ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ‘అమరావతి’ నగర సృష్టికి ఇప్పటి వరకు ఎదురైన సమస్త అడ్డంకులన్నీ ‘చట్ట బద్ధం’ గా తొలగిపోయాయి. ఈ తొలగి పోవడానికి , రాష్ట్రం ఏర్పడిన తరువాత…..పదేళ్ల సమయం పట్టింది.
నిజానికి, ఒక రాష్ట్రానికి రాజధాని ఎంపిక అనేది…. ఇప్పటి వరకు దేశం లో ఏ రాష్ట్రానికీ అసలు సమస్యే కాలేదు.
మన దేశం లో 29 రాష్ట్రాలు ఉన్నాయి. జమ్ము, కశ్మీర్ నుంచి కేరళం వరకు…. అసోమ్ నుంచి మహారాష్ట్ర… గుజరాత్ వరకు…. రాష్ట్ర రాజధాని ఎంపికలో వీసమెత్తు సమస్య కూడా ఎదురు కాలేదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకున్నాయి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే ఈ (విచిత్రం) దౌర్భాగ్యం చోటుచేసుకున్నది . ఇందుకు కారణాలు లేకపోలేదు.
16 లోక సభ స్థానాల కోసం 25 స్థానాలను వదిలేసుకుని, రాష్ట్రాన్ని విభజించిన వారు…. అప్పటి వరకు రాష్ట్రానికి ఉన్న రాజధానిని తెలంగాణకు వదిలేశారు.; కానీ, కొత్తగా 13 జిల్లాలతో ఏర్పాటు చేసిన కొత్త రాష్ట్రానికి రాజధాని ఎక్కడ ఉండాలి అనే ఇంగీత జ్ఞానం వారికి లేకుండా పోవడం మొట్ట మొదటి కారణం. 2014 లో విభజిత ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ఎక్కడ అనేది నిర్ణయించాల్సిన బాధ్యత, సహజం గానే ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై పడింది.
రాజధాని ప్రాంతాన్ని నిర్ణయించే క్రమం లో… రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గా ఆయన, అప్పటి రాజకీయ పక్షాలైన బీజేపీ, జనసేన ( ఎన్నికల్లో పోటీ చేయక పోయినప్పటికీ, టీడీపీ కి మద్దతు ఇచ్చిందిగా ), సిపిఐ, సిపిఎం, వైస్సార్సీపీ పార్టీలతో అఖిల పక్ష సమావేశం లాటిది నిర్వహించి ; తన ఆలోచనలకు వారి ఆమోద ముద్ర వేయించుకుని ఉంటే ; తరువాత తలయెత్తిన పేచీలకు అంతగా ఆస్కారం ఉండి ఉండేది కాదు.
వైసీపీ సైతం…. 2014 ఎన్నికలలో ఓడిపోయి ఉండడం వల్ల..ముఖ్యమంత్రి ప్రతిపాదనలను కిక్కురుమనకుండా ఆమోదించి ఉండేది . అప్పటికి, ఆయన సామాజిక, ఆధ్యాత్మిక, రాజకీయ పిచ్చి కూడా ఇంకా మొగ్గ తొడగ లేదు. ఇవన్నీ పూత దశలోనే ఉన్నాయి.2019 లో జగన్మోహన్ రెడ్డి అధికారం లోకి వచ్చినప్పటికీ ; రాజధానిగా అమరావతి ఏర్పాటు ను బదనాం చేసే నైతిక స్థైర్యం ఆయనకు ఉండేది కాదు.
అందరూ ఊహించినట్టే 2019 లో అయన అధికారం లోకి వచ్చారు.
వచ్చిన నాటినుంచీ…. అమరావతి అనే భావన నిర్మూలనమే ఎజెండా గా ఆయన అధికారాన్ని వినియోగించారు.
ఆ ప్రయత్నాలను నిలువరించడానికి తమ ధన, మాన, ప్రాణాలను, గౌరవ మర్యాదలను ఫణం గా పెట్టడం అమరావతి ప్రాంత రైతుల ప్రధాన వ్యాపకం గా మారి పోయింది.
