– గిట్టని అధికారులపై మారుపేర్లతో ఫిర్యాదులు
– చివరకు ఉన్నతాధికారులపైనా పత్రికల్లో వ్యతిరేక కథనాలు
– దగ్గరుండి ఓ సీనియర్ జర్నలిస్టుతో చిన్నా చితకా పత్రికల్లో రాయిస్తున్న పేషీ ఉద్యోగులు?
– తాజా ఓ దినపత్రిక కథనంతో బట్టబయలయిన కథనం
– పేషీ ఉద్యోగి చెబితేనే రాశానన్న జర్నలిస్టు
– ముందు ఆకాశరామన్న పేరుతో మంత్రి, అధికారులకు ఫిర్యాదులు
– వాటికి చిన్నా చితకా పేపర్లలో విస్తృత ప్రచారం
– తర్వాత మంత్రి పేషీ నుంచి విచారణకు ఆదేశం
– దానితో గిట్టని అధికారులపై చర్యలు
– వారి స్థానాల్లో తమ వారికి పోస్టింగులు
– గతంలో ఇలాగే బలైపోయిన విశాఖ ఫ్యాక్టరీస్ అధికారి
– తీరా విచారిస్తే ఆ ఫిర్యాదుదారు తనకేమీ తె లియదన్న వైనం
– విచారణకు పిలిచినా రాని ఫిర్యాదుదారు
– కానీ అప్పటికే ఆ అధికారికి బ(ది)లి చేసిన వైనం
– ఆయన స్థానంలో తమకు నచ్చిన వారికి పోస్టింగ్ ఇచ్చిన తెలివి
– కాకినాడ, రాజమండ్రిలో దళిత సంఘాల పేరుతో ఫిర్యాదులు
– తాజాగా రాజమండ్రి సరోవర్ హోటల్లో ఫ్యాక్టరీస్ అధికారుల రహస్య భేటీ
– జీడిపిక్కల ఫ్యాక్టరీల నుంచి బెదిరించి మామూళ్లు పిండుకునే స్కెచ్
– సదరు కంపెనీలు నిబంధనలు పాటించడం లేదంటూ ఫిర్యాదులు
– మంత్రి పేషీ నుంచే గూడుపుఠాణీ నడుస్తోందా?
– ముందు మీడియాలో రాయించడం.. తర్వాత వారిపై చర్యల వ్యూహం
– మంత్రికి తెలిసే జరుగుతోందా? లేక మంత్రిని అప్రతిష్ఠపాలు చేస్తున్నారా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
గౌరవనీయ కార్మికమంత్రి గారికి.. విశాఖలో పనిచేస్తున్న ఆ ఫ్యాక్టరీస్ అధికారి చాలా అవినీతిపరుడు. ఫలానా కంపెనీల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. ఫలానా థర్డ్ పార్టీ ఏజెన్సీలకే వర్క్ ఆర్డర్ ఇవ్వమని హుకుం జారీ చేస్తున్న ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలి.
– ఇది ఓ ఆకాశరామన్న తన ఫోన్ నెంబరు ఇచ్చి కార్మికశాఖకు ఇచ్చిన ఫిర్యాదు.
అయితే వెంటనే సదరు అధికారిపై సస్పెన్షన్ వేటు వేయడం.. ఆ స్థానంలో తమను సంతృప్తి పరిచిన అధికారిని నియమించడం చకచకా జరిగిపోయింది. తర్వాత కోర్టుకెక్కిన సదరు బాధిత అధికారి గోడు విన్న కోర్టు.. ఆయనను తక్షణం ఉద్యోగంలోకి తీసుకోవాలని ఆదేశించింది. ఆ తర్వాత శాఖపరమైన విచారణలో.. సదరు అధికారిపై ఫిర్యాదు చేసిన ఆ ఆకాశరామన్నను విచారణకు రావాలని ఎన్నిసార్లు ఆదేశించినా ఆకాశరామన్న పత్తా లేరు.
దానితో రంగంలోకి దిగిన మీడియా.. సదరు ఫిర్యాదుదారు వద్దకు వెళ్లి.. నీ పేరుతో ఫిర్యాదు వెళ్లింది కదా ఏమిటి కథ అని ప్రశ్నిస్తే.. అబ్బెబ్బే.. దానితో నాకేమీ సంబంధం లేదు. నా ఆధార్కార్టును ఎవరో దుర్వినియోగం చేశారు. అని అసలు సంగతి తేల్చారు. ఇంతకూ ఆ ఫ్యాక్టరీస్ అధికారిపై ఫిర్యాదు చేసిన సదరు ఆకాశరామన్న అనకాపల్లిలోని ఓ గ్రామంలో మీ-సేవ నిర్వహించుకునే ఓ చిరుజీవి.
