– దేవతల రాజధానికి జయహో!
– జగన్ అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న చివరి “11 రోజుల” నుండి అమలులోకి!
– దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదేనేమో!
ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం మారబోతోంది. అస్పష్టతకు అంతం పలుకుతూ, ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక ‘అమరావతి’ ఇకపై చట్టబద్ధమైన రాజధానిగా ప్రపంచ పటంలో వెలగబోతోంది.
రాజకీయాల్లో కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అమరావతిని నిర్వీర్యం చేయాలని చూసిన శక్తులకు కాలమే సమాధానం చెప్పింది. మార్చి 28, 2026న ఉదయం సరిగ్గా 11:11 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రాజధాని తీర్మానం ప్రవేశపెట్టడం, కేవలం 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జగన్ మోహన్ రెడ్డి సభకు రావడానికే భయపడటం చూస్తుంటే.. ఇది ఖచ్చితంగా ఆ ‘దేవుడు రాసిన స్క్రిప్ట్’ లాగే అనిపిస్తోంది.
మరీ ముఖ్యంగా, ఈ సవరణ చట్టం జూన్ 2, 2024 నుండి అమలులోకి రానుంది. అంటే, జగన్ అపద్ధర్మ సిఎంగా ఉన్న చివరి “11 రోజులను” కలుపుకుంటూ అమరావతి అధికారిక రాజధానిగా చట్టబద్ధత సాధించింది. దేవతల రాజధాని అమరావతిపై రాక్షస దండయాత్రలు ఎన్ని జరిగినా, చివరకు ధర్మమే గెలిచింది. భువిలో కూడా ఈ పరిణామాలు నిజమే అని నిరూపిస్తున్నాయి.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా లోక్సభలో “ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2026” (బిల్లు నెం. 105) ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ఈ బిల్లు లోక్సభ బిజినెస్ జాబితాలో చేరింది. విభజన చట్టంలోని సెక్షన్ 5ను సవరించడం ద్వారా రాజధానిపై ఉన్న అన్ని న్యాయపరమైన సందిగ్ధతలకు కేంద్రం శాశ్వత పరిష్కారం చూపుతోంది.
బిల్లులోని కీలక సవరణలు:
పేరు మార్పు: సెక్షన్ 5(2)లోని “మరియు ఒక కొత్త రాజధాని ఉండాలి” అనే పదాల స్థానంలో, “అమరావతి కొత్త రాజధానిగా ఉండాలి” అని స్పష్టంగా చేరుస్తున్నారు.
అమలు తేదీ: ఈ చట్టం జూన్ 2, 2024 నుండి అమలులోకి వచ్చినట్లుగా పరిగణించబడుతుంది.
విస్తృత పరిధి: అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (APCRDA) చట్టం, 2014 కింద నోటిఫై చేయబడిన ప్రాంతమంతా ఇందులో భాగమే.
త్వరితగతిన ఆమోదం: రేపు లోక్సభలో, ఆ వెంటనే రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందేలా కేంద్రం చర్యలు చేపట్టింది.
రాజకీయ అనిశ్చితికి శుభం కార్డు!
2014 విభజన చట్టంలోని అస్పష్టతను వాడుకుని ‘మూడు రాజధానుల’ పేరుతో గత ప్రభుత్వం చేసిన ప్రయోగాలు ఏపీ అభివృద్ధిని కుంటుపరిచాయి. ఈ సవరణతో రాజధాని విషయంలో ఇక ఎలాంటి గందరగోళానికి తావులేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అమరావతిని నమ్ముకున్న వేలాది మంది రైతుల పోరాటానికి దక్కిన గౌరవం.
అమరావతి.. ఆంధ్రుల ఆత్మగౌరవ విజయం!
పార్లమెంటు సాక్షిగా అమరావతి పేరు మారుమోగడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. రాక్షస శక్తులు భువిలోని ఈ అమరావతికి ఎన్ని అడ్డంకులు సృష్టించినా, రాజకీయంగా అదే గతి పడుతుందని తాజా పరిణామాలు హెచ్చరిస్తున్నాయి. ఇక ప్రపంచ స్థాయి అమరావతి జైత్రయాత్రకు అడ్డులేదు.