తమ అరాచకాలను ఒక్క అమరావతి ప్రాంతానికి మాత్రమే పరిమితం చేసుకుని, మిగిలిన రాష్ట్రం లో ఒక పధ్ధతిగా పాలన సాగించి ఉంటే, మొన్నటి ఎన్నికల్లో 11 కే జగన్మోహన్ రెడ్డి పరిమితమై ఉండేవారు కాదు. 151 స్థానాలతో, తిరుగులేని అధికారాలతో… యాబ్సొల్యూట్ పవర్ తో….ఊహలకు అందని రీతిలో విర్రవీగిన దుష్కీర్తిని అప్పుడు మూటగట్టుకున్న జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ” ప్రతిపక్ష హోదా అయినా ఇవ్వండి మొర్రో… ” అంటూ మొర పెట్టుకోవలసి వచ్చే పరిస్థితి ఎదురయ్యేది కాదు.
కానీ, వారి అరాచకాలకు బేంబేలెత్తి పోయిన జనం.. తెలుగు దేశం పార్టీ ఎక్కడా…. తెలుగు దేశం పార్టీ ఎక్కడా అంటూ కళ్ళల్లో వత్తులు వేసుకుని వెదుక్కోవలసిన పరిస్థితి వచ్చింది.
జగన్ బృందం పై కట్టలు తెగిన ఆగ్రహం తో, అసహనం తో, నిస్సహాయ స్థితిలో, దిక్కులేని స్థితిలో…. కూటమి మెడలో వరమాల వేసిన ఓటర్లు….. ” 2024 లో…హమ్మయ్య!” అనుకుంటూ సేద దీరారు. ఇది కూటమికి అనుకూల ఓటు గా ఎవరు భ్రమ పడినా ; తమను తాము మోసం చేసుకుంటున్నట్టే.
కాకపోతే, వైకాపాసురుల వ్యతిరేక ఓటు చీలిపోకుండా…. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు మూడూ చేతులు కలిపి…. ఓటర్లకు మహోపకారం చేశారు. కూటమి అధికారం చేపట్టింది.
దానితో, అమరావతి పై మళ్ళీ ఆశలు చిగురించాయి. ఇప్పుడైనా పూర్తి అవుతుందా అనే సందేహాలు సహజం. మామూలు గా అయితే, అమరావతి నిర్మాణం పూర్తి అవవచ్చు. గానీ, ప్రతిదీ వరల్డ్ క్లాస్ అనడం తోనే సందేహం కలుగుతోంది.
ఒక నగర నిర్మాణం పూర్తి కావడం – అనేది ఎప్పుడూ ఉండదు. ఎప్పటికప్పుడు, అప్పటి అవసరాలకు అనుగుణంగా విస్తరించుకుంటూ పోతుంది. 400 ఏళ్ళ క్రితం ప్రారంభం అయిన హైదరాబాద్ నగరం ఇప్పటికి పూర్తయిందా? పోనీ, బెజవాడ…. గుంటూరు పూర్తి అయ్యాయా? అందువల్ల, అమరావతి పూర్తి అవడం అనే ప్రశ్నే ఉండదు. అమరావతికి కేవలం ఆస్తిత్వం మాత్రమే కల్పించ గలుగుతారు. ప్రస్తుత్తానికి ఓ ముప్ఫయ్ గ్రామాలు. తరువాత, కాలానుగుణం గా మరి కొన్ని ప్రాంతాలు అమరావతిలో కలవ వచ్చు.
ప్రజల జీవన ప్రమాణాలు ఎలా ఉండాలి…. రాష్ట్రాన్ని అభ్యుదయ పథం లో ఎలా నడిపించాలి, ఏ ప్రాజెక్ట్ లు తీసుకు రావాలి…. ప్రజలకు ఈజ్ అఫ్ లివింగ్ కు ఏమి చేయాలి వంటి పాలనా అంశాలపై కాక ; రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉండాలి, అమరావతి అనే పేరు పెట్టుకున్న ప్రాంతం లో ఉండాలా… వద్దా అనే అంశమే రాజకీయ పార్టీలు, నాయకులు, ప్రజల -పదేళ్ల సమయాన్ని, మెదళ్ళను తినేసింది. ఇప్పుడు, చంద్రబాబు పుణ్యమా అని ఇది ఒక కొలిక్కి వచ్చినట్టు కనబడుతున్నది.. ‘అమరావతి’ పేరిట డెజీగ్నేట్ అయిన ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని అని కేంద్ర ప్రభుత్వపు- తెలుగు రాష్ట్రాల పునర్విభజన చట్టం లో -స్పష్టం గా పేర్కొన్నారు.
ఇలా…. ఫలానా రాష్ట్రానికి ఫలానా ప్రాంతం రాజధాని అని కేంద్రం ఒక చట్టం ద్వారా స్పష్టం చేయవలసి రావడం … దేశం లో ఇదే మొదటి సారి. మనం తెలుగు వారిమి కదా! ఎంత చిన్న సమస్య అయినా సరే…. చినిగి చాటంత అయ్యి, చివరకు చాపంత అయితే గానీ ఒక కొలిక్కి రాదు.
అమరావతి అసలు సమస్య, కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు మొదలైందని చెప్పవచ్చు.
శాసన సభ ఎన్నికలు మరో మూడేళ్ళ లోపుకు వచ్చేశాయి. ఆ ఎన్నికలలో విజయం సాధిస్తేనే….’అమరావతి ‘ అనే భావన సాకారం అవుతుంది. లేకపోతే లేదు. లేదు. లేదు.
అసలు ఆ భావననే జగన్ మోహన్ రెడ్డి భరించలేక పోతున్నారు. ఈ విషయం రహస్యమేమీ కాదు గదా! అందుకే, ” పిచ్చి కుదిరింది. రోకలి తలకు చుట్టండి… ” వంటి ప్రకటనలు ఆయన రోజుకొకటి చేస్తున్నారు.జనాన్ని గందరగోళం లోకి నెట్టడమే ఆయన లక్ష్యం.
ఆ పార్టీ శ్రేణులు – పైనుంచి కింది వరకు కూడా అదే బాణీ. యధాః జగన్…. తధాః వైసీపీ కదా!
అమరావతి అంటే…. జగన్ దృష్టిలో చంద్రబాబు నాయుడు.
జగన్ అనేముంది….; మొత్తం లోకం దృష్టి లోనే…. అమరావతి అంటే చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడికి జగన్ “పుట్టు వ్యతిరేకి “. అందువల్ల, గుడ్డి వ్యతిరేకికూడా. అటువంటి భావాలు కలిగిన వారిలో అత్యధికులు ఆయన చుట్టూ గుమిగూడారు.వారంతా వైసీపీ నేతలు.
అందువల్లే, అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ చిత్ర పటం లో కనపడకుండా చేయడానికి, చేయగలిగిన ప్రయత్నాలు అన్నీ చేశారు. చేస్తున్నారు.
కానీ, సఫలీకృతం కాలేక పోయారు. పోతున్నారు.
అమరావతి పై బురద జల్లుడు అనే బృహత్కార్యం లో ఇప్పుడు ఒక దశ ముగిసింది. రెండో దశ మొదలైంది.
ఇక, ఇప్పుడే అసలైన సమస్యలు కూటమికి ఎదురు కాబోతున్నాయి.
రానున్న మూడు సంవత్సరాలలో ఒక్క అమరావతి అనే కాకుండా, మొత్తం కూటమి పై వైసీపీయులు భారీ ఎత్తున (దుష్)ప్రచారం నిర్వహిస్తారు. అక్కడ జరిగే అవినీతి , దోపిడీ అంతా ఇంతా కాదంటూ …. పబ్లిక్ పెర్సెప్షన్ ను ప్రభావితం చేయడానికి ఏమి చేయవచ్చో…. అదంతా చేస్తారు.అందుకు కావలసిన సమస్త వరరులూ వైసీపీ కి ఉన్నాయి.
డబ్బు ఉంది. అది అందిపుచ్చుకుంటూ కూటమి ” నిర్వాకాలను” తూర్పారబట్టే ” మేధావులు” ఉన్నారు. స్వంత, అద్దె ప్రచార సాధనాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు వ్యతిరేకులు ఉన్నారు. స్వంత ఓటు బ్యాంకులు ఉన్నాయి. అల్లరి చేయడానికి పనికి వచ్చే కులాలు ఉన్నాయి.ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ప్రభుత్వ కీలక స్థానాల్లోనే ఉన్నారు. వీటికి తోడు, కూటమి ” అభివృద్ధి ” ఎజెండా నుంచి ప్రజల దృష్టిని ఎప్పటికప్పుడు మళ్ళించే సామర్ధ్యం గలిగిన జగన్ ప్రకటనలు ఎప్పటికప్పుడు సిద్ధం గా ఉంటాయి.
ఇప్పటికే, తనకు 40 శాతం ఓట్లు ఉన్నాయని జగన్ నమ్ముతున్నారు. మరో తొమ్మిది, పది శాతం లాక్కుంటే…. కూటమి పని ఫినిష్ అనేది వైసీపీయుల మనోభావన గా ఉన్నది.
‘అమరావతి’ నిర్మాణం అనేది వచ్చే మూడేళ్ళల్లో పూర్తి కాదు అనేది అందరికీ తెలిసిన విషయమే కదా!
ఎన్నికల నాటికి .. రాజకీయ సమీకరణలు ఎలా ఉంటాయో ఇప్పుడే ఎవరూ చెప్పలేరు. చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు ఉన్న రాజకీయ బలం,రాజకీయ అనుకూలతలు … వచ్చే ఎన్నికల తరువాత కూడా ఉంటే…. అమరావతి పనులు మరికొంత ముందుకు సాగుతాయి.
ఆ ” బలం” ఆయనకు లేకుండా చేయడానికి జగన్మోహన్ రెడ్డి భూమ్యాకాశాలను ఏకం చేస్తారనడం లో సందేహం లేదు. కేంద్ర బీజేపీ నేతల మనసులను విరిచేయడానికి చేయగలిగింది చేస్తారు. రాష్ట్రం లో అమరావతి వ్యతిరేక ప్రచారాన్ని వెయ్యేనుగుల బలం తో ఉవ్వెత్తున చేపడతారు. 2019 ఎన్నికలకు ముందు చిత్రీకరించినట్టుగానే….కమ్మ కులాన్ని మళ్ళీ పెద్ద బూచి గా…భూతద్దాల్లో చూపెడతారు. ఇప్పటికే, వైసీపీ మాజీ శకునిఇక్కడ…. ; టీడీపీ సృష్టించిన భూతం ఒకటి అక్కడ ఢిల్లీ లో….అమరావతి ని…. కమ్మరావతి గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ దుష్ప్రచారానికి విరుగుడు గా టీడీపీ గానీ, కూటమి గానీ ఏమీ చేయడం లేదు.
మరో వైపు చూస్తే ; టీడీపీ కి అనుకూలంగా…. సమాజాన్ని ఎంతో కొంత ప్రభావితం చేయగలవారిని దూరం చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు… ప్రత్యేకం గా మనసు పెట్టి, శ్రద్దగా ప్రయత్నిస్తున్నారనే భావన టీడీపీ శ్రేణులలో గట్టిగా వ్యక్తం అవుతున్నది.అటువంటి వారి వల్ల…. ఒక్క ఓటు పోయినా…. పోయినట్టే కదా!
మరో పక్క, కూటమి నేతలు, ప్రజా ప్రతినిధులలో అధికులు …. వైసీపీయులకు – సర్వ భ్రష్టత్వం లో అంగుళం కూడా తగ్గరు అనే భావన రోజు రోజుకూ రాష్ట్రం లో గట్టిగా వేళ్ళూనుకుంటున్నది.
“” జాగ్రత్తగా ఉండండి మొర్రో ” అంటూ చంద్రబాబు నాయుడు రోజూ నెత్తి, నోరు కొట్టుకుంటున్నా, పట్టించుకున్నవారు టీడీపీ లో,కూటమిలో కనపడడం లేదనే వ్యాఖ్యానాలు వినబడుతున్నాయి.
కూటమి ప్రభుత్వానికి అనేక అనుకూలతలు ఉన్నప్పటికీ ; వాటికి మించిన ప్రతికూలతలు…. జగన్ రూపం లో రాష్ట్రానికి, టీడీపీ కి పొంచి ఉన్నాయి.
వాటిని చట్ట పరంగాను నిలువరించవచ్చు, ప్రజా క్షేత్రం లోనూ నిలువరించవచ్చు. కానీ; కూటమి, దాని నేతృత్వం లోని ప్రభుత్వం…. ఈ రెండు పనులూ చేయడం లేదనే భావం టీడీపీ – కూటమి అనుకూల ప్రజల్లో బలం గా ఉంది.
ఎందుకని?
‘సమస్యలు’ అంటూ ఏమీ లేకపోతే…. వాటిని అధిగమించడం ఎలా…. వాటి నుంచి అవకాశాలను సృష్టించుకోవడం ఎలా అని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారేమో తెలియదు.
లేకపోతే ; “జనానికి ఇంకో రౌండు బుద్ధి రావాలిలే…” అనే భావన లో ఆయన ఉన్నారా అనేది కూడా తెలుగుదేశం శ్రేణులకు అర్ధం కావడం లేదు!
– భోగాది వేంకట రాయుడు