కానీ ఇవేమీ ఆలోచించని కార్మికశాఖ.. ఆకాశరామన్న ఫిర్యాదు వచ్చిన వెంటనే ఆగమేఘాలపై స్పందించి, ప్యాక్టరీస్ విభాగానికి చెందిన ఓ అధికారిపై సస్పెన్షన్ వేటు వేసి ఆయనను బలిపశువు చేసింది.
పోనీ ఆయన స్థానంలో గట్టి అధికారిని నియమించిందా అంటే అదీ లేదు. గతంలో రెండుసార్లు సస్పెండయి.. ఇంకా ఏసీబీ కేసు పెండింగ్‌లో ఉన్న ఓ అధికారిని ఆయన స్థానంలో నియమించింది. నిజానికి ఆ అక్రమార్కుడిని ప్రభుత్వానికి సరెండర్ చేసి.. తర్వాత ఆయనకు నాన్ ఫోకల్ పోస్టు ఇవ్వాలన్న ఓ ఐఏఎస్ అధికారి ఆదేశాలను కాదని, రెండు చేతులా సంపాదించే అక్కడికి బదిలీ చేసిన వైచిత్రి.
కొద్ది నెలల క్రితం రిటైరయిన ఆ అక్రమార్కుడిని హెడ్డాఫీసుకు బదిలీ చేయాల్సి ఉండగా.. తమకు రెండుచేతులా సంపాదించి పెట్టే కీలక జోన్‌కు బదిలీ చేయించిన పేషీ పలుకుబడి ముందు నిబంధనలు ఎలా వెక్కిరించబడుతున్నాయో అర్ధమవుతోంది. మరి ఆకాశరామన్న పేరుతో ఉత్తుత్తి ఫిర్యాదులకు బలయిన ఆ బీసీ అధికారికి న్యాయం చేసేదెవరు? ఆయనకు జరిగిన నష్టం పూడ్చేదెవరు?
సీన్ కట్ చేస్తే..
సేమ్ సీన్ రిపీట్. ఈసారి రంగస్థలం అనకాపల్లి నుంచి కాకినాడకు!
కాకినాడ జిల్లా జీడిపిక్కల ఫ్యాక్టరీలలో, సరైన భద్రతా ప్రమాణాలు లేవంటూ ఓ ఆకాశ రామన్న ఫిర్యాదు! మహిళలకు సంబంధించి క్రచ్రూములు ఏర్పాటుచేయలేదని, ప్లాన్ ప్రకారం భవనం నిర్మించలేదని, దానికి స్టెబిలిటీ టెస్టింగ్ చేయలేదని, కార్మికులకు మెడికల్ టెస్టులు- క్యాంటీను చేయలేదని, కార్మికులకు గ్లౌజులు, హెల్మెట్లు, బూట్లు ఇవ్వలేదని, పర్మినెంట్-లేదా తాత్కాలిక డాక్టరు కూడా లేరన్నది ఆ ఫిర్యాదు సారాంశం.
మళ్లీ సీన్ కట్ చేస్తే..
రామచంద్రాపురం-పామర్రులోని ప్రముఖ ఆర్టోస్ బేవరేజెస్ సాఫ్ట్ డ్రింక్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యం క్యాన్సర్ కారకాలయిన ప్లాస్టిక్ బాటిళ్లతో సాఫ్ట్ డ్రింక్స్, వాటర్ బాటిళ్లతో కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోందన్నది మరో ఫిర్యాదు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కడ చూసినా ఈ కంపెనీ ప్లాస్టిక్ వ్యర్ధాలే కనిపిస్తున్నాయట. వాటి వల్ల క్యాన్సర్‌తోపాటు, పర్యావరణం నాశనమవుతుందట.
కాబట్టి ఆ కంపెనీ అనుమతులు రద్దు చేసి పర్యావరణాన్ని కాపాడాలని ఆ ఫిర్యాదుదారు 19-08-2025న డిప్యూటీ చీఫ్ ఇన్ప్రెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, కార్మికమంత్రికి ఇచ్చిన ఫిర్యాదు.
