Suryaa.co.in

Andhra Pradesh

అవన్నీ బీ- బ్రాండ్లు..చంద్రబాబు బ్రాండ్లు.. సీ- బ్రాండ్లే

– “ప్రెసిడెంట్ మెడల్ – గవర్నర్స్ రిజర్వ్- బూమ్ బీరు” ఇవన్నీ చంద్రబాబు-టీడీపీ ప్రభుత్వం తెచ్చినవే.. ఈ మెడల్స్ అన్నీ బాబు మెడలోనే వేయాలి.
– శ్రీమాన్ మద్య మహా చక్రవర్తి – మద్య మహా సామ్రాట్ అని చంద్రబాబుకు బిరుదులివ్వాలి
– విశాఖ డిస్టలరీస్ అయ్యన్నపాత్రుడిది కాదా..?; పీఎంకే డిస్టలరీస్ యనమల రామకృష్ణుడు వియ్యంకుడిది కాదా…?
– శ్రీకృష్ణా డిస్టలరీస్ ఆదికేశవుల నాయుడిది కాదా..?; ఎస్పీవై డిస్టలరీస్ ఎస్పీవై రెడ్డిది కాదా…? వీరంతా టీడీపీ వారు కాదా..?
– వీటిని తయారు చేస్తున్నది.. ఇడుపులపాయలోనా..? లేక చంద్రబాబు “ముడుపుల పాయ”లోనా..?
– అవి ఎల్లో మీడియా వండి వార్చిన “ఎల్లో సారా- బాబు సారా” మరణాలు
– వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి

పార్థసారథి మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే….
అబద్ధాలు చెప్పడలంలో చంద్రబాబు గోబెల్స్‌ అమ్మ – బాబు..
రాష్ట్రంలో నీచ రాజకీయాలకు, దిగజారుడు రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రసుగా చంద్రబాబు నాయుడు, టీడీపీ కార్యాలయం మారిపోయింది. అబద్దాలు చెప్పడంలో చంద్రబాబు గోబెల్స్‌ అమ్మా – బాబు. గోబెల్స్‌ కంటే ఘోరంగా అబద్దాలును నమ్మశక్యంగా ప్రచారం చేయగల దిట్ట చంద్రబాబు.

అబద్దాలను, నిజాలుగా నమ్మించడం, చెప్పిన అబద్దమే పదిసార్లు చెబితే అవి ప్రజలలోకి నిజాలుగా వెళతాయనే సిద్దాంతాన్ని నమ్మిన వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబుకు రాజకీయాలు అంటే అధికారం, దోచుకోవడం, తనవాళ్లకు అంతులేని సహాయం చేయడం తప్పితే, ప్రజలకు సాయం చేయాలి, వాస్తవాలు ఏంటనేది ప్రజలకు తెలియజేయాలనే ధ్యాసలేని వ్యక్తి.

గత కొన్ని రోజులుగా మద్యం మీద చంద్రబాబు నాయుడు విపరీతంగా దుష్ప్రచారం చేస్తున్నాడు. ఒకరోజు సోమిరెడ్డి, మరొకరోజు బోండా ఉమా, ఆ పార్టీ మహిళా నాయకురాలు అనిత నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మొదట ఎల్లో మీడియాలో ఒక వార్త రాస్తారు. ఆ తర్వాత టీడీపీ నాయకులంతా అదే పట్టుకుని మాట్లాడతారు, లోకేష్ ట్వీట్లు పెడతాడు.

చివరిగా చంద్రబాబు మాట్లాడి, అదే కరెక్టు అన్నట్టుగా వీళ్ళు దుష్ప్రచారం చేస్తారు. ఇదంతా ఒక విష వలయంలాగా తయారైపోయి, మద్యం మీద ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, ప్రభుత్వం మీద బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్న విషయం చాలా స్పష్టంగా అర్థం అవుతోంది.

