న్యూఢిల్లీ: మహత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కాఫీ ప్లాంటేషన్ కార్యకలాపాలను అనుమతించబోమని గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి రాజ్యసభలో స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని పాడేరు ప్రాంతంలో నిరుపేద గిరిజన రైతుల ప్రయోజనం కోసం ఉపాధి హామీ పథకం కింద కాఫీ ప్లాంటేషన్ అభివృద్ధికి ప్రభుత్వం అనుమతిస్తుందా అని వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబుగా మంత్రి ఈ విషయం చెప్పారు.
ఉపాధి హామీ పథకం అనేది డిమాండ్‌ను బట్టి ఉపాధి కల్పించే కార్యక్రమం. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల పేదలకు జీవనోపాధి భద్రత కల్పించాలన్నది ఉద్దేశం. ఈ పథకం కింద ప్రతి ఆర్థిక సంవత్సరంలో గ్రీమీణ పేదలకు వంద రోజులపాటు వేతనంతో కూడిన ఉపాధికి హామీ ఇవ్వడం జరుగుతుందని మంత్రి చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద తమ సొంత భూమిలో వ్యక్తిగత ఆస్తులు సృష్టించుకోవడానికి ప్రభుత్వం అనుమతిస్తుంది. అందులో భాగంగా భూమి అభివృద్ధి పనులు, సాగు చెరువుల తవ్వకం, వ్యవసాయ బావుల తవ్వకం, ఉద్యానవన పంటలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన పనులు, కోళ్ళు, మేకల షెడ్లు వంటి పనులను చేపట్టవచ్చని మంత్రి తెలిపారు.