-అమరావతి రైతులు ఆందోళన చెందవద్దు
-సుప్రీంకోర్టులో న్యాయమే జరుగుతుంది
-న్యాయ పోరాటం ద్వారా సోమవారం నాటికి స్టే తెచ్చుకుందాం
-ప్రజారాజ్యంలో ప్రజావాక్కే శిరోధార్యం
-న్యాయ వ్యవస్థ పై అనుమానం కలిగే విధంగా అడ్వకేట్ జనరల్ వ్యవహరించడం… ఆయన కోరికల్ని ధర్మాసనం మన్నించడం న్యాయ వ్యవస్థ ఉనికికే ప్రమాదం
-కొంప కొంపకు మేము… కొంపలో నువ్వా? అంటున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు
-రామోజీరావు ప్రాణాలకు పొంచి ఉన్న ప్రమాదం
-ప్రజలంతా సంఘటితమై ప్రభుత్వ తీరును ఖండించాలి
-నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు
హైకోర్టులో జరిగిన వాదోపవాదానలపై అమరావతి రైతులు ఆందోళన చెందవద్దు. భయపడవద్దు… బాధపడవద్దని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు పిలుపు ఇచ్చారు. అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై తక్షణమే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి, సోమవారం నాటికి స్టే తీసుకునివద్దామని ఆయన సూచించారు. సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని, రైతుల పక్షాన తప్పకుండా స్టే లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… పేదల కడుపు కొట్టేవాడు బాగుపడిన దాఖలాలు లేవు. ఋషికొండకు గుండు కొట్టినట్లుగానే, అమరావతి ప్రాంతంలో కూడా యుద్ధ ప్రాతిపదికన గుడిసెలు వేసే ప్రమాదం ఉంది. అమరావతి అనే మహా యజ్ఞంలో మారీచుడైన జగన్మోహన్ రెడ్డికి ఇతరులు అందరూ మారీచులలాగే కనిపిస్తారు. తాను యుద్ధం చేస్తోంది మారీచులతో అని జగన్మోహన్ రెడ్డి పేర్కొంటుంటే… ప్రజలు యుద్ధం చేయాలనుకుంటుంది ఆ మారీచుని తోనేనని ఆయన తెలిపారు .ప్రజలు మారీచుని మాటలు నమ్మవద్దని, అలాగే హైకోర్టును అపార్థం చేసుకోవద్దని కోరారు. అమరావతి ప్రాంతంలో ఇళ్ల స్థలాల పంపిణీ పై దాఖలైన పిటిషన్ ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కొట్టివేసిన బాగుండేదని, ఈనెల 19వ తేదీకి వాయిదా వేయడం వల్ల సుప్రీంకోర్టులో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదని రఘురామకృష్ణం రాజు ఆందోళన వ్యక్తం చేశారు.
కేసు కొట్టి వేస్తానని ప్రధాన న్యాయమూర్తి అంటే… కొట్టివేయమన్న అమరావతి రైతుల తరపు న్యాయవాదులు
అమరావతి ప్రాంతంలో ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్ ను ప్రధాన న్యాయమూర్తి కొట్టివేస్తానని పేర్కొనగా, అమరావతి రైతుల తరపున వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు కొట్టివేయమని కోరారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్ తొలుత హైకోర్టు సింగిల్ బెంచ్ న్యాయ మూర్తి వద్దకు వెళ్ళింది. ఈ మ్యాటర్ కు సంబంధించిన కేసు, ప్రధాన న్యాయమూర్తి బెంచ్ వద్ద పెండింగ్ లో ఉందని, ఈ కేసును కూడా ప్రధాన న్యాయమూర్తి బెంచ్ కు బదిలీ చేయాలని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కోరడంతో, న్యాయమూర్తి వెంటనే ప్రధాన న్యాయమూర్తి బెంచ్ కు కేసు బదిలీ చేశారు. హైకోర్టులో గత కొన్ని నెలలుగా సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. సాక్షి దినపత్రిక సర్కులేషన్ పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ, ఉషోదయ పబ్లికేషన్స్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు కూడా సింగిల్ జడ్జి బెంచ్ వద్దకు రాగా, అడ్వకేట్ జనరల్ లేదంటే సుధాకర్ రెడ్డి అనే న్యాయవాది కలుగజేసుకుని ఈ కేసుతో సంబంధం ఉన్న మరొక కేసు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ పై ఉందని, ఈ కేసును కూడా ప్రధాన న్యాయమూర్తి బెంచ్ కు బదిలీ చేయాలని కోరడం, కేసును బదిలీ చేయడం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1 