జే బ్రాండ్స్‌ అంటూ బ్రాడింగ్‌ చేయడంలో చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏమిటో ప్రజలు అర్థం చేసుకోవాలి. 70ఏళ్ల పైబడి వయసు ఉన్న చంద్రబాబు, తన వయసుకు తగ్గట్టుగా కాకుండా ప్రెసిడెంట్‌ మెడల్‌ విస్కీ… అంటూ పలు సందర్భాల్లో వెకిలి నవ్వులు నవ్వుతూ మాట్లాడటం అందరం చూశాం. అసలు ఈ బ్రాండ్‌ లు ఎవరు తీసుకు వచ్చారు? వాటికి అనుమతులు ఎప్పుడు వచ్చాయి అనే విషయాలను ఈరోజు మీముందు సాక్ష్యాధారాలతో సహా ఉంచుతున్నాం.

ప్రెసిడెంట్‌ మెడల్‌, గవర్నర్స్ రిజర్వ్… ఇలా గవర్నర్ నుంచి ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా వరకూ ఎవరినైనా చంద్రబాబు వాడేస్తారు. ఈ పేర్లతో ఉన్నవన్నీ చంద్రబాబు బ్రాండ్లే.. ఈ బ్రాండ్లన్నింటినీ టీడీపీ నాయకులు అంతా కలిసి చంద్రబాబు మెడలో వేసి, ఇంతకాలం జె బ్రాండ్లని తప్పుడు ప్రచారం చేసినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలి.

సంక్షేమ కార్యక్రమాల విషయంలో గానీ, ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ విషయంలోగానీ.. జగన్‌ మోహన్‌ రెడ్డిని ఎదుర్కొనే సత్తా, దమ్ము లేక ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి రాజకీయంగా పబ్బం గడుపుకుంటున్నారు. రోజూ తప్పుడు మాటలు మాట్లాడే, టీడీపీ నేతలంతా… చంద్రబాబు నాయుడు తెచ్చిన ఈ బ్రాండ్స్‌ బాటిల్స్‌ను మెడలో వేసుకుని ధర్నాలో కూర్చోవాలి. ఈరోజు ప్రజలకు అసలు విషయం తెలిసి, టీడీపీ నేతలకు చెప్పుల దండలు కూడా మెడలో వేస్తారు. మేమేమీ ఆరోపణలు చేయడం లేదు. పక్కాగా ఆధారాలతోనే మాట్లాడుతున్నాం. వాస్తవాలు ఈవిధంగా ఉంటే టీడీపీ, చంద్రబాబు ఎందుకు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నాం.

రాష్ట్ర ప్రజలందరికీ తెలియాల్సిన నిజాలు
2019 తర్వాత ఒక్క డిస్టలరీకిగానీ, ఒక బ్రూవరీకిగానీ జగన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. లిక్కర్ తయారీకి సంబంధించిన విధానంలో.. 2019 తర్వాత జగన్ ప్రభుత్వం ఎటువంటి మార్పులూ చేయలేదు.
ఫలానా బ్రాండుకు అనుకూలంగాగానీ, ఫలానా బ్రాండుకు వ్యతిరేకంగా గానీ ఎటువంటి విధానమూ అనుసరించలేదు. అంటే, ఒకరిని ఎత్తేందుకు, ఒకరిని తొక్కేందుకు ఎటువంటి ప్రయత్నం చేయలేదు.
సప్లయర్లు వారి రేట్ కాంట్రాక్టు అగ్రిమెంట్లను పొడిగించుకునేందుకు పూర్తి స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు చంద్రబాబు చెబుతున్న జె-బ్రాండ్లు అంటున్నవి నిజానికి, బాబు బ్రాండ్లు కాబట్టి బీ- బ్రాండ్లు అనో, లేదా చంద్రబాబు బ్రాండ్లు కాబట్టి, సీ- బ్రాండు అనో వాటిని అనాలి.