కార్మిక శాఖలో ఇలాంటి చిత్ర విచిత్రాలకు లెక్కే లేదు. విచిత్రంగా ఇలాంటి ఫిర్యాదులు ఇచ్చే వర్గాలకు-మంత్రి పేషీలో పనిచేసే అదే వర్గానికి చెందిన ఉద్యోగులకు బాదరాయణ సంబంధం ఉండటం! ఆర్టీఐ యాక్టివిటిస్టులు, పేషీలో ఉద్యోగి సన్నిహితంగా ఉండే దళిత సంఘాలు, వాట్సాప్ పేపర్ల ద్వారా.. తాము లక్ష్యం చేసుకున్న అధికారులు-కంపెనీలపై ఫిర్యాదు-వ్యతిరేక వార్తలు రాయించడమే ఈ దళం ప్రత్యేకత.
ఈ ఫిర్యాదులపై పేషీ నుంచి మంత్రి వద్ద పనిచేసే ఓ కీలక అధికారితో ఎండార్స్ వేయించడం.. దానిని తమకు నచ్చిన అధికారితో విచారణ చేయించడం.. ఆ విచారణలో అప్పటివరకూఆ జిల్లాలో పనిచేస్తున్న అధికారిపై వేటు వేసి, ఆయన స్థానంలో తమకు నచ్చిన వారిని నియమించుకోవడం చాలాకాలం నుంచి కనిపిస్తున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్!
ఇంకోసారి సీన్ కట్ చేస్తే..
గత శనివారం కాకినాడలోని హోటల్ సరోవర్‌లో మంత్రిగారి ఏషీలోని ఓ ఉద్యోగి.. విశాఖ, కాకినాడ, రాజమండ్రిలో పనిచేసే కొందరు ఫ్యాక్టరీస్ అధికారులతో భేటీ వేశారన్న చర్చ ఫ్యాక్టరీస్ విభాగంలో జరుగుతోంది. ఆ భేటీలో తమకు కావలసిన వారి పెండింగ్ పనులు క్లియర్ చేయటం.. కొత్త పనులు తాము సిఫార్సు చేసిన థర్డ్ పార్టీ సేఫఫ్టీ ఏజెన్సీలకు ఇప్పించడం.. ఏయే కంపెనీలను ఎలా బెదిరిస్తే వర్కవుట్ అవుతుందని స్కెచ్ వేయడమే ఆ రహస్య సమావేశ లక్ష్యమట. కంపెనీలను బెదిరించి దారికితెచ్చుకోవడం, అధికారులను ఎలా పిండుకోవాలో బాగా అనుభవం ఉన్న పేషీలోని ఓ ఉద్యోగికి నిజానికి పేషీలో ఎలాంటి పనిలేదు. ఆయన ఒక్క ఫైలుపై సంతకం చేయరు. మరి పేషీలో ఏం చేస్తున్నారంటే..‘మామూలే’!
కాగా కార్మిక శాఖలో నెలకొన్న ఈ అరాచకాలు మంత్రికి తెలిసి జరుగుతున్నాయా? లేక ఆయనను అడ్డుపెట్టుకుని పేషీ ఉద్యోగులు, బంధువులే నడిపిస్తున్నారా? ఒకవేళ మంత్రి ప్రమేయం లేదనుకుంటే.. తన పేషీపై చాలాకాలం నుంచి ఆరోపణలు వస్తున్నా ఇంకా అదే సిబ్బందిని కొనసాగిస్తున్నారంటే, ఇవన్నీ మంత్రికి తెలియకుండా ఎందుకు ఉంటుందన్నది వినిపించే మరో సందేహం లాంటి ప్రశ్న.
బాసులకూ తప్పని బెదిరింపులు
కాగా తమకు నచ్చని-తమ మాట వినని అధికారులను బెదిరించే పర్వం పరాకాష్ఠకు చేరి, చివరకు అది బాసులకూ వ్యతిరేకంగా రాయించేవరకూ వె ళ్లడమే ఆశ్చర్యం. ఇటీవల ఓ దినపత్రికలో కార్మిక శాఖలోని ఓ ఉన్నతాధికారి.. మంత్రికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ ఓ కథనం వెలువడింది. తర్వాత ఆరా తీస్తే.. సదరు కథనాన్ని ఆ శాఖలో పీఆర్వో ఉద్యోగం ఆశిస్తున్న ఓ మాజీ జర్నలిస్టును, పేషీలో పనిచేసే ఓ ఉద్యోగి వెంటబెట్టుకుని, వార్త రాసిన ఆ జర్నలిస్టు వద్దకు తీసుకుని ఆ కథనాన్ని వండి వార్చినట్లు తేలింది.