ని సవాలు చేస్తూ, సిపిఐ కార్యదర్శి రామకృష్ణ పిటిషన్ దాఖలు చేయగా, సింగిల్ జడ్జి బెంచ్ పైకి వెళ్లిన ఈ కేసును కూడా ప్రధాన న్యాయమూర్తి బెంచుకు బదిలీ చేయడం, వాదనలన్నీ విన్న ప్రధాన న్యాయమూర్తి తీర్పు ఇస్తానని చెప్పి గత మూడు నెలలుగా రిజర్వులో పెట్టడం జరిగింది. ఈ కేసులో తీర్పు వస్తుందన్న నమ్మకం తనకైతే లేదని రఘు రామకృష్ణంరాజు తెలిపారు. అమరావతి రైతుల తరఫున హైకోర్టులో సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది మురళి, ఎస్ ఎస్ నాయుడు, ఆంజనేయులు వాదనలను వినిపిస్తూ గతంలో మీరిచ్చిన ఆర్డర్ పై సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. అమరావతి ప్రాంతంలో ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వండి. 2020లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి ఇదే తరహా లో ఇచ్చిన జీవో ను సస్పెండ్ చేస్తూ, అమరావతి భూములను పంచుకొంటూ పోతామంటే కుదరదని వ్యాఖ్యానించారని ధర్మాసనం దృష్టికి న్యాయవాదులు తీసుకువచ్చారు. రైతులు తమ భూములను రాజధాని నిర్మాణం వంటి బృహత్తర కార్యక్రమానికి ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్ర నలుమూలలకు చెందినవారికి అమరావతిలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం. విశాఖయే రాజధాని అని పేర్కొంటున్న ముఖ్యమంత్రి, త్వరలోనే తాను కూడా అక్కడికే మకాం మారుస్తానని పదే, పదే పేర్కొంటున్నారు .
ఇప్పుడేమో పులివెందుల, పుంగనూరు, పలాస ప్రాంతాలకు చెందిన వారికి అమరావతిలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటి?. ఐదువేల ఇల్లు నిర్మాణమై ఉన్నప్పటికీ వాటిని లబ్ధిదారులకు అందజేయకుండా, అమరావతిలో ఇళ్ల స్థలాలను పంపిణి చేస్తామనడం ఆశ్చర్యంగా ఉంది. ఈ సందర్భంగా అభివృద్ధిని ఎలా అడ్డుకుంటామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేర్కొంటూ, ప్రభుత్వానికి కితాబు నివ్వడం పట్ల అభివృద్ధి అంటే ఇదా అని ఢిల్లీ న్యాయవాదులు గొడవకు దిగారు. దీనితో కేసు కొట్టి వేయమంటే, కొట్టేస్తానని ప్రధాన న్యాయమూర్తి పేర్కొనగా, కొట్టివేయమంటూ వారు కోరారు.ఈ కేసును 19వ తేదీకి వాయిదా వేసిన ప్రధాన న్యాయమూర్తి, మధ్యంతర స్టే ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పడమే కాకుండా, కావాలంటే నోటీసులు ఇస్తానని చెప్పారు. సింగిల్ బెంచ్ జడ్జి వద్దకు వచ్చిన కేసులను ప్రధాన న్యాయమూర్తి బెంచ్ కు బదిలీ చేయమని అడ్వకేట్ జనరల్ కోరడం, వెంటనే కేసులు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ కు బదిలీ కావడం సర్వసాధారణంగా మారింది. రోస్టర్ విధానం ప్రకారం ఒక బెంచ్ కు వెళ్లిన కేసును ప్రధాన న్యాయమూర్తి బెంచ్ కు బదిలీ చేయాలని కోరడం, ప్రధాన న్యాయమూర్తి బెంచ్ లో ఎటువంటి స్టే లు లేకుండా నడిచిపోతుందని రఘురామకృష్ణంరాజు అన్నారు . ఋషికొండపై అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని కోరుతూ మూర్తి యాదవ్, రామకృష్ణ బాబు తో పాటు, తాను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. గత ఆరు నెలలుగా హైకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదు. ఇప్పటికే ఋషికొండ తిరుక్షవరం అయ్యింది. ఋషికొండపై భవన నిర్మాణాలు అక్రమమని తేలితే కూల్చివేస్తామని హెచ్చరిస్తున్న హైకోర్టు, రాత్రింబవళ్లు అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్న అడ్డుకోలేక పోతుంది. రెండు ఎకరాలకు దాటి నిర్మాణాలు చేపట్ట వద్దని సుప్రీంకోర్టు చెబితే, ఇక్కడ మాత్రం ఋషి కొండపై నిబంధనలకు పూర్తి విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయి . అయినా న్యాయ వ్యవస్థ పై తనకు అత్యంత విశ్వాసం ఉందని రఘు రామ కృష్ణంరాజు తెలిపారు.