ఇందుకు ఆధారాలను ఇక్కడ ఇస్తున్నాం…
ప్రెసిడెంట్ మెడల్ అనేది ఎవరి బ్రాండో తెలుసా..? అది బాబు బ్రాండ్. దానికి అనుమతి లభించింది ఎప్పుడో తెలుసా..?- 2018 ఫిబ్రవరి 6న. అంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కాబట్టి, ఇది టీడీపీ ప్రెసిడెంట్స్ మెడల్. ఈ మెడల్ బాబు మెడలోనే వేయాలి. ప్రెసిడెంట్స్ మెడల్ కు మేము అనుమతినిచ్చాం అంటున్నవాళ్ళు ఆ బాటిల్స్ తీసుకువెళ్ళి, దండ కట్టి చంద్రబాబు మెడలో వేయండి.

ఇక గవర్నర్స్ రిజర్వ్.. రాష్ట్రపతినే కాదు, గవర్నర్ ను కూడా మేం అవమానించాం అన్నారు. దానికి ఎవరు అనుమతినిచ్చారో చూద్దాం. దానికి అనుమతి ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడే. దీనికి అనుమతి 2018 నవంబరు 5న ఇదే చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి, గవర్నర్స్ రిజర్వ్ బ్రాండ్ కూడా గవర్నర్ గారి ఆఫీసు ముందు నిలబెట్టి, ఆ బాటిల్స్ అన్నీ దండకట్టి చంద్రబాబు మెడలోనే వేయాలి.

గవర్నర్ రిజర్వ్ మాత్రమే కాకుండా, గవర్నర్ పేరు మీద ఉన్న ఇతరత్రా బ్రాండ్లు, నెపోలియన్ పేరు మీద ఉన్న బ్రాండ్లు, ఓక్టన్ పేరు మీద బ్రాండ్లు, సెవెన్త్ హెవెన్ పేరు మీద ఉన్న బ్రాండ్లు… వీటన్నింటికీ సంబంధించి ఏపీ స్టేట్ బ్రూవరీస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎప్పుడు అనుమతి ఇచ్చిందో తెలుసా..? 2018 అక్టోబరు 26న. అంటే, ఈ బాటిల్స్ అన్నీ బాబు మెడలోనో, కొన్ని సోమిరెడ్డి మెడలోనో, కొన్ని అనిత మెడలోనో వెయ్యాలి. అయ్యన్నపాత్రుడి మెడలో మాత్రం వేయనక్కర్లేదు. ఎందుకంటే, ఆయన గంజాయి మాత్రమే తాగుతాడు కాబట్టి.

అలాగే, ప్రెసిడెంట్ మెడల్ తోపాటు, హైదరాబాద్ విస్కీ బ్రాండ్లకు అనుమతి ఇచ్చింది ఎప్పుడో తెలుసా.. ? 2017 నవంబరు 22న. అంటే, చంద్రబాబు హయాంలో. మరి ఇవన్నీ ఎవరికి తగించాలి. రకరకాల బ్రాండ్ల గురించి మాట్లాడుతూ.. విరా, బ్లాండే, లాంటి బ్రాండ్లతోపాటు బూమ్ బీరు తీసుకు వచ్చింది ఎవరో తెలుసా.. ? శ్రీమాన్ మద్య మహా చక్రవర్తి చంద్రబాబు నాయుడు గారే. ఇందుకు అనుమతి ఇచ్చింది ఎప్పుడో తెలుసా..? ఇలా అధికారం నుంచి వెళ్ళిపోతున్నాడు అనగా, చివరి క్షణాల్లో 2019 మే 14న ఈ బూమ్ బాబు… బూమ్ బీరుకు అనుమతి ఇచ్చాడు. దానికి సంబంధించిన కాగితాలను కూడా బయట పెడుతున్నాం.

