Suryaa.co.in

National

ట్విన్ టవర్స్ కూల్చివేతకు రంగం సిద్దం

నోయిడాలో వివాదాస్పదంగా మారిన జంట టవర్లను ఆగస్టు 21వ తేదీన కూల్చివేయబోతున్నారు. ఇందులో 32 ఫ్లోర్లతో అపెక్స్, 31 ఫ్లోర్లతో సెయానే ఉన్నాయి. టన్నలుకొద్దీ పేలుడు పదార్థాలు ఉపయోగించి 100 మీటర్ల ఎత్తయిన ఈ టవర్లను నేలమట్టం చేయబోతున్నారు.

ఆగస్టు 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ జంట టవర్లను పూర్తిగా పేలుడు పదార్థాలతో నింపుతారు. 21వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు క్షణాల్లో వీటిని కూల్చివేయనున్నారు. కూల్చివేత సమయంలో నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్ ప్రెస్ రహదారిపై వాహనాలను కూడా నిలిపివేయనున్నారు.

నిబంధనలు ఉల్లంఘించి వీటి నిర్మాణాలు జరిగాయని గతేడాది ఆగస్టులో సుప్రీంకోర్టు తేల్చింది. కోర్టు ఆదేశాల మేరకు ఇందులో ఫ్లాట్లు కొనుగోలు చేసి మోసపోయిన వారికి ఆ నగదును కూడా వెనక్కివ్వాల్సి ఉంది. 1,396 ఫ్లాట్లలో దాదాపు 5 వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించబోతున్నారు. ఆగస్టు 14న కూల్చివేతకు సంబంధించిన పూర్తిస్థాయి రిహార్సల్ నిర్వహించబోతున్నారు.

ఈ ప్రాంతాన్ని అధికారులు రెడ్ జోన్ గా ప్రకటించారు. అలాగే నో-ఫ్లై జోన్‌గా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరబోతున్నారు. పేలుడుకు మూడు గంటల ముందు, రెండు గంటల తర్వాత ఆంక్షలు అమల్లో ఉండబోతున్నాయి. ఈ టవర్లకు ఆనుకొని ఉండే ఇతర నివాస సముదాయాలపై ఈ పేలుడు తీవ్ర ప్రభావాని చూపబోతోందని నిర్మాణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సమీప ప్రాంతాల్లోని ప్రజల్లో దీనిపై ఆందోళన వ్యక్తమవుతోంది.

LEAVE A RESPONSE