పవన్ కళ్యాణ్, రఘురామకృష్ణం రాజుకు ఒక రూల్?… ఆదినారాయణ రెడ్డి, కోటంరెడ్డి, ఆనం కు మరొక రూలా??
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కాపు నేతల చేత, తనని తన సామాజిక వర్గ నేతలు చేత తిట్టించే జగన్మోహన్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి లపై దళిత నేతలతో విమర్శలు చేయించడం వెనుక ఆంతర్యం ఏమిటి? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. రెడ్డి నేతలను తిట్టడానికి రెడ్లు దొరకలేదా?, లేకపోతే వారంటే మీకు భయమా?? అని నిలదీశారు. ఆదినారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి లపై రెడ్డి నాయకులతో విమర్శలు చేయిస్తే, ఆ రెడ్డి నేతలను, పెద్ద రెడ్లు చితక బాదుతారనే భయమా?, అందుకే ఇతర సామాజిక వర్గ నేతలతో తిట్టిస్తే, వారిని ఏమైనా అంటే కేసులు నమోదు చేయించవచ్చునని భావిస్తున్నారా అంటూ రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్, రఘురామకృష్ణం రాజుకు ఒక రూల్… అదే ఆదినారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డికి మరొక రూలా అంటూ నిలదీశారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని మాత్రం అదే కుటుంబ సభ్యుడితో తిట్టించి మానసికంగా హింసిస్తున్నారు.
గతంలో గడపగడపకు కార్యక్రమానికి ప్రతి ఎమ్మెల్యే విధిగా హాజరు కావాలని పేర్లు చదివి దుర్భాషలాడిన జగన్మోహన్ రెడ్డి, గైరాజరీ అయితే క్షమించేది లేదని హెచ్చరించారు. క్షవరం అయిన తర్వాత వివరం తెలిసినట్లు సోమవారం జరిగిన సమావేశం లో మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రశాంతంగా మాట్లాడారు. తాను బటన్ నొక్కేది మీకోసం అని, మిమ్మల్ని గెలిపించడానికేనని పేర్కొన్న జగన్మోహన్ రెడ్డి గడపగడపకు ప్రతి ఒక్కరూ తిరుగాలని, మిమ్మల్ని గెలిపించే బాధ్యత తనదని పేర్కొన్నారు. 60 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడం లేదని దుష్ట చతుష్టయం దుష్ప్రచారం చేస్తోందన్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై, గతంలో చెప్పింది ఆయనే కదా… ఆ దుష్ప్రచారాన్ని నమ్మవద్దంటే, ఆయన్ని నమ్మవద్దని చెప్పినట్లా అని ఎమ్మెల్యేలు తమలో తామే మాట్లాడుకుంటున్నారు . ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 1,80,000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించవలసి ఉంది. ఎక్కడ రోడ్లు లేవు, రోడ్ల మరమ్మతుకు నిధులు లేవు. ఈ పరిస్థితుల్లో కొంప కొంపకు తమను వెళ్ళమని చెప్పి, కొంపలో మాత్రం జగన్మోహన్ రెడ్డి ఉంటారట అని ఎమ్మెల్యేలు మండి పడుతున్నారు. త్వరలోనే పెండింగ్ బిల్లులను చెల్లిస్తామని ముఖ్యమంత్రి చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. ఈ నెల 4వ తేదీ కావస్తున్నప్పటికీ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదు. పింఛన్లు కూడా ఈసారి ఆలస్యం కానున్నాయి. గ్రామ పంచాయితీల నిధులను దారి మళ్లించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఇంటర్మీడియట్ బోర్డు నిధులతో, మెడికల్ కాలేజీ నిధులను కూడా దారి మళ్లించింది. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుకు లక్ష ఏళ్ల జైలు శిక్ష విధించాలని రఘురామకృష్ణం రాజు అన్నారు.
సజ్జల గైర్హాజరీ రాష్ట్ర బడ్జెట్ లోటంతా లోటు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ప్రజా ప్రతినిధుల సమావేశానికి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి కొడాలి నాని, మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఆళ్ల నాని హాజరు కాకపోవడం ఒక ఎత్తు అయితే, సకల శాఖమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి హాజరు కాకపోవడం రాష్ట్ర బడ్జెట్ లోటంత లోటు అని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. పలువురు శాసనసభ్యులు ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి పెత్తనం ఏమిటని ప్రశ్నించడం జరిగింది. ముఖ్యమంత్రి కంటే ఆయనదే పెద్ద పదవి అని పేర్కొన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి లేకుండా సమావేశం నిర్వహించడం దుస్సాహసమే అవుతుంది. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్నట్లుగా పై వారి ఆదేశాలు లేకుండానే, సజ్జల రామకృష్ణారెడ్డి అన్ని చేశారనుకోవడానికి లేదు. విజయసాయిరెడ్డిని ఇప్పటివరకు లేపి లేపి కొండ శిఖరం పైనుంచి తోసి వేశారు. ఇప్పుడు సజ్జలను కూడా తోసి వేశారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ముఖ్యమంత్రి తనకు ఉన్న నలుగురు నమ్మకస్తులను పోగొట్టుకోవడం ఎందుకు?. ఎమ్మెల్యేలు, తన తోటి ఎమ్మెల్యే అయిన ముఖ్యమంత్రితో మాట్లాడాలని అనుకుంటారు.
ముఖ్యమంత్రి జ్ఞానం లేక సలహాదారున్ని నియమించుకుంటే, ఆ సలహాదారులతోనే మాట్లాడమని ఎమ్మెల్యేలకు చెబితే వారు ఆగ్రహించడం సహజం. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి పనికి రాని వారు, ఎమ్మెల్సీ పదవికి ఎలా అర్హులు అవుతారు?. రానున్న ఎన్నికల్లో టికెట్లు దక్కని ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీ పదవులు ఇస్తానని, కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి ఆశ చూపడం హాస్యాస్పదంగా ఉంది. కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఎవరికి కావాలి. దమ్మిడి కూడా లేని కనీసం కుర్చీ కూడా లేని కార్పొరేషన్ చైర్మన్ పదవులను ఎవరు కోరుకుంటారు?. దెబ్బకు దయ్యం దిగివచ్చింది అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిలో వచ్చిన మార్పుకు ఎమ్మెల్యేలంతా సంతోషంగా ఉన్నారు. ఈనెల ఏడవ తేదీన గ్రామ సచివాలయ కన్వీనర్, గృహ సారధులతో కలిసి ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లి ఫోను వెనుక, ప్రతి ఇంటి తలుపుకు స్టిక్కర్లను అతికించాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఈనెల 13వ తేదీన జగన్మోహన్ రెడ్డి స్వయంగా తానే ఫోను ఎత్తి అందరితో మాట్లాడతానని పేర్కొనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇన్నాళ్లు ఎంపీలను ఎమ్మెల్యేలను తన కొంపలోకి రానివ్వకుండా జాగ్రత్త పడిన ఆయన, ఇప్పుడు తానే ఫోను ఎత్తి మాట్లాడుతానని పేర్కొనడం విడ్డూరంగా ఉంది. గతంలో తాను ఆయన ఇంటికి వెళితే, కనీసం తన ముఖం కూడా చూడకుండా పిఏ నే తనకు అభినందనలు తెలియజేయమని చెప్పి వెనక్కి తిప్పి పంపిన కుసంస్కారి జగన్మోహన్ రెడ్డి. ఫోన్ లో మాట్లాడడానికి కూడా చిరాకు పడే ఆయనకు ఇప్పుడు అందరితో తానే మాట్లాడుతానని చెప్పాల్సిన దుర్గతి పట్టింది. కాంట్రాక్టర్లు చేసే ఫోన్లను ఎత్తితే గత నాలుగేళ్లుగా వారంతా ఎన్ని ఇబ్బందులు పడ్డారో అర్థం అవుతుందని రఘురామకృష్ణంరాజు అన్నారు.