అలాగే, హై ఓల్టేజి గోల్డ్ బీరు, ఎస్ ఎన్ జే బీరు, బ్రిటీష్ ఎంపయర్ బీరు.. ఇవన్నీ రాష్ట్రంలో రంగ ప్రవేశం చేసిందీ ఎప్పుడో తెలుసా..? 2017 జూన్ 7న. అదీ బాబు గారి తడాఖా. అలాగే, రాయల్ ప్యాలెస్ బ్రాండ్లు, లూహీ – 14 బ్రాండ్లు, సైనవుట్ బ్రాండ్లు రంగ ప్రవేశం చేసింది ఎప్పుడో తెలుసా..? 2018 నవంబరు 9న.
వీటన్నింటికీ సంబంధించిన సాక్ష్యాధారాలను కూడా పార్థసారథి మీడియాకు అందజేశారు.

ఈ మొత్తం విషయాలను మేము, కాగితాలు విడుదల చేసి మరీ, ఆధారాలతో సహా మాట్లాడుతున్నాం. చంద్రబాబు తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడో, లోకేష్ తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడో, బోండా తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడో, సోమిరెడ్డి తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడో… పెట్టుకోమనండి. సిగ్గులేదు కాబట్టి, మళ్ళీ బయటకు వచ్చి ఈరోజు లిక్కరు గురించి, మద్యం గురించి మాట్లాడతారేమో మాట్లాడనివ్వండి.
అలాగే, ఎస్పీవై బ్రాండు ఎవరిదండీ.. ఎస్పీవై రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడండీ. ఎస్పీవై రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకుడు. తెలుగుదేశం పార్టీ నాయకుడికి సంబంధించిన ఎస్పీవై బ్రాండును వారు అమ్మి మా గురించి మాట్లాడుతుంటే, ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా..?

ఇక విశాఖ డిస్టలరీస్ అయ్యన్నపాత్రుడిది కాదా..?. గతేడాది అమ్మేసుకున్నానని చెప్పినంత మాత్రాన, ఏడాది క్రితం వరకూ అది అయ్యన్నపాత్రుడిదే.
పీఎంకే డిస్టలరీస్ యనమల రామకృష్ణుడు వియ్యంకుడిది కాదా…?
శ్రీకృష్ణా డిస్టలరీస్ ఆదికేశవుల నాయుడిది కాదా..?
ఎస్పీవై డిస్టలరీస్ ఎస్పీవై రెడ్డిది కాదా…? వీరంతా టీడీపీ వారు కాదా..?
వీటిని తయారు చేస్తున్నది.. ఇడుపులపాయలోనా..? లేక.. చంద్రబాబు ముడుపుల పాయలోనా..?
ఇక మేన్షన్ హౌస్ మద్యం గురించి నిన్న సోమిరెడ్డి మాట్లాడాడు. మనం రేట్లు తగ్గించక ముందు తెలంగాణలో అది- రూ. 160 ఉంటే, మన దగ్గర అది రూ. 260 ఉండేది. మనం రేట్లు తగ్గించిన తర్వాత దానిని రూ. 200కు తీసుకొచ్చాం. చివరికి లేబుల్ గురించి కూడా మాట్లాడాడు. కంపెనీలు ఒక్కో రాష్ట్రానికి ఒక్కో లేబుల్ వేయించుకుంటే… దాన్ని కూడా తప్పుబడతారా..?
రాష్ట్రంలో చీప్ లిక్కర్ వల్ల ఎటువంటి మరణాలూ సంభవించలేదు. ఒకవేళ రాష్ట్రంలో లిక్కర్ వల్లే మరణాలు సంభవిస్తే, నీ కొడుకు, మీ బామ్మర్ది ఏ బ్రాండ్లు తాగుతున్నారో…. చంద్రబాబు చెప్పాలి.
పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని సిగరెట్ ప్యాకెట్ మీద ఉన్నట్టే.. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అనేది కూడా ఉంటుంది. అయినా రిస్క్ తీసుకోదలచిన వ్యక్తులే తాగుతారు. రోజుకి ఇంత మద్యం తాగండి లేదా ఇంత మోతాదులో తాగండి అని ఎవరూ చెప్పరు. అది మనుషుల విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది.

చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. మద్య నిషేధాన్ని ఎత్తివేసి, ఊరూరా బెల్ట్ షాపులు పెట్టి మద్యానికి బార్లా తలుపులు తెరిచిన చంద్రబాబు మద్యం గురించి, నిషేధం గురించి మాట్లాడటం ప్రపంచ వింతల్లోకెల్లా పెద్ద వింత.దశల వారీగా మద్యపాన నిషేధమే మా పార్టీ విధానం. ఇదే అంశాన్ని మ్యానిఫెస్టోలో చెప్పాం. మద్యాన్ని నియంత్రించేందుకు ఏం చేయాలో, ఆచర్యలన్నీ అమలు చేస్తున్నాం.

టీడీపీ చెబుతున్నట్టుగా అవి కల్తీ సారా మరణాలు కాదు.. అది ఎల్లో మీడియా వండి వార్చిన ఎల్లో సారా- బాబు సారా మరణాలు. టీడీపీ అధికారంలో ఉంటే… మద్యమే ఆదాయ వనరు.టీడీపీ అధికారంలో లేకపోతే.. సారా రాక్షసి.. మద్యం రక్కసి.. ఇవీ ఎల్లో మీడియాలో రాతలు చంద్రబాబు, టీడీపీ నేతల బాధంతా… వాళ్ళు కోరుకున్న మద్యం బ్రాండ్లు, వారు కోరుకున్న ధరలకు దొరకడం లేదన్నదే.

చంద్రబాబు హయాంలో మద్యం ధరలకు – ఇప్పుడు మద్యం ధరలకు మధ్య ఎలాంటి తేడా లేదు. మద్యం అలవాటు మాన్పించాలన్న మంచి ఉద్దేశంతో, మద్యం ధరలు షాక్ కొట్టే విధంగా పెంచితే… ఎందుకు పెంచుతున్నారని గోల చేసినదీ వారే. వేరే రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం, నాటు సారా పెరుగుతోందని గమనించిన తరవాతే… ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఎస్ఈబీని ఏర్పాటు చేయడం, దాడులు చేయటం, నాటుసారా, అక్రమ మద్యం, గంజాయి వంటి మాదక ద్రవ్యాలను చరిత్రలో ఎప్పుడూ కనీనివీ ఎరుగని విధంగా పట్టుకోవటం, ధ్వంసం చేయటం, కేసులు పెట్టటం జరిగింది. లిక్కర్ తక్కువ రేటుకు దొరుకుతున్న మీదట, ఇక నాటు సారా ఎవరు ఎందుకు కాస్తున్నారన్నది మాత్రమే లెక్క తేలాలి.

దశల వారీ మద్య నిషేధంలో భాగంగా, సామాన్యుడికి మద్యం అందుబాటులో ఉండకూడదనే ఉద్దేశంతో, ఈ ప్రభుత్వం మద్యం ధరలు కొంత పెంచింది. ఆ తర్వాత పేదల ఇబ్బందులను గమనించి, ధరలు కొంత తగ్గించాం. తగ్గించినా, పొరుగు రాష్ట్రం తెలంగాణ కన్నా అధిక ధరలే ఇక్కడ ఉన్నాయి. చంద్రబాబు, టీడీపీ నేతల బాధంతా పేదలకే మద్యం తగ్గిస్తారా.. మాకు తగ్గించరా.. అన్నది కావొచ్చు.
పచ్చ కామెర్ల వారికి లోకం అంతా పచ్చగా కనిపించినట్టు.. చంద్రబాబు హయాంలో బాబు ట్యాక్స్, లోకేష్ ట్యాక్స్ వసూలు చేసినట్టే.. అందరూ అదే పని చేయాలనుకుంటారు జగన్ మోహన్ రెడ్డి పాలనలో అటువంటి వాటికి ఆస్కారమే ఉండదు.

