-రిజర్వేషన్లు పాటించాల్సిందే… సదస్సులో ఎమ్మెల్సీ లక్ష్మణరావు డిమాండ్
-పెద్ద ఎత్తున హాజరైన 1998 డిఎస్సి అభ్యర్ధులు…
-మే 2 న జిల్లా కలెక్టర్ల వద్ద ధర్నాలకు సదస్సు పిలుపు…
సర్టిఫికెట్లు వెరిఫికేషన్ పూర్తయిన డిఎస్సీ 1998 అభ్యర్ధులందరికీ రాష్ట్రప్రభుత్వం పోస్టింగులు ఇవ్వాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ఈ నియామకాల్లో రిజర్వేషన్లు పాటించాలని కోరారు. 1998 డిఎస్సి అభ్యర్థులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని, రిజర్వేషన్లు పాటించాలని’ కోరుతూ కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్), 1998 డిఎస్సి క్వాలిఫైడ్ పోస్టుల సాధన పోరాట కమిటీల ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు విజయవాడలోని ఎంబి విజ్ఞాన కేంద్రంలో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం [KVPS] రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి అధ్యక్షతన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు అభ్యర్ధులు పెద్దఎత్తున హాజరయ్యారు. ముందుగా యుటిఎఫ్ కార్యాలయంలో నిర్వహించాలని నిర్వాహకులు భావించారు. అభ్యర్థులు పెద్ద ఎత్తున పాల్గోనడంతో వేదికను పక్కనే ఉన్న ఎంబివికెకు మార్చారు.
ముఖ్య అతిధిగా పాల్గొన్న శాసనమండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ డీఎస్సీ 1998 లో అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని 25 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నారని వీరిని ఏ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. అయితే అందరికీ కాకుండా కొంత మందికే ఇచ్చిందని, ఇందులో కూడా ‘రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ పాటించలేదన్నాడు. 6882 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పిన ప్రభుత్వం 4072 మందికే నియామకాలు అందజేసిందని చెప్పారు. సర్టిఫికెట్లు పరిశీలన చేసిన అందరికి ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు . ప్రభుత్వం చేసే ప్రతి నియామకంలో కచ్చితంగా రిజర్వేషన్లు పాటించాలని, లేదంటే అది రాజ్యాంగానికి విరుద్ధమని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులందరికీ రిజర్వేషన్ ప్రకారం పోస్టింగులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీని కోసం అభ్యర్థులు పోరాటం చేయాలని తెలిపారు. ఈ పోరాటానికి పిడిఎఫ్ ఎమ్మెల్సీలుగా తాము అండగా ఉండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. సదస్సుకు అధ్యక్షత వహించిన ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ సామాజిక న్యాయం అంటే నలుగురు దళితులకు ఎనిమిది మంది బలహీన వర్గాలకు , ఇద్దరు గిరిజన, మైనార్టీలకు మంత్రి పదవులు ఇవ్వడం కాదని, ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు అమలుచేయడం అని అన్నారు.
ఉద్యోగాల నియామకాల్లో రిజర్వేషన్లు పాటించాలని విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణను కోరితే తమకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని పేర్కొన్నారు, ధర్నాలు చేసుకొండి. కోర్టుకు వెళ్లండంటూ అహంకారపూరితంగా మాట్లాడారని తెలిపారు. విద్యాశాఖ అధికారులు మాత్రం అర్హులైన అభ్యర్ధుల జాబితా తమ వద్ద లేవంటూ తప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సర్టిఫికెట్లు వెరిఫికేషన్ అయిన అభ్యర్థుల జాబితాను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
ఈ సదస్సులో బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి శంకరరావు , దళిత బహుజన ప్రంట్ వ్యవస్థాపక కన్వీనర్ కొరివి వినయ్ కుమార్ , యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు, డివైఎఫ్ఎస్ఐ రాష్ట్ర కార్యదర్శి జి. రామన్న, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు ఎం సోమేశ్వరరావు, రెల్లి సంఘం నాయకులు నాగేంద్ర, దళిత జాగృతి నాయకులు గణేష్ , ఎస్ సి రైట్స్ కార్యదర్శి కారుమంచి రామారావు తదితరులు పాల్గొని తమ మద్దతు ప్రకటించారు.
ఈ సదస్సులో పాల్గొన్న అభ్యర్థులు మాట్లాడుతూ
తమకు ఉద్యోగాలు రాకుండా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శకునిలా అడ్డుకుంటున్నారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి తన సొంత జిల్లాలో అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నారని
తెలిపారు. వెరిఫికేషన్ చేసిన అభ్యర్ధులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని , రిజర్వేషన్లను పాటించాలని డిమాండ్ల సాధన కోసం మే 2 వ తేదీన అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించాలని సదస్సు తీర్మానించింది. మే 10 నుంచి 14 వరకు విజయవాడలో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని పేర్కొంది.
కెఎస్ లక్ష్ణ్మణరావు సారధ్యంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్ఞల రామకృష్ణారెడ్డిలను కలిసి ఉమ్మడిగా వినతిపత్రాలు అందించాలని తీర్మానించింది. కెవిపిఎస్ ఉపాధ్యక్షులు జి నటరాజ్ వందన సమర్పణ చేసారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థులు వి వెంకటేశ్వర్లు , పొదిలి రమణ , బి శ్రీను, బి రమేష్, కె శ్రీను, కామేష్, సుహాసిని, విశ్వరూప్, గోవిందరావు , కోమలి , స్వాతి , రత్నం తదితరులు పాల్గొన్నారు…
అభినందనలతో…..
అండ్ర మాల్యాద్రి
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS)