– అమరావతి నిర్మాణానికి రూ. 60 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా
– నాలుగేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తిచేయాలని టార్గెట్
– అమరావతి తో పాటు ఏకకాలంలో 26 జిల్లాల అభివృద్ధి
– లే అవుట్ లు, భవన నిర్మాణాలకు అనుమతులు సరళతరం
– క్రెడాయ్ సౌత్ కాన్ లో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ
విజయవాడ: అమరావతి నిర్మాణ పనులు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. రాజధానిలో ప్రస్తుత పరిస్థితిపై అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. మూడు నెలల్లో అధ్యయనం పూర్తి చేసి ఆ తర్వాత నిర్మాణం మొదలు పెడతామన్నారు. విజయవాడ శివారు కంకిపాడులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన క్రెడాయ్(కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా )సౌత్ కాన్ 2024 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరావతి నిర్మాణానికి 60 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసామన్నారు. నాలుగేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు తనకు చెప్పారన్నారు. వీలైనంత త్వరగా రాజధాని పూర్తయ్యేలా ముందుకెళ్తున్నమని అన్నారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి నారాయణ కోరారు. లే అవుట్లు, భవన నిర్మాణాలకు అనుమతులు సులభతరం చేస్తామని… కానీ నిబంధనలు ఉల్లంగించవద్దని కోరారు… అన్ని అనుమతులు సింగిల్ విండో విధానంలో ఇచ్చేలా సాప్ట్ వేర్ రూపకల్పన చేస్తున్నామన్నారు. టౌన్ ప్లానింగ్ విభాగం లో మెరుగైన విధానాలు అమలు చేసేందుకు 11 రాష్ట్రాల్లో అధికారుల కమిటీలు అధ్యయనం చేస్తున్నాయని మంత్రి చెప్పారు. క్రెడాయ్ ప్రతినిధులతో చర్చిన తర్వాతే నిబంధనలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జీవో నెంబర్ 90 అమలు, రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ లో వెసులుబాటు అంశాలు పరిశీలిస్తున్నామని చెప్పారు. తణుకు లో టీడీఆర్ బాండ్ల జారీలో పెద్ద స్కాం జరిగిందన్నారు.