– రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు
కాకినాడ: అమరావతి కేవలం ఒక నగరం కాదని, ఐదు కోట్ల ఆంధ్రుల ఆశలు, ఆకాంక్షలకు ప్రతీక అని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు పేర్కొన్నారు. అమరావతి నిర్మాణానికి రైతులు చేసిన త్యాగాన్ని ప్రస్తావిస్తూ, ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని విధంగా 29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాల భూమిని ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఇలాంటి అపూర్వమైన త్యాగాన్ని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన అనుభవంతో నారా చంద్రబాబు నాయుడు అమరావతిని గ్రీన్ ఫీల్డ్ సిటీగా తీర్చిదిద్దాలని కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే రాష్ట్ర అభివృద్ధికి సహకరించాల్సిన వైసీపీ పార్టీ, అమరావతి అంశంపై వ్యతిరేక ధోరణి అవలంబిస్తోందని విమర్శించారు.
దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలు అమరావతికి మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో, కేవలం వైసీపీ మాత్రమే ఎందుకు వ్యతిరేకిస్తోంది అనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు. జగన్ అనుసరిస్తున్న విధానం స్పష్టతలేని దృక్పథాన్ని సూచిస్తోందని అన్నారు.అమరావతి ఉద్యమంలో మహిళల పాత్రను గుర్తుచేస్తూ, స్వాతంత్ర్య సమరంలో జరిగిన త్యాగాలను పోల్చారు. నారా భువనేశ్వరి చేసిన సహాయం ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిందని చెప్పారు.
హనుమాన్ జయంతి సందర్భంగా మాట్లాడుతూ, అమరావతికి సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వం వహిస్తుండగా, ఆయనకు మద్దతుగా పవన్ కళ్యాణ్, నారా లోకేష్ నిలుస్తున్నారని పేర్కొన్నారు. చివరగా అమరావతి చారిత్రక ప్రాధాన్యతను వివరిస్తూ, శాతవాహనుల వైభవాన్ని ప్రతిబింబించే ఈ ప్రాంతం భవిష్యత్తులో విశ్వనగరంగా అభివృద్ధి చెందుతుందని సానా సతీష్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.