– ఆర్థిక సిరుల వాకిలి
– అమరావతిలో ఓ చరిత్రాత్మక ఘట్టం
కృష్ణవేణి ఒడ్డున అమరావతిలో అలిమేలుమంగాపతి వైభవానికి శ్రీకారం చుట్టారు. నేడు దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో వెంట ముంబై ఆర్థిక సంస్థలన్నీ నడిచి లక్ష్మిలా వచ్చి అమరావతిలో కొలువుదీరుతున్నాయి. ఆకాశం దించి, దాని అవతల తారాలోకాన్ని కూడా అమరావతి సిగలో నిలిపేలా.. ఆస్ట్రో ఫిజిక్స్ వారి ప్లానిటోరియంతో విజ్ఞానం పంచడానికి కూడా అంకురార్పణ జరిగింది. దేవతల రాజధాని అమరావతి మీద రాక్షసులు ఎన్నో దండయాత్రలు చేశారు. భువిలో మన అమరావతి మీద మన కళ్లముందే పొట్టమీద తన్ని, గుండెలు పగిలేలా విధ్వంసం చేసి, శ్మశానంగా మార్చి, ముళ్లపొదలతో కప్పేశారు. కేవలం ఐదేళ్లలో.
పట్టుదల గల ప్రభుత్వం వచ్చి పట్టుమని రెండేళ్లు నిండకముందే.. రెట్టించిన వేగంతో అమరావతి నిర్మాణం మొదలైంది. సిరుల వాకిలి తలుపులు తెరిచింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసి 15 ప్రధాన బ్యాంకులు, బీమా సంస్థల రాష్ట్ర ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన చేసిన శుభసమయం. ₹1,334 కోట్లతో (₹13.34 బిలియన్లు) సాకారం కానున్న ఈ అద్భుత ఆర్థిక జిల్లా (Financial District) నవ్యాంధ్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేసింది.
ముఖ్యంగా, వేలాది ఉద్యోగాలు యువతకు దక్కుతాయన్న మాట, గుండె నిండా ఆశను నింపింది. సాధారణంగా, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో బ్యాంకులు దశాబ్దాలుగా నగరం అంతటా చెల్లాచెదురుగా అద్దె భవనాలలో పనిచేస్తుంటాయి. కానీ, అమరావతిలో జరుగుతున్నది ఒక చరిత్రాత్మక ప్రణాళిక – అన్నింటినీ ఒకే చోట కేంద్రీకృతం చేయబడటం చరిత్రాత్మకం.
సిరుల వాకిలి అమరావతిలో కొలువుదీరిన సంస్థలు (శాశ్వత, సొంత ప్రాంగణాలు నిర్మించుకోనున్న 15 ప్రధాన సంస్థలు):
1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) – (₹300 కోట్లు)
2. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ – (₹256 కోట్లు)
3. ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (APCOB) – (₹200 కోట్లు)
4. నాబార్డ్ (NABARD) – (₹90 కోట్లు)
5. న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NIACL) – (₹93 కోట్లు)
6. బ్యాంక్ ఆఫ్ బరోడా – (₹60 కోట్లు)
7. కెనరా బ్యాంక్ – (₹50 కోట్లు)
8. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – (₹50 కోట్లు)
9. ఐడీబీఐ బ్యాంక్ – (₹50 కోట్లు)
10. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – (₹40 కోట్లు)
11. బ్యాంక్ ఆఫ్ ఇండియా – (₹40 కోట్లు)
12. ఇండియన్ బ్యాంక్ – (₹40 కోట్లు)
13. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) – (₹22 కోట్లు)
14. పంజాబ్ నేషనల్ బ్యాంక్ – (₹15 కోట్లు)
15. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ – (₹10 కోట్లు)
ఈ 15 సంస్థలతో పాటు, దేశ బ్యాంకింగ్ నియంత్రణకు గుండెకాయ లాంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రాంతీయ కార్యాలయం నిర్మాణానికి కూడా భూమి పూజ జరగడం, అమరావతికి అంతర్జాతీయ విశ్వసనీయతను తెచ్చిపెట్టింది. రాష్ట్రంలోని ప్రజలకు మెరుగైన బ్యాంకింగ్, బీమా సేవలను అందించడానికి, ₹16 లక్షల కోట్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిపాలనను పటిష్టం చేయడానికి ఉద్దేశించిన ఒక సమగ్ర ప్రాంతీయ ఆర్థిక పరిపాలనా కేంద్రం ఇది.
దేశంలోనే తొలిసారిగా, ఒక రాష్ట్ర రాజధానిలో అన్ని ప్రధాన బ్యాంకుల హెడ్‌క్వార్టర్స్‌ని ఒకేచోట, ఒకే ప్రణాళికతో, శాశ్వత ప్రాతిపదికన నిర్మించడం… భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఇది ఒక వినూత్న ప్రయోగం! ఇది ఆరంభం మాత్రమే! గత ఐదేళ్లుగా నిలిచిపోయిన రాజధాని నిర్మాణానికి, కేంద్ర ఆర్థిక మంత్రి స్థాయిలో శంకుస్థాపన జరగడం అంటే, అమరావతి ఇక ఆగదు అనే బలమైన సంకేతాన్ని పెట్టుబడిదారులకు పంపినట్టే. రాష్ట్ర ప్రజల ఆశలు, ఆత్మవిశ్వాసం ఈ సంస్థల వెనుక ఉన్నాయి. అమరావతి మయుడు నాయుడు “స్వర్ణాంధ్ర విజన్ 2047” సాకారం కావాలంటే, అమరావతి కేవలం పరిపాలనా కేంద్రంగా కాకుండా, శక్తివంతమైన ఆర్థిక ఇంజిన్‌గా మారాలి. ఈ ఆర్థిక సిరుల వాకిలి ఆ దిశగా వేసిన చారిత్రక అడుగు. అమరావతి ఇక ఆగదు!
– చాకిరేవు