టీడీపీ హయాంలో సాక్షాత్తూ ఎక్సైజ్ మంత్రి జవహార్.. బీర్ ను హెల్త్ డ్రింక్ గా ప్రమోట్ చేస్తున్నట్లు చెప్పారు. “SMS కొట్టు మందు పట్టు..” కోరుకున్న మద్యాన్ని ఇంటింటికే సప్లై చేస్తామని ప్రకటనలు ఇచ్చారు.అదే బాటలో ఇంటింటికీ, వీధి వీధికీ మద్యం సరఫరా చేయాలన్న టీడీపీ విధానంలో భాగంగానే.. అధికారంలోకి రాగానే 43వేల బెల్ట్ షాపులు తమ పార్టీ కార్యకర్తలకు ఇచ్చారు. గుడి, బడి అన్న తేడా లేకుండా ఆఖరికి కిల్లీ బంకుల్లో, కూల్ డ్రింక్ షాపుల్లో కూడా మద్యం అమ్మించారు. టీడీపీ హయాంలో ఒక షాపుకు లైసెన్స్ ఉంటే.. దాని కింద 10 షాపులు నడిపేవారు.

సిండికేట్ అయ్యి ఎంఆర్ పీ కంటే ప్రతి బాటిల్ పైనా రూ. 10 నుంచి రూ. 25ల వరకూ అధికంగా అమ్మేవారు. ఈ డబ్బు నేరుగా కింద నుంచి పైదాకా టీడీపీ నాయకుల జేబుల్లోకి వెళ్ళేవి. కమీషన్ల పేరుతో చంద్రబాబు నుంచి లోకేష్ వరకు వేల కోట్ల రూపాయలు చిలక కొట్టుళ్ళు కొట్టారు.

జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే.. మ్యానిఫెస్టోలో మేం చెప్పినట్టుగానే, నూతన మద్యం విధానాన్ని తీసుకొచ్చాం. చంద్రబాబు ఓపెన్ చేసిన 43 వేల మద్యం బెల్టు షాపులను తొలగించాం. అలానే అప్పట్లో అధికారికంగా ఉన్న 4,380 మద్యం షాపులకు అనుబంధంగా ఉన్న 4380 మద్యం పర్మిట్ రూములను మూసి వేశాం.అలానే మద్యం షాపులను 2,934కి తగ్గించాం. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో మద్యం షాపులు ఉంటే విచ్చలవిడితనం పెరుగుతుందని, ప్రభుత్వమే మద్యం షాపులు ఏర్పాటు చేసి, నిర్ణిత సమయాలలో మాత్రమే మద్యం అమ్మకాలు జరిగేలా చూస్తుంది. గతంలో మద్యం షాపులు 24 గంటలూ పనిచేసేవి. ఇప్పుడు ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకే.

టీడీపీ హయాంలో ఉన్న మద్యం విచ్చలవిడితనం ఇప్పుడు లేదు – మా హయాంలో లిక్కర్ సేల్ తగ్గించాం. జంగారెడ్డి గూడెం మరణాలు ఏవైతో చెప్తున్నారో, దానికి సంబంధించి ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ చేసింది. ప్రతి ఇంటికీ కూడా వెళ్లి వివరాలు తెలుసుకోవడం జరిగింది. ఎల్లోమీడియాలో ఆరోపణలు, ప్రచార విషయం తెలియగానే, జిల్లా మంత్రి, వైద్య ఆరోగ్యశాఖమంత్రి ఆళ్లనాని హుటాహుటిని జిల్లా కలెక్టర్‌ను, ఎస్పీని వెంటబెట్టుకుని జంగారెడ్డి గూడెం వెళ్లి ఇంటింటికీ వెళ్లి, మృతుల కుటుంబాలను పరామర్శించారు.

నిజానిజాలను తెలుసుకుని, ఆమేరకు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. చనిపోయిన 18 మందిలో కేవలం ముగ్గురికి మాత్రమే నాటు సారా తాగే అలవాటుంది. మిగతా 15 మంది అనారోగ్య కారణాల వల్ల చనిపోయారని పశ్చిమగోదావరి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి, ఆర్డీఓ తమ విచారణ నివేదికలో స్పష్టంచేశారు. వీరిలో పలువురికి మద్యం తాగే అలవాటే లేదని వారి కుటుంబ సభ్యులు చెపుతున్నా, ఎవరు చనిపోతే వారు మద్యం తాగేవారని చెప్పటం కూడా దిగజారుడుతనమే అవుతుంది. శ్మశానాల దగ్గర కూర్చుని శవాలు ఏం వస్తే అవి.. నాటు సారా మరణాలు అని చెప్పడానికి సిగ్గుపడాలి.

ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడానికి, దెబ్బతీయడానికి రోజూ ఏదో ఒక బురదజల్లే కార్యక్రమం చేయడం అన్నది టీడీపీకి, ఎల్లోమీడియాకు ఒక అలవాటు అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.
ఏదో ఒక చోట ఒక ఘటన జరుగుతుంది. ఆ ఘటనకు లేనిపోని విషయాలన్నీ ఆపాదిస్తారు. దాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ–5లు పెంచి, పెద్దచేసి చూపిస్తారు. వీటిని పట్టుకుని తెలుగుదేశం పార్టీ ఒక ఫేక్‌ ఉద్యమం మొదలుపెడతాయి.

నిజానికి ఈ కారణాలన్నీ చూస్తే… ఇవి కల్తీ సారా వల్ల జరిగిన మరణాలు కావు… ఇందులో, రాజకీయ విషం బాగా కలిసిందని అర్థమవుతుంది. ఈ మరణాల్ని ఎల్లో మీడియా పండగ చేసుకోవటం చూస్తే… తాము అధికారంలో లేకపోతే ఏ చావును అయినా ఎలా వాడుకుంటారో అర్థమవుతోంది. నాటు సారా అంటూ అమ్మితే, అందులో విషం అంటూ కలిస్తే.. అది “పచ్చ విషమే” తప్ప మరొకటి కాదు.

అంతేకాకుండా నాటుసారా తయారీ, అమ్మకాల మీద గట్టి నిఘా పెట్టేందుకు, జగన్ మోహన్ రెడ్డిగారు అధికారంలోకి వచ్చిన వెంటనే.. స్పెషల్ ఎన్ఫోర్స్ మెంటు బ్యూరోను ఏర్పాటు చేశారు. దీంతో ఎస్ఈబీ నిత్యం దాడులు నిర్వహిస్తూ, కఠినంగా వ్యవహరిస్తూ.. కేవలం రెండేళ్ళలోనే 12 లక్షల లీటర్ల సారా నిల్వలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు.

టీడీపీ హయాంలో నాలుగేళ్ళకు కలిపి కేవలం 83,926 కేసులు పెడితే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ళలోనే 92, 766 కేసులు పెట్టింది. అదే టీడీపీ హయాంలో ఇదంతా కేవలం మొక్కుబడిగా జరిగేది.ఆ వివరాలు…
TDP హయాంలో ఇలా..
2015-16 -47,771 కేసులు బుక్-19,887 మంది అరెస్టు-6,98,676 లీటర్లు సారా సీజ్
2016-17 -13,609కేసులు బుక్- 8,143 మంది అరెస్టు-1,18,981 లీటర్లు సారా సీజ్
2017-18 -11,349 కేసులు బుక్-7,065 మంది అరెస్టు-1,03,259 లీటర్ల సారా సీజ్
2018-19 -11, 197 కేసులు బుక్-8,271 మంది అరెస్టు-1,17,992 లీటర్ల సారా సీజ్
YSRCP హయాంలో ఇలా..
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మే, 2020లో ఎస్ఈబీ(సెబ్- స్పెషల్ ఎన్ఫోర్స్ మెంటు బ్యూరో)ని ఏర్పాటు చేసి, కేవలం రెండేళ్ళలోనే..
మే 2020-మార్చి 2022 వరకు – 92, 766 కేసులు బుక్- 69,178 మంది అరెస్టు-12 లక్షల 40 వేల 635 లీటర్లు సారా సీజ్ చేసి, ధ్వంసం చేసినట్టు పార్థసారథి గణాంకాలతో సహా వివరించారు.

LEAVE A RESPONSE