషల్‌మీడియా పుణ్యాన, వారి బరితెగింపు జనంలోకి వెళ్లింది. ఫలితంగా ఆ అక్రమార్కుల పాలనకు ప్రజలు సమాధి కట్టారు. తమకూ అలాంటి పరిస్థితి రాకూడదన్నదే, టీడీపీ అధినేత-సీఎం చంద్రబాబునాయుడు తపన. అడ్డగోలు-అరాచాలకు పాల్పడవద్దని, జగన్‌రెడ్డి పాలన-తమ పాలనకు తేడా చూపించాలన్నది ఆయన తాపత్రయం.

కానీ తమ్ముళ్ల ఆకలి ఆయన తపనను పట్టించుకోవడం లేదు. ఆయన ఆవేదనను లెక్కచేయడంలేదు. ఐదేళ్లు అధికారంలో లేని ఆకలిని, ‘వీలైనంత త్వరగా తీర్చుకోవాలన్న’దే వారి ఆశయం. ఆ తొందరలో వారు పార్టీని పణంగా పెడుతున్నారు. వైసీపీ-టీడీపీ ఒకటేనని చాటేందుకు, తమవంతు కృషి చేస్తున్నారు. ఇందులో వైసీపీ నుంచి టీడీపీలో చేరి, ఉన్నత పదవులు చేపట్టిన ‘నెల్లూరు మహానుభావులూ’ ఉండటమే విభ్రాంతికర వాస్తవం.

నెల్లూరు మర్రిపాడు యార్డులో దాదాపు రెండున్నర లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలు ఉన్నాయి. అందులో లక్షన్నర టన్నుల మెట్రిక్ టన్నుల ఇసుకను.. రాష్ట్ర స్థాయిలో ఉన్నత పదవిలో ఉన్న ఓ ప్రముఖుడు, ‘కేవలం 3 కోట్ల రూపాయలకు మాత్రమే’, లారీ ఓనర్స్‌కు అమ్మేశారన్న ప్రచారం జిల్లాలో గుప్పుమంటోంది. అది ఒక సామాజికవర్గం చేతుల్లో ఉండటంతో, ఎవరూ ఫిర్యాదు చేసే సాహసం చేయలేకపోతున్నారట.

ఆత్మకూరులోని 7 ఇసుక రీచ్‌లను కూడా తవ్వేశారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఇప్పుడు నెల్లూరు, రూరల్ నియోజకవర్గాల్లో ఇసుక మొత్తాన్ని ఊడ్చేశారన్నది నెల్లూరు జిల్లాలో జరుగుతున్న చర్చ. పోనీ.. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఉన్నత స్థాయికి ఎదిగిన ఆ ప్రముఖడికి, ఎన్నికల్లో ఏమైనా అప్పులయ్యాయా అంటే.. అసలు పార్టీ ఇచ్చిన డబ్బులే ఖర్చుచేయలేదన్నది మరో చర్చ.

ఇక పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు, నిడదవోలు; తూర్పు గోదావరి జిల్లాలోని రావులపాలెం, రాజమండ్రిలోనూ ఇసుకను తమ్ముళ్లు అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. దానికి సంబంధించిన వాటాలపై కూడా, రకరకాల చర్చలు జరుగుతున్నాయి. విచిత్రంగా జనసేన మంత్రికి దీనిపై ఆ పార్టీ కార్యకర్తలు ఫిర్యాదు చేస్తే, సదరు మంత్రి ‘తనకు తెలియకుండా ఎలా జరుగుతుంద’ని నోరెళ్లబెట్టారట.

బాపట్ల జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబుకు, మట్టి తవ్వకాలు తలనొప్పిగా మారాయన్న చర్చ జరుగుతోంది. ఆయన నియోజకవర్గంలోని రాంభొట్లవారిపాలెం గ్రామం సమీపంలో జనసేన-టీడీపీ నేతలు.. మట్టి తవ్వకాల కోసం పోటాపోటీగా ప్రొక్లెయినర్లు తీసుకురావడం వివాదం సృష్టించింది. దానితో రంగంలోకి దిగిన నక్కా, వారంరోజుల వరకూ ఎవరూ తొందరపడవద్దని, ఆలోగా తాను నిర్ణయం తీసుకుంటానని చెప్పి సర్దుబాటు చేసినట్లు జిల్లాలో బాహాటంగానే ప్రచారం జరుగుతోంది.

