Suryaa.co.in

Andhra Pradesh

జీవో-01పై అడిషనల్ డీజీ చెప్పిన కట్టుకథలన్నీ తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్టే

• రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛను బ్రిటీష్ చట్టాలతో అడ్డుకునే హక్కు జగన్ రెడ్డికి, పోలీసులకు ఉందా?
• చీకటి జీవోని గుడ్డిగా సమర్థిస్తున్న మంత్రులు, పోలీసులు, కుప్పంలో చంద్రబాబుని ఎందుకు అడ్డుకున్నారో సమాధానం చెప్పాలి
• జగన్ రెడ్డి వచ్చాకే రాష్ట్రంలో ర్యాలీలు, రోడ్ షోలు, బహిరంగసభలు జరుగుతున్నాయా?
• ప్రతిపక్షంలో ఉండి జగన్ పాదయాత్రచేసినప్పుడు, నాటిప్రభుత్వం పోలీసులు అడ్డుకున్నారా?
• వివేకాకేసులో న్యాయస్థానం వ్యాఖ్యలు ఏపీ పోలీస్ కు, ముఖ్యమంత్రికి సిగ్గుచేటుకాదా?
• పోలీసులు, ప్రభుత్వం కాకమ్మకథలు చెప్పకుండా లోకేశ్ యువగళం పాదయాత్రకు అనుమతిస్తుందనే భావిస్తున్నాం
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు

కాలంచెల్లిన బ్రిటీష్ చట్టాలతో చీకటిజీవో తెచ్చిన పాలకుల అడుగులకు మడుగులొత్తడమే గాక, రాజ్యాంగంద్వారా సంక్రమించిన భావప్రకటనా స్వేచ్ఛను హరించే హక్కు పోలీసులకు, ఎవరిచ్చారని, న్యాయస్థానాలు తలంటుతున్నా, ప్రజలు ఛీత్కరిస్తున్నా సిగ్గులేకుండా, ఖాకీలు చట్టాల్ని తుంగలో తొక్కుతూ, తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాల్ని గుడ్డిగా అమలు చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…

“జీవోనెం-01 పై నిన్న అడిషనల్ డీజీ రవిశంకర్ చెప్పిందంతా తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్టే. చీకటిజీవో-01 తీసుకొచ్చినందుకు ప్రజలు సర్కారుని, పోలీసుల్నిఛీకొడుతున్నారు. దాంతో ఏంచేయాలో పాలుపోక, విధిలేకనే నిన్న రవిశంకర్ తో కట్టుకథలు చెప్పించారు. రవిశంకర్, ఇతర పోలీస్ అధికారుల మాటల్లో కనిపిస్తున్న ఉదాసీనత, చేతల్లో కార్యక్రమాల్లో ఎక్కడా అమలుకావడంలేదు. కుప్పంలో చంద్రబాబుని అడ్డుకున్న తీరే అందుకు రుజువు.

కుప్పం వెళ్లకముందే చంద్రబాబుని ఎందుకు అడ్డుకున్నారో రవిశంకర్ చెప్పాలి?
బెంగుళూరు విమానాశ్రయం నుంచి చిత్తూరు సరిహద్దులోకి రాగానే చంద్రబాబుని అడ్డుకోవా ల్సిన పరిస్థితి పోలీసులకు ఎందుకు వచ్చిందో రవిశంకర్ సమాధానం చెప్పాలి. మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేతను కుప్పం డీఎస్పీ అడ్డుకున్న తీరు చట్టబద్ధమేనా? ఖాకీదుస్తులు వేసుకున్నాననే విషయం మర్చిపోయి, ఆనాడు డీఎస్పీ చేసిన ఓవరాక్షన్ అడిషనల్ డీజీ, డీజీపీకి కనిపించలేదా? కుప్పం పర్యటనకు చంద్రబాబుకి అనుమతిచ్చిన పోలీసులు, తరువాత ఎందుకు అడ్డుకున్నారు? ఎవరి ఆదేశాలతో ప్రతిపక్షనేతను అటకాయించారో రవిశంకర్ చెప్పాలి. 7సార్లు కుప్పంలో ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని ఒకసాధారణ పౌరుడికంటే దారుణంగా ట్రీట్ చేస్తారా? చంద్రబాబు ప్రచారరథాన్ని స్థానికడీఎస్పీ ఏకపక్షంగా ఎందుకు సీజ్ చేశారో, ఇప్పటికీ వాహనాన్ని ఎందుకు వదల్లేదో అడిషనల్ డీజీ చెప్పాలి. చంద్రబాబు పర్యటనకు వచ్చిన మహిళలపై హత్యాయత్నం కేసులు పెట్టడం పోలీస్ శాఖకు అవమానం కాదా? న్యాయమూర్తి ఇలా తప్పుడు కేసులు ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నా ఖాకీల వైఖరి మారదా?

