-ఉమ్మడి కార్యాచరణకు సిద్ధం
-రేపటి సమావేశంలో విధివిధానాల నిర్ణయం
పీఆర్సీపై పోరాటం చేసేందుకు అన్ని సంఘాలు ఒకే వేదికపైకి రావాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఉమ్మడి కార్యాచరణకు సిద్ధం కావాలని,అన్ని జేఏసీలు ఒకేతాటిపైకి రావాలని అభిప్రాయపడ్డాయి. రేపటి సమావేశంలో విధివిధానాలను నిర్ణయిస్తామని జేఏసీ నేతలు తెలిపారు. ఉమ్మడి కార్యాచరణపై రేపు సచివాలయంలో మరోమారు భేటీ అవుతామన్న నేతలు ప్రభుత్వం ముందు పెట్టాల్సిన డిమాండ్లపై చర్చిస్తామని వెల్లడించారు.
ఉద్యోగ సంఘాలతో చర్చించాక ఉమ్మడి కార్యాచరణ : బండి శ్రీనివాసరావు, ఏపీఎన్జీవో సంఘ అధ్యక్షుడు
సమ్మె నోటీసు విషయమై మేము కట్టుబడి ఉన్నాం. సమ్మె నోటీసు విషయమై ఉద్యోగ సంఘాల భేటీలో చర్చిస్తాం. సమ్మె విషయంలో మాతో పాటు కలిసి రావడంపై చర్చిస్తాం.
ఒకే వేదికపైకి వచ్చాం : అమరావతి జేఏసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు
ఉదయం 11.30 గం.కు ఉద్యోగ సంఘాలు భేటీ అవుతాయని అమరావతి జేఏసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెల్లడించారు. ప్రభుత్వం ముందు పెట్టాల్సిన డిమాండ్లపై చర్చిస్తామని చెప్పారు. 11వ పీఆర్సీ సాధన విషయమై భేటీలో చర్చిస్తామన్న ఆయన నాలుగు ఉద్యోగ సంఘాల నాయకులం ఒకే వేదికపైకి వచ్చామని స్పష్టం చేశారు. ఉమ్మడి కార్యాచరణ కోసం ఏకాభిప్రాయానికి వస్తామని వివరించారు.
డిమాండ్లపై చర్చిస్తాం : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ
అన్ని జేఏసీలు ఒకేతాటిపైకి రావాలని నిర్ణయం. రేపు సచివాలయంలో ఉద్యోగ సంఘాల భేటీ ఉంటుంది. రేపటి సమావేశంలో విధివిధానాల నిర్ణయం. ప్రభుత్వం ముందు పెట్టాల్సిన డిమాండ్లపై చర్చిస్తాం.
ప్రభుత్వంపై ఉమ్మడిగా పోరాటం : ఉద్యోగ సంఘాలు
పీఆర్సీ సాధన కోసం ఉద్యోగ సంఘాలు ఏకమయ్యాయి. ఓ ప్రైవేటు హోటల్లో భేటీ అయిన ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఉమ్మడిగా పోరాటం చేయాలని నిర్ణయించాయి. శుక్రవారం మరోసారి సచివాలయంలో అన్ని సంఘాలు భేటీ అయి ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. పీఆర్సీపై జారీ చేసిన జీవోలతో ప్రభుత్వ ఉద్యోగులందరికి నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు. కాగా పీఆర్సీలో ఫిట్మెంట్ తగ్గించడం, హెచ్ఆర్ఏలో కోత విధించడంపై ఉద్యోగులు భగ్గుమంటున్నారు. ఉపాధ్యాయ సంఘాల నిరసనలతో ఏపీ అట్టుడికిపోతోంది. పీఆర్సికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీవోలను రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుట్టాయి. జీఓలను రద్దు చేస్తేనే తాము ప్రభుత్వంతో చర్చలకు వస్తామని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు.