Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్ర టిడ్కో ఛైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన వేములపాటి అజయ్ కుమార్

  • శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
  • అజయ్ కుమార్ కు ప్రభుత్వం సముచిత స్థానం కల్పించడం ఆనందంగా ఉందన్న మంత్రి
  • టిడ్కో ఇళ్ల విషయంలో గత ప్రభుత్వం వ్యవహరించిన విధానాన్ని తప్పుబట్టిన మంత్రి
  • టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వంలో న్యాయం చేయాలని అజయ్ కుమార్ ను కోరిన మంత్రి 

రాష్ట్ర టిడ్కో ఛైర్మన్ గా నియమించబడి నేడు పదవీ బాధ్యతలు స్వీకరించిన వేములపాటి అజయ్ కుమార్ కు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అభినందలు తెలిపారు. బుధవారం విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ లో 4వ అంతస్తులో ఉన్న ఆంధ్రప్రదేశ్ టౌన్ షిప్ అండ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ డెవపల్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ టిడ్కో) కార్యాలయానికి వెళ్లి అజయ్ కుమార్ ను స్వయంగా కలిసి మంత్రి కందుల దుర్గేష్ శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వివిధ పట్టణాల్లో, నగరాల్లో ఉన్న టిడ్కో గృహ సముదాయాల పరిస్థితిపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ జనసేన పార్టీ కీలక నేత అజయ్ కుమార్ టిడ్కో ఛైర్మన్ గా నియమించబడటం ఆనందంగా ఉందని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో అజయ్ కుమార్ సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తొలి విడత నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానం కల్పించడం సంతోషమన్నారు. ఎంతో ప్రతిభ గల అజయ్ కుమార్ ఆ పదవికి వన్నెతెస్తాడని ఈ సందర్భంగా మంత్రి వ్యాఖ్యానించారు.

2014-19 మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం పేద వర్గాలను టిడ్కో లబ్ధిదారులుగా ఎంపిక చేసి ఇళ్లను అందించాలని భావించిందన్నారు. అనంతరం వచ్చిన ప్రభుత్వం టిడ్కో ఇళ్ల అంశాన్ని తుంగలో తొక్కిందన్నారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం టిడ్కో ఇళ్ల విషయంలో వ్యవహరించిన విధానం దారుణమని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం టిడ్కో లబ్ధిదారులను ఆదుకోకపోగా మోసం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టిడ్కో లబ్ధిదారులు తమకు న్యాయం జరుగుతుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారన్నారు. టిడ్కో ఛైర్మన్ గా అజయ్ కుమార్ ఆలోచనలు పేద ప్రజలకు ఉపయోగపడాలని సూచించారు. పేద ప్రజలకు కార్పొరేషన్ ద్వారా మంచి జరుగుతుందని మంత్రి కందుల దుర్గేష్ భావిస్తున్నానన్నారు.

LEAVE A RESPONSE