కందుకూరు, గుంటూరులో పోలీసులు తగినభద్రతాఏర్పాట్లు చేశారా?
చంద్రబాబు కందుకూరు పర్యటనలో జనం భారీగా వస్తారనితెలిసీ, పోలీస్ శాఖ ఎందుకు సరైన భద్రతాచర్యలు చేపట్టలేదు? గుంటూరు దుర్ఘటన జరక్కుండా పోలీసులు జనాన్ని ఎందుకు కట్టడిచేయలేకపోయారు? గుంటూరు సభకు ముందే అనుమతి తీసుకున్నా, చాలీ చాలకుండా పోలీసుల్ని ఎందుకు పంపించారు? ఘటన జరిగాక ఎస్పీ 200మంది పోలీసుల్ని బందోబస్త్ కోసం నియమించామన్నారు. మరి తొక్కిసలాట జరిగేవరకు 200మంది పోలీ సులు చోద్యం చూశారా? అదేనిజమైతే పేదల ప్రాణాలు పోవడానికి ముమ్మాటికీ పోలీసులే కారకులు అవుతారు.

ముందస్తు అనుమతితోనే జగన్ రెడ్డి పాదయాత్రచేశాడా?
జగన్ రెడ్డి వచ్చాకే రాష్ట్రంలో రాజకీయపార్టీలు ర్యాలీలు, రోడ్ షోలు, బహిరంగసభలు నిర్వహిస్తున్నాయా? జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు తెలుగుదేశంప్రభుత్వం భద్రతా ఏర్పాట్లు చేయలేదా? ఆనాడు ముందస్తు అనుమతి తీసుకునే జగన్ రెడ్డి జనం బుగ్గలు నిమిరాడా? ప్రతిపక్షనేత సభల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్న ఏకైక బాధ్యతను నాడు టీడీపీప్రభుత్వం సక్రమంగా నెరవేర్చింది. చంద్రబాబుగారి ప్రతిసభ, సమావేశానికి ముందస్తు అనుమతికోరుతున్నా, అనుమతి వ్వకుండా, పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారు? ప్రజాస్వామ్యవ్యవస్థలో రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాల్సిన పోలీస్ శాఖ, కొందరు అధికారుల తీరుతో పరువు కోల్పోతోంది.

చీకటి జీవోతో తెల్లదొరల్ని పాలనని గుర్తుచేసిన పెద్దతెల్లదొర జగన్ రెడ్డి
రాజ్యాంగం ద్వారా పౌరులకు సంక్రమించిన భావప్రకటనాస్వేచ్ఛను హరించడానికే జగన్ జీవోనెం-01 తీసుకొచ్చాడు.బ్రిటీష్ చట్టాలతో జీవోతీసుకొచ్చి, మరలా తెల్లదొరలపాలనని ప్రజలకు గుర్తుచేసిన పెద్దతెల్లదొర జగన్ రెడ్డి. ప్రజలు, ప్రతిపక్షాల గొంతునొక్కడానికి చీకటి జీవో తెచ్చిన ముఖ్యమంత్రిని సమర్థిస్తూ, పోలీస్ అధికారులు, మంత్రులు ఉచ్ఛం నీచం లేకుండా సన్నాయినొక్కులు నొక్కితే సరిపోతుందా? జగన్ రెడ్డి నాలుగేళ్లపాలనచూసిన ప్రజలు ఆగ్రహావేశాలతో, చంద్రదబాబుసభలకు తరలివస్తున్నారన్న అక్కసుతోనే చీకటిజీవో తెచ్చారు. రాజకీయ, సినీ, వ్యాపారరంగాలతోపాటు, ప్రజలంతా తన కాలికింద ఉండాలని జగన్ భావిస్తున్నాడు.

ప్రజాగ్రహాన్ని అణచడానికి జగన్ రెడ్డి అవలంభించే చర్యలే ఆయన మెడకు ఉరితాళ్లు
ఛలోకావలి కార్యక్రమానికి వెళ్లిన రాష్ట్రఎస్సీ సెల్ అధ్యక్షులు ఎం.ఎస్.రాజుని పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు? అక్రమంగా అదుపులోకి తీసుకొని 4జిల్లాలు తిప్పి, అర్థరాత్రి ఎక్కడో తీసుకెళ్లి వదిలేస్తారా? విజయవాడలో మైనారిటీ మహిళల కళ్లల్లో కారంకొట్టిమరీ, వైసీపీ సెటిల్ మెంట్ గ్యాంగ్ దాడిచేసింది. పింఛన్ గురించి ప్రశ్నించిన మహిళల్ని రౌడీలతో కొట్టిస్తారా? తప్పుడుకేసులు పెట్టి, బాధితుల్నే పోలీస్ స్టేషన్లో ఉంచి వేధిస్తారా? తాడేపల్లి ప్యాలెస్ చెప్పిందనో, మరొకరు చెప్పారనో పోలీసులు కక్షపూరితంగా, పక్షపాతంతో వ్యవహ రిస్తే, న్యాయస్థానాలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ప్రజల్రి, ప్రతిపక్షాలను కట్టడి చేయ డానికి జగన్ రెడ్డి అవలంభించే అహంకారచర్యలే, మున్ముందు ఆయన మెడకు ఉరితాళ్లుగా మారతాయి.

కాకమ్మ కథలు చెప్పకుండా లోకేశ్ పాదయాత్రకు అనుమతిస్తారనే భావిస్తున్నాం
27వతేదీ నుంచి నారాలోకేశ్ చేయబోతున్న పాదయాత్రకు ఇప్పటికే పోలీసుల అనుమతి కోరాం. చిత్తూరు ఎస్పీకి కూడా తెలియచేశాం. పాదయాత్ర ఆపడానికి ఈ ప్రభుత్వం, పోలీసు లు ఎన్నికాకమ్మ కథలు చెబుతారో చూడాలి. శాంతియుతమార్గంలో, జగన్ రెడ్డి పాలనతో సర్వంకోల్పోయిన ప్రజలకు ధైర్యంచెప్పడానికి, వారికి నేనున్నాను అనే భరోసా ఇవ్వడానికే టీడీపీ యువనేత పాదయాత్రకు సిద్ధమయ్యారు. లోకేశ్ పాద యాత్రకు ఎలాంటి అడ్డంకులు, అవాంతరాలు సృష్టించకుండా అనుమతిస్తారనే భావిస్తున్నాం. జగన్ రెడ్డే వివేకాహత్యకేసు నిందితుల్ని కాపాడుతున్నాడని, ఏపీ పోలీస్ శాఖ హత్యకేసు విచారణసక్రమంగా చేయడంలేదని, నిందితుల్ని రక్షిస్తున్నారని, ప్రభుత్వఆదేశాలతో కేసు విచారిస్తున్న సీబీఐ అధికారుల్ని బెదిరిస్తున్నారని ముఖ్యమంత్రి సొంతచెల్లెలే కోర్టుని ఆశ్రయించింది. వివేకా కుమార్తె సునీత వాదనలతో ఏకీభవించాకే, హత్యకేసు విచారణను న్యాయస్థానం పొరుగురాష్ట్రానికి బదిలీచేసింది. వివేకాహత్యకేసు విచారణలో న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ఏపీ పోలీస్ కు, ముఖ్యమంత్రికి సిగ్గుచేటుకాదా” అని బొండా నిలదీశారు.

LEAVE A RESPONSE