Suryaa.co.in

Andhra Pradesh

సారా మరణాలన్నీ జే-గ్యాంగ్ మద్యం మాఫియా హత్యలే

=మూడేళ్లు పూర్తైనా.. తెలుగుదేశం ప్రభుత్వంపై పడి ఏడుపులు సిగ్గుచేటు
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు

టీడీపీ హయాంలో పంట పొలాల్లో జలాలు పారితే… వైసీపీ పాలనలో నకిలీ మద్యం, నాటుసారా ఏరులై పారిస్తున్నారు. జగన్ రెడ్డి సొంత బ్రాండ్లతో నాసిరకమైన మద్యాన్ని ప్రజల నెత్తిన రుద్దుతూ వారి ప్రాణాలు తీస్తున్నారు. మద్యం అమ్మకాలతో ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందో.. జగన్ రెడ్డి గ్యాంగ్ సారా, గంజాయి, డ్రగ్స్ తో అంతకు పదింతల ఆదాయం వెనకేసుకుంటోంది. మద్యపానం జీవితాల్లో చిచ్చులు పెడుతోందని, దాన్ని నిషేధించి తీరుతామని ప్రతిపక్ష నేతగా ప్రతిజ్ఞ చేసిన జగన్ రెడ్డి.. తమ సొంత బ్రాండ్ల కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా ఎందుకు పట్టించుకోవటం లేదు?

ఎక్సైజ్ శాఖ ఈ 3 ఏళ్లలో జరిపిన మద్యం అమ్మకాలు, ఆదాయం, చేసిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి. 3 ఏళ్లలో మద్యపాన నిషేదానికి తీసుకున్న చర్యలేంటి? ఎక్సైజ్ శాఖ, బేవరేజేష్ కార్పోరేషన్ పరిధిలో ఎంత అప్పులు తెచ్చారు. వాటికి ఎంత వడ్డీ చెల్లిస్తున్నారు? ఏమేం తాకట్టు పెట్టారు? తెచ్చిన అప్పులు దేని కోసం ఉపయోగించారు? ఇంకా ఎంత అప్పు‎ కోసం కొత్తగా దరఖాస్తు చేశారు?

ఏయే డిస్టరీల నుంచి ఏయే బ్రాండ్లు కొంటున్నారు? టెండర్లు లేకుండా కొనడానికి గల కారణాలేంటి? బ్రాండ్ల క్వాలిటీ ఏంటి? ల్యాబ్ రిపోర్టులు? తదితర విషయాలను బహిరంగ పరచాలి.ఆవ గింజలంటే.. తాటికాయల్లా పెద్దపెద్దగా ఉంటాయి అన్నట్లుంది వైసీపీ నేతల తీరు. ప్రభుత్వంపై పెరిగిన వ్యతిరేకత, సారామరణాలు, అప్పుల నుండి ప్రజల దృష్టి మరల్చేందుకు పెగాసెస్ పేరును తెరపైకి తీసుకొచ్చారు. పెగాసెస్ అనేది ఏంటో, ఎందుకు ఉపయోగిస్తారో.. చివరికి దాని స్పెల్లింగ్ కూడా తెలియని కొంత మంది వేలిముద్రగాళ్లు పెగాసెస్ పేరుతో తెలుగుదేశంపై బురద వేయాలనుకుంటే అది మీపైనే పడుతుందనే విషయం గుర్తుంచుకోవాలి.

అలాంటి సాఫ్ట్ వేర్ ఏదీ కూడీ ప్రైవేటు వ్యక్తులకు అమ్మదని, గవర్నమెంటుకే అప్పజెబుతుందని, అందుకు కేంద్రం అనుమతి అవసరమని ఆరోపణలు చేస్తున్న వైసీపీ గ్యాంగ్ తెలుసుకోవాలి. నిఘాకు సంబంధించిన ఎలాంటి సాఫ్ట్ వేర్ కూడా గత ప్రభుత్వం కొనుగోలు చేయలేదని ఆర్టీఐ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది. పెగాసెస్ అనే సాఫ్ట్ వేర్ కొనుగోలు చేస్తే బడ్జెట్ కేటాయింపులు చూపించాలి. ఆడిట్ రిపోర్టలో లెక్కలు ఉంటాయి. ఇవన్నీ కాగ్ నివేదికలో వెల్లడవుతాయి. ఇన్ని రకాలైన నివేదికల్లో ఎక్కడా పెగాసెస్ గురించిన ప్రస్తావన లేకపోయినా.. ఏదో జరిగిపోయిందంటూ జగన్ రెడ్డి గ్యాంగ్ ఆరోపించడం సిగ్గుచేటు.

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్, కోడికత్తి, బాబాయి బాత్రూం గొడ్డలి వేటు, పింక్ డైమండ్, డీఎస్పీ ప్రమోషన్లు ఇలా వైసీపీ అబద్దాల జాబితాలో ఇప్పుడు పెగాసెస్ కూడా ఒకటి. అప్పులు, అక్రమ కేసులు, లూటీతో రాష్ట్ర పరువును రోడ్డున పడేసిన జగన్ రెడ్డి.. లేని పెగాసెస్ చూపించి ప్రపంచ స్థాయిలో రాష్ట్ర పరువును మంటగలుపుతోంది.

పెగాసెస్ అనేదే నిజమైతే.. బాబాయి బాత్రూం కథ అప్పుడే బయటపడేది. అధికారంలోకి వచ్చి మూడేళ్లైనప్పటికీ ఇంకా తెలుగుదేశం ప్రభుత్వంపై పడి ఏడవడం మాని.. మీరేం చేశారో ప్రజలకు చెప్పుకోండి. ఇంకా తెలుగుదేశం ప్రభుత్వంపై ఏడుస్తూ.., నిందలేస్తూ ప్రజల ముందు ప్రభుత్వం నవ్వులపాలవుతోంది.

LEAVE A RESPONSE