Suryaa.co.in

Telangana

టెస్కో ద్వారానే వస్త్రాలను కొనుగోలు చేయాలి

• నేత కార్మికులకి నిరంతరం పని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం • మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్: నవంబర్ 15 లోగా వస్త్రాల కోసం ఇండెంట్ టెస్కోకు సమర్పించాలని జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివిధ సంక్షేమ శాఖల అధికారులను కోరడం జరిగింది.

ఈ రోజు సెక్రటేరియట్ లో టెస్కోకు వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లు కేటాయింపుకు సంబంధించి వివిధ సంక్షేమ శాఖల అధికారులతో సమీక్షా సమావేశంలో మంత్రి తుమ్మల పాల్గొని, ప్రభుత్వం నేత కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో జీవో నెం.1 ని తీసుకురావడమైనదని తెలియజేశారు. ప్రభుత్వ ఉద్ధేశ్యాన్ని పరిగణలోనికి తీసుకొని ఈ జీవో ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలకు, కార్పొరేషన్లకు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు అవసరమగు వస్త్రాన్ని తప్పనిసరిగా టెస్కో ద్వారానే కొనుగోలు చేయాలన్నారు. ఒకవేళ టెస్కో వారు ఒక వారం రోజులలోగా “నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్” జారీ చేసినప్పుడు మాత్రమే ఇతర సంస్థల నుండి కొనుగోలు చేయాలని మంత్రి పేర్కొన్నారు.

ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా టెస్కో వారికి ఆర్డర్ పెట్టకుండా ఇతర ప్రైవేట్ సంస్థల నుండి కొనుగోలు చేయకూడదని, కొనుగోలు విషయంలో తప్పనిసరిగా ప్రభుత్వ ఆదేశాలు పాటించి నేత కార్మికుల ఉపాధికి తోడ్పాటు అందించాలని కోరారు.  ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, జీవో 1 ఉత్తర్వులు జారీ చేయడమైనదని, ఆ ఉత్తర్వులకు విరుద్ధంగా ఎవరైనా ప్రైవేట్ సంస్థల నుండి కొనుగోలు చేపడితే బాధ్యులపై చర్యలు ఉంటాయని తెలిపారు.

కొన్ని సంక్షేమ శాఖలు ప్రతి సంవత్సరం యూనిఫాం ఇతర వస్త్ర డిజైన్ల రంగులు మార్చడం వలన సప్లై లో ఆలస్యం జరుగుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని, కావున ప్రతి సంవత్సరం డిజైన్ మార్చకుండా, కనీసం ఐదు సంవత్సరాల వరకు స్థిరంగా ఉంచాలన్నారు. విద్యార్థులకు, రాబోవు విద్యా సంవత్సరం అనగా 2025-26 సంవత్సరానికి అవసరమగు వస్త్ర ఇండెంట్ ను టెస్కో వారికి 15.11.2024 లోగా ఇవ్వాలన్నారు.

నేత కార్మికులకు నూలు కొనుగోలు, వస్త్ర ఉత్పత్తి మరియు టెస్కో వారికి డైయింగ్, ప్రాసెసింగ్ నకు 3 నెలల నుండి 6 నెలల సమయము పడుతుందని, కావునా 6 నెలల ముందే టెస్కో వారికి ఇండెంట్ సమర్పించినట్లైతే సకాలంలో సప్లై చేయడానికి వీలుంటుందని మంత్రి తెలియజేశారు.

కావునా 2024-25 సంవత్సరమునకు సంబంధించి ఇండెంట్ ను 15.11.2024 లోగా తెప్పించుకొని 100% సప్లై చేయాలని టెస్కో ఎండీ మరియు జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ ని మంత్రి ఆదేశించడం జరిగింది.

అదేవిధంగా టెస్కోకు వివిధ సంక్షేమశాఖలు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించడానికి తగిన చర్యలు తీసుకోవాలని, ఆయా శాఖ అధికారులను కోరారు.

ఈ సమీక్షా సమావేశంలో టెస్కో ఎండీ మరియు జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, వివిధ సంక్షేమశాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు మరియు టెస్కో అధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE