-ఒక్క ఎస్ఆర్ఎం వర్సిటీతోనే 2వేల ఉద్యోగాలు
-పెనుమాక రచ్చబండ కార్యక్రమంలో నారా లోకేష్
మంగళగిరి: అమరావతిలో ఏర్పాటుచేసిన ఒక్క ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ద్వారా 2వేల ఉద్యోగాలు వచ్చాయి, అమరావతి పనులు కొనసాగించి ఉంటే లక్ష మందికి ఉపాధి లభించేదని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. తాడేపల్లి రూరల్ పెనుమాక కొత్తూరు సెంటర్ లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో యువనేత పాల్గొన్నారు. అంతకుముందు స్థానిక నేతలు అల్లు శివారెడ్డి, మేకా సుబ్బారెడ్డి గృహాలకు వెళ్లి వారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
అనంతరం రచ్చబండ కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ… టీడీపీ హయాంలో అమరావతి ప్రాంతంలో 6,7 కంపెనీలు తీసుకువచ్చాం. ఎస్ఆర్ ఎం, విట్, అమృతమయి వంటి సంస్థలు వచ్చాయి. 2019 ఎన్నికల సమయంలో అమరావతి రాజధాని ఇక్కడే ఉంటుందని నమ్మించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి తర్వాత వెన్నుపోటు, నమ్మకద్రోహానికి పాల్పడ్డారు. మూడు రాజధానులకు మొదట ఓటేసిన వ్యక్తి ఆర్కే. ఓట్లు అడగడానికి చెల్లెమ్మతో వస్తే రాజధాని విషయంలో ఎందుకు మోసం చేశారని నిలదీయాలి.
4.11 నెలల కాలంలో అమరావతిలో ఒక్క ఇటుక వేయలేదు, కనీసం రోడ్డుపై గుంతలు పూడ్డలేదు. మూడు ముక్కలాటతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మంగళగిరిని నా సొంతం చేసుకుని అహర్నిశలు కష్టపడుతున్నా. భారీ మెజార్టీతో గెలిపించాలి. అధికారంలోకి వచ్చిన వెంటనే దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న వారికి శాశ్వత పట్టాలు ఇస్తాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంతో పాటు, కుళాయి ద్వారా ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందిస్తాం. పెనుమాకలో స్మశానానికి స్థలం కేటాయిస్తాం. కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.