Suryaa.co.in

Telangana

లష్కర్ బోనాలకు అన్ని ఏర్పాట్లు

– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

ఈ నెల 9 వ తేదీన జరిగే లష్కర్ బోనాలకు వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మంత్రి శ్రీనివాస్ యాదవ్ GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్, వివిధ శాఖల అధికారులతో కలిసి సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయం పరిసరాలలో తిరిగి ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్బంగా మంత్రి అధికారులకు ఏర్పాట్ల విషయంలో పలు సూచనలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం ఉదయం 4 గంటలకు అమ్మవారికి తోలిబోనం సమర్పించడం జరుగుతుందని చెప్పారు. బోనాల సందర్బంగా లక్షలాది మంది భక్తులు వస్తుంటారని, వారు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మన సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర పండుగగా ప్రకటించారని, నాటి నుండి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తూ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ వస్తుందని వివరించారు.

అమ్మవారి దర్శనం కోసం వెళ్ళే భక్తులు ఇబ్బందులకు గురికాకుండా పటిష్టమైన భారికేడ్ లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన బందోబస్తును నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. భక్తులు ఇబ్బందులకు గురికాకుండా ఆలయానికి వచ్చే రహదారులలో ట్రాపిక్ ను మళ్ళించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. భక్తులకు అందించేందుకు త్రాగునీటిని అందుబాటులో ఉంచడం జరుగుతుందని పేర్కొన్నారు.

అన్ని ప్రధాన రోడ్లతో పాటు ఆలయానికి భక్తులు వచ్చే అన్ని రోడ్లలో కూడా లైట్లు వెలిగేలా చూడాలని అన్నారు. ఆలయ పరిసరాలలో క్రిందకు వేలాడుతూ ఉన్న విద్యుత్ తీగలను వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రశాంత వాతావరణంలో బోనాల ఉత్సవాలు జరిగేలా భక్తులు కూడా అధికారులు, ఆలయ కమిటీ సభ్యులకు సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మంత్రి వెంట నార్త్ జోన్ DCP చందన దీప్తి, జోనల్ కమిషనర్ రవి కిరణ్, RDO వసంత, ట్రాఫిక్ DCP రాహుల్ హెగ్డే, ACP రమేష్, ట్రాన్స్ కొ DE శ్రీధర్, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, ఆలయ EO మనోహర్ రెడ్డి, వాటర్ వర్క్స్ డైరెక్టర్ కృష్ణ, తహసీల్దార్ శైలజ తదితరులు ఉన్నారు.

LEAVE A RESPONSE