రామోజీరావు ఫోటోను విడుదల చేసింది ఎవరు?
పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత రామోజీరావు ను సిఐడి పోలీసులు విచారిస్తున్నప్పుడు ఆయన బెడ్ పై పడుకొని ఉన్న ఫోటో సాక్షి మీడియా, దినపత్రికలో ప్రచూరితమయింది. ఆ ఫోటో ఎలా బయటకు వచ్చింది. ఎవరు ఆ ఫోటో తీశారని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. తక్షణమే సి ఐ డి ఎస్ పి అమిత్ ను సస్పెండ్ చేయాలి. సిఐడి అధికారికంగా ఆ ఫోటోను విడుదల చేసిందా?. ఒకవేళ సిఐడి అధికారికంగా ఫోటోను విడుదల చేయకపోతే, బయట వ్యక్తులు విచారణ జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళారా ? . బయట వ్యక్తులు వెళ్ళారంటే రామోజీరావు ప్రాణాలకు రక్షణ ఏది?. 82 ఏళ్ల వయోవృద్ధుడైన రామోజీరావు బెడ్ పై పడుకొని ఉంటే ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ, తనకు బాగా లేదని అబద్ధం చెబుతున్నారని సాక్షి మీడియా కథనాలను ప్రసారం చేసింది. సిఐడి పోలీసులు 6 గంటల పాటు ఆయన్ని విచారించగా , వైద్యుల సలహా మేరకు మధ్యలో రెండు గంటల పాటు విశ్రాంతి తీసుకున్న అనంతరం మళ్లీ సిఐడి పోలీసుల విచారణకు రామోజీరావు సహకరించినట్లు ఈనాడు దినపత్రిక కథనములో వెల్లడించడం జరిగింది. అవును డబ్బులు దారి మళ్లించాను అని రామోజీరావు అంగీకరించినట్లుగా సాక్షి దినపత్రికలో రాసి, దాని పక్కనే చిన్నగా పరోక్షంగా అని రాయడం వెనుక మతలబు ఏమిటి?. సీ ఐ డి రిపోర్టు సాక్షికి ఎలా తెలుసు?. గతంలో ఇదేవిధంగా సిబిఐ విచారణ గురించి ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు రాస్తే బల్ల కింద నక్కి విన్నారా అని మా పార్టీ వారు ప్రశ్నించిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు సాక్షి దినపత్రిక యజమాని అలాగే బల్ల కింద నక్కి ఏమైనా విన్నారా?. ఈరోజు రామోజీరావుకు జరిగింది… రేపు ఎవరికైనా జరుగవచ్చు. ప్రజలంతా సంఘటితమై ఐక్యంగా ఈ విధానాన్ని ఖండించాలి. పొలిటికల్ పంచ్ అనే వెబ్సైట్ రాష్ట్ర ప్రభుత్వమే నడిపిస్తోంది. రామోజీరావు గురించి జుగుస్సాకరంగా రాయడానికి ఆ వెబ్సైట్ కు సిగ్గు లేదా?. మళ్లీ సిఐడి విచారణ అంటూ జరిగితే రామోజీరావు ప్రాణాలకు ప్రమాదం ఉంది. రామోజీరావు ఫోటో బయటకు రావడం వెనుక కుట్ర కోణం దాగి ఉంది. రేపు ఆయనకు ఏదైనా జరిగితే, ప్రశ్నలు అడగడం వల్లే ఆయనకు అపాయం జరిగిందని ప్రచారం చేసుకోవడానికి ఈ ఫోటోను బహిర్గతం చేసినట్లు అర్థం అవుతోంది. బాబాయిని హత్య విచారణను అడ్డుకుంటూ, ఏ ఒక్కరూ ఫిర్యాదు చేయకపోయినా మార్గదర్శి సంస్థపై ఉద్దేశ పూర్వకంగా కేసులు నమోదు చేయడాన్నీ ప్రతి ఒక్కరూ ఖండించాలని రఘురామకృష్ణంరాజు కోరారు.