అన్నిచోట్ల ఆదరణ.. జన ప్రవాహంలా అమరావతి రైతుల పాదయాత్ర

అమరావతి రైతుల మహాపాదయాత్రను దివిసీమ ఆదరించి అక్కున చేర్చుకుంది

అవనిగడ్డ: పెనుమూడి వారధి మీదుగా కృష్ణా జిల్లాలోకి ప్రవేశించినప్పటి నుంచి పాదయాత్ర ముగిసే వరకూ.. జనం వెల్లువలా తరలివచ్చి.. వారితో కలిసి నడిచారు.కృష్ణమ్మ పరవళ్లకు పోటీగా జన ప్రవాహం పోటెత్తడంతో.. మరింత ఉత్సాహంగా రైతులు ముందుకు కదిలారు. కాళ్లు బొబ్బలెక్కి బాధిస్తున్నా.. భరిస్తూ సంకల్పం దిశగా అడుగులు వేశారు.

రాజధాని రైతుల పాదయాత్ర రోజు రోజుకు మహోధృతమవుతోంది. పాదయాత్ర తొమ్మిదో రోజు బాపట్ల జిల్లా నుంచి కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది. పెనుమూడి వారధిపై నుంచి రైతుల పాదయాత్రకు కృష్ణా డెల్టాAMARA1ప్రజానీకం ఆత్మీయ స్వాగతం పలికింది. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుని చెంత పూజలు చేసిన రైతులు అమరావతిని ఆశీర్వదించాలని మొక్కుకున్నారు.

అమరావతి నుంచి అరసవల్లికి రాజధాని రైతులు చేపట్టిన మహాపాదయాత్ర.. సోమవారం విరామం తర్వాత మంగళవారం ఉదయం బాపట్ల జిల్లా రేపల్లె శివారు నుంచి మొదలైంది. పెనుమూడి – పులిగడ్డ వారధి మీదుగా కృష్ణా జిల్లాలోకి ప్రవేశించే సమయంలో.. రైతులకు జనం అపూర్వ స్వాగతం పలికారు. వారధికిAMARA-2రెండువైపులా అమరావతి రైతు ఐకాస ఆకుపచ్చ జెండాలతో అలంకరించారు. రైతులు.. ఆకుపచ్చని కండువాలు, టోపీలు, జెండాలతో నడుస్తున్న సమయంలో.. వారధి హరితవర్ణ శోభతో కళకళలాడింది. డప్పు వాయిద్యాలు, కళాకారుల నృత్యాలు, జనం సందడితో వారధిపై కోలాహలం నెలకొంది.

మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ.. వారధిపై స్వాగతం పలికి రైతులను ఆహ్వానించారు. జనం రద్దీ ఎక్కువగా ఉండటం, మోపిదేవి నుంచి ప్రజలు తరలిరావడంతో.. జనసందోహం నడుమ యాత్ర నెమ్మదిగా సాగింది.మోపిదేవిలో భోజన విరామం తీసుకున్న రైతులు.. అనంతరం సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయంలో పూజలు చేశారు.

పెద్దప్రోలు, కప్తానుపాలెం, కాసానగరం మీదుగా చల్లపల్లి చేరుకుని రాత్రికి అక్కడే బస చేశారు. 9వ రోజున 16 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. పాదయాత్ర చేస్తున్న మహిళలను ఎదుర్కోలేక.. వైకాపా ప్రజాప్రతినిధులు, మద్దతుదారులు.. అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని.. రైతులు, అమరావతి పరిరక్షణ సమితి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతుల పాదయాత్రకు అన్నివర్గాల ప్రజలు అండగా నిలుస్తున్నారు. న్యాయవాదులు, వాకర్స్‌ అసోసియేషన్ ప్రతినిధులు, భారతీయ కిసాన్ సంఘ్‌ నాయకులు, దివిసీమ లలితకళాసమితి కళాకారులుAMARA3 పాదయాత్రలో పాల్గొన్నారు. తెలుగుదేశం, జనసేన, భాజపా, వామపక్షాల నాయకులు.. రైతుల వెంట నడిచారు. ప్రజలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప.. ముఖ్యమంత్రి మూడున్నరేళ్లలో చేసిందేంటని.. రాజకీయ పార్టీలు నిలదీశాయి.

రైతుల పాదయాత్రలో రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్, మాజీ ఎంపీ కొనకల్ల నారాయణ, మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్, పెడన తెదేపా ఇంచార్జ్ కాగిత కృష్ణబాబు, జనసేన కృష్ణా జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, అవనిగడ్ట ఇంచార్జ్ శేషుబాబు పాల్గొన్నారు.

“హైకోర్టు తీర్పు అమలు చేయకుండా కాలయాపన చేసి… ఆరు నెలల తర్వాత సుప్రింకోర్టుకు వెళ్లారు. ఏ కోర్టుకు వెళ్లినా అమరావతి నుంచి రాజధాని మారదు. కేవలం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం కోసమే ప్రభుత్వం కుట్ర చేస్తోంది.” అని కనకమేడల రవీంద్రకుమార్, తెదేపా ఎంపీ అన్నారు.

పాదయాత్రలో పాల్గొన్న మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ..ఇప్పటికే రాజధాని నిర్మాణం అమరావతిలో జరిగిందన్నారు. ప్రభుత్వం కేవలం ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకే మూడు రాజధానులని అంటోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇచ్చిందని గుర్తు చేశారు. రైతుల పాదయాత్ర ఇవాళ 16 కిలోమీటర్లకు పైగా సాగి చల్లపల్లిలో ముగిసింది. పదో రోజు పాదయాత్ర చల్లపల్లిలో ప్రారంభమై.. లంకపల్లి మీదుగా చిన్నాపురం వరకూ.. సుమారు 17 కిలోమీటర్ల మేర సాగనుంది.

Leave a Reply