– ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని భావించలేదు
– కానీ ఇప్పుడేమో అర్ధం లేని విమర్శలు చేస్తున్నారు
– విశాఖపట్నంలోని వైయస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ ప్రెస్‌మీట్:
చరిత్రాత్మక రోజు:
ఈరోజు రాష్ట్ర చరిత్రలో చరిత్రాత్మక రోజు. నిన్నటి వరకు 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాలుగా మారింది. ప్రజలంతా సంతోషిస్తున్నారు. ఆయా ప్రాంతాల ప్రజల మనోభావాలను అనుగుణంగా, 2019 ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం సీఎం వైయస్ జగన్ కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. పాదయాత్రలో, ఎన్నికల ప్రచారసభల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ అందరి ఆకాంక్షలను ఆయన సాకారం చేశారు. దేశ స్వాతంత్య్రం తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కేవలం రెండు జిల్లాలు.. ప్రకాశం, విజయనగరం జిల్లాలు ఏర్పడ్డాయి. దాదాపు 40 ఏళ్ల తర్వాత మళ్లీ కొత్త జిల్లాలు వచ్చాయి.ఈ సందర్భం ఎందుకు వచ్చిందో అందరూ తెలుసుకోవాలి.
ఉదా:
ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 నియోజకవర్గాలు ఉండగా, కొత్తగా అనకాపల్లి, పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పాటైంది. గతంలో అక్కడి వారు విశాఖకు రావాలంటే బాగా ఇబ్బంది అయ్యేది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల వారు వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది.
దీంతో గ్రామీణ ప్రాంతంగా అనకాపల్లిని, ఏజెన్సీ ప్రాంతాలను మరో జిల్లాగా ఏర్పాటు చేయడం హర్షణీయం.
అదే విధంగా ఇవాళ ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు ఆరు జిల్లాలుగా మారాయి. అదే విధంగా అన్ని ప్రాంతాల్లో కూడా అక్కడి వారి మనోభావాలకు అనుగుణంగా కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. ఆ విధంగా రాష్ట్రంలో ఇప్పుడు మొత్తం జిల్లాల సంఖ్య 26కు చేరుకోగా, ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. సీఎంగారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.
వారికి మాత్రమే బాధ:
కానీ చంద్రబాబుగారు మాత్రం ఎంతో బాధ పడుతున్నారు. తాము« అధికారంలోకి రాగానే అన్నీ చక్కదిద్దుతామని చెబుతున్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఏనాడూ చంద్రబాబు కొత్త జిల్లాలపై ఆలోచించలేదు. కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించినా ఏనాడూ ఆ ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలని అనుకోలేదు. కొత్త జిల్లాలపై సీఎంగారు నిర్ణయం తీసుకోగానే కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయాలంటూ చంద్రబాబు లేఖ రాశారు. అన్ని ప్రాంతాల గురించి ఆలోచించే సీఎం వైయస్ జగన్, ఆయన విజ్ఞప్తిని కూడా పరిగణలోకి తీసుకుని కుప్పంను రెవెన్యూ డివిజన్‌గా చేశారు.
అదేనా చంద్రబాబు విజనరీ?:
మరి 14 ఏళ్లు రాష్ట్రాన్ని పరిపాలించానని, తానంతటి విజనరీ ఎవరికీ లేదని చెప్పుకునే చంద్రబాబుకు ఎందుకు ఈ ఆలోచన లేదు. అసెంబ్లీ నియోజకవర్గాలు 225కు పెంచండి. రాజధాని నిర్మాణం కోసం నాలుగు లక్షల కోట్లు ఇవ్వండి. అమరావతిలో నిర్మాణాల కోసం లక్ష పది వేల కోట్లు అవుతాయి. దానికి నిధులు ఇవ్వండి. ప్రత్యేక హోదా వద్దు. ప్యాకేజీ ఇవ్వండి. పోలవరం మేమే కడతామని.. చెప్పారు. అదేనా మీ విజనరీ.
ఎంతసేపూ స్వార్థం:
ఏరోజైనా ప్రజలకు పాలన చేరువ చేయాలని ఆలోచించారా? ఎంతసేపూ మీ స్వార్థం తప్ప. కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే, ప్రజలకు పరిపాలన మరింత అందుబాటులోకి వస్తుందని ఆలోచించలేదు. ఎప్పుడూ అవినీతి. రియల్‌ఎస్టేట్ వ్యాపారం. డబ్బు çసంపాదించడం తప్ప.
చివరకు కుప్పం గురించి కూడా మీరు ఆలోచించలేదు. మీరు అక్కడ రెవెన్యూ డివిజన్ కావాలంటారు. మీ బావమరిది హిందూపూర్‌ను జిల్లా కేంద్రం చేయాలంటారు.
నాడే ఎన్టీఆర్ పేరెందుకు పెట్టలేదు?:
నాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా చంద్రబాబు 9 ఏళ్లు సీఎంగా పని చేశారు. పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి, చంద్రబాబు సీఎం అయ్యారు. కొన్నాళ్లకే ఎన్టీఆర్‌గారు చనిపోయారు. కానీ ఏరోజు కూడా రాష్ట్రానికి ఎంతో మేలు చేసిన ఎన్టీఆర్ పేరును 23 జిల్లాలలో ఏదో ఒక జిల్లాకు పెట్టాలని చంద్రబాబు ఆలోచించ లేదు. రాష్ట్ర విభజన తర్వాత 13 జిల్లాలున్న ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీరామారావుగారి పేరు పెట్టాలన్న ఆలోచన చేయలేదు.
ఆ పనీ చేయలేదు!:
ఎన్టీఆర్ జయంతి, వర్థంతి లేదా మహానాడు జరిగినప్పుడు