కాగా.. ఎన్నికల ముందు వైసీపీ నేతలు ముందుచూపుతో, రాష్ట్రవ్యాప్తంగా ఇసుకను తమ పొలాల్లో డంప్ చేసుకున్నారు. ఒక సమాచారం ప్రకారం.. అవన్నీ దాదాపు ఆరునెలలు డెలివరీ చేయవచ్చంటున్నారు. ఇప్పుడు టీడీపీ నేతలు వాటిపై కన్నేసి, స్థానిక అధికారుల సహకారంతో, అందినకాడికి అమ్ముకుంటున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వీటి అమ్మకాల బాధ్యతను లారీ ఓనర్లకు అప్పగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్త్నుయి.

అయితే ఇవన్నీ రహస్యంగా జరుగుతున్న వ్యవహారాలు కాకపోవడమే ప్రస్తావనార్హం. సోషల్‌మీడియాలో పాటు, స్థానికంగా ఉండే యూట్యూబ్ చానెళ్లలో.. వీడియో-ఫొటోలతో సహా కనిపిస్తున్న దృశ్యాలే కావడం విశేషం. ఇసుక-మట్టి తవ్వకాలపై కొన్ని చోట్ల, జనసేన-బీజేపీ నేతలతో విబేధాలు తలెత్తుతున్న వైనం కాస్తా సోషల్‌మీడియాకు చేరేందుకు కారణమవుతోంది.

తాజా పరిణామాలపై.. పార్టీ కోసమే పనిచేసే నిఖార్సైన టీడీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌మీడియాలో ఇసుక-మట్టి తవ్వకాలకు సంబంధించి, వీడియో-ఫొటోలతో సహా వస్తున్న ఇలాంటి వార్తల వల్ల, పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటుందన్నది వారి ఆందోళన-ఆవేదనగా కనిపిస్తోంది. ఐదేళ్లు అధికారంలో లేకపోవడం వల్ల, స్థానిక నేతలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నప్పటికీ.. దాని ఫలితాలు మాత్రం పార్టీనే అనుభవించాల్సి వస్తోందని వాపోతున్నారు. ఐదేళ్లలో పెట్టిన పెట్టుబడికి చక్రవడ్డీతో సంపాదించాలన్న అత్యుత్సాహం పార్టీకి నష్టం కలిగిస్తోందంటున్నారు.

ఐదేళ్లు తాము పార్టీ కోసం లక్షలు ఖర్చు చేశామన్న సాకుతో ఇలాంటి చర్యలకు పాల్పడితే.. ఇక వైసీపీకి-తమకు ఏం తేడా ఉంటుందని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పార్టీ నాయకత్వం సీరియస్‌గా ఆలోచించి, కఠిన నిర్ణయం తీసుకోకపోతే.. చంద్రబాబు-లోకేష్ ఐదేళ్లు పడ్డ కష్టం అంతా, ‘ఇసుకలో పోసిన పన్నీరు’ అవుతుందని హెచ్చరిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏ కారణాలతో ప్రజావ్యతిరేకతకు కారణమయిందన్న వాస్తవాన్ని నియోజకవర్గ స్థాయి టీడీపీ నేతలు విస్మరిస్తున్నారని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

‘మా జిల్లాకు చెందిన ఓ ప్రముఖుడు మర్రిపాడు యార్డులో ఇసుకను లారీ ఓనర్లకు మూడు కోట్లకు అమ్ముకున్నారన్న సంగతి అందరికీ తెలిసిపోయింది. ఆయనకు పార్టీ ఏం తక్కువ చేసింది? మొదటినుంచీ పార్టీలో ఉన్న సీనియర్లను కూడా కాదని, ఇతర పార్టీ నుంచి వచ్చినా అందలం ఎక్కించింది. ఇలాంటి పనుల వల్ల పార్టీ జిల్లాలో ఎంత నష్టపోతుంది? మేం పోలింగ్‌గు ముందు వరకూ వైసీపీ మీద ఇసుక అమ్ముకుంటున్నారని ఆరోపించాం. ఇప్పుడు మా పార్టీ వాళ్లూ అదే పనిచేస్తే, మేం ముఖం ఎక్కడ పెట్టుకోవాలి’’ అని ఓ టీడీపీ సీనియర్ నేత ప్రశ్నించారు.

ఇదిలాఉండగా.. సాధ్యమైనంత త్వరగా ఇసుక పాలసీని ప్రకటిస్తే, ఇలాంటి అరాచకాలకు తెరపడి పార్టీ ప్రతిష్ఠ నిలబడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇసుక ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించడం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారమంటున్నారు. అది కూడా డంపులు, యార్డుల్లో ఇసుక అందుబాటులో ఉన్నప్పుడే ప్రకటించడం ఉత్తమమని సూచిస్తున్నారు.

LEAVE A RESPONSE