– జోనల్ సమావేశంలో నేతలంతా లేచి నిలబడి చప్పట్లతో మోదీకి కృతజ్ఞతలు
ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులందరినీ క్షేమంగా తీసుకొచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న చర్యలు సాహసోపేతమని బీజేపీ రాష్ట్ర నేతలు కితాబిచ్చారు. మోదీ నిర్ణయాలకు సంపూర్ణ మద్దతిస్తూ చప్పట్లతో కృతజ్ఞతలు తెలిపారు.
ఈరోజు హైదరాబాద్ లోని బర్కత్ పురాలో జరిగిన పార్టీ జోనల్ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ ‘‘ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులందరినీ క్షేమంగా తీసుకొచ్చేలా గొప్ప నిర్ణయం తీసుకున్న మహానాయకుడు నరేంద్ర మోదీ. భారత జాతీయ పతకాన్ని చూస్తే రష్యా, ఉక్రెయిన్ శ్రేణులు సెల్యూట్ చేసే పరిస్థితి వచ్చింది. దేశాన్ని, జాతీయ పతాకాన్ని నమ్మితే ప్రాణమిస్తాం. తిరగబడితే నామరూపాల్లేకుండా చేస్తామనే సంకేతాలను నరేంద్రమోదీ పంపారు. రాజకీయ చతురతతో, సాహసోపేత నిర్ణయం తీసుకున్న నరేంద్రమోదీకి ప్రతి ఒక్కరం లేచి నిలబడి చప్పట్లతో కృతజ్ఞతలు తెలుపుదాం’’అని పేర్కొన్నారు.
వెంటనే సమావేశంలో పాల్గొన్న నేతలంతా లేచి నిలబడి దాదాపు రెండు నిమిషాలు చప్పట్లతో ‘‘జై బీజేపీ…. జై నరేంద్రమోదీ… మోదీ నాయకత్వం వర్ధిల్లాలి’’అంటూ నరేంద్ర మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.