– రూ.54 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సీఎం చంద్రబాబు, పీయూష్ గోయెల్ సమక్షంలో ఎంఓయూ
– వివిధ జిల్లాల్లో సమీకృత లాజిస్టిక్స్ విధానం తీసుకువచ్చేందుకు ఎన్ఐసీడీసీ ఒప్పందం
– గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.2.20 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు
విశాఖ: రాష్ట్రంలో గ్రీన్ అల్యూమినియం కాంప్లెక్సు సహా 2జి ఇథనాల్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ఏఎం గ్రీన్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో ఆ సంస్థ ప్రతినిధులు ఈ ఒప్పందాలను చేసుకున్నారు. 30 సీఐఐ భాగస్వామ్య సదస్సు తొలిరోజు రాష్ట్రప్రభుత్వంతో ఏఎం గ్రీన్ సంస్థ వేర్వేరు ఒప్పందాలను కుదుర్చుకుంది. 1 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో గ్రీన్ అల్యూమినియమ్ కాంప్లెక్స్ నిర్మాణంపై ఏఎం గ్రీన్ ఏపీ ప్రభుత్వంతో ఈ ఒప్పందం చేసుకుంది. రూ.40 వేల కోట్ల పెట్టుబడితో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ వద్ద గ్రీన్ అల్యూమినియం పరిశ్రమను ఏర్పాటు చేయనుంది.
అలాగే బయోమాస్ నుంచి వివిధ రకాల హైడ్రోకార్బన్స్ ఉత్పత్తి చేసే పరిశ్రమ ఏర్పాటు కోసం ఏఎం గ్రీన్ సంస్థ ప్రభుత్వంతో మరో ఒప్పందం చేసుకుంది. రూ.10 వేల కోట్లతో సస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యుయల్ తయారీ యూనిట్ ను ఈ సంస్థ పెట్టనుంది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో సెకండ్ జనరేషన్ ఇథనాల్ బయో రిఫైనరీ పరిశ్రమను ఏఎం గ్రీన్ సంస్థ ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే ఈ సంస్థ రూ.50వేల కోట్ల పెట్టుబడులను పెట్టనుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సమీకృత లాజిస్టిక్స్ ఇంటర్ ఫేస్ ప్లాట్ ఫాం యూఎల్ఐపీ ఏర్పాటు చేసేందుకు ఎన్ఐసీడీసీ లాజిస్టిక్స్ డేటా సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.
ఏపీ లాజిస్టిక్స్ కార్పోరేషన్ ఏపీలింక్ ద్వారా పోర్టులు, ఎయిర్ పోర్టులు, రోడ్డు, రైలు మార్గాలు, వేర్ హౌసింగ్ రంగాలను సమన్వయం చేసేందుకు వీలుగా ఈ యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్ ఫేస్ ప్లాట్ ఫాం ఉపకరించనుంది. అటు గ్రీన్ ఎనర్జీ రంగంలోనూ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు రానున్నాయి. సౌర, పవన, గ్రీన్ హైడ్రోజన్ , గ్రీన్ అమ్మోనియా సహా పంప్డ్ హైడ్రో స్టోరేజ్, బ్యాటరీ స్టోరేజీ ప్రాజెక్టుల్లో హిందూజా, ఎస్సార్ రెన్యూవబుల్స్, జీఎంఆర్ తదితర సంస్థలు రూ.2.37 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. తద్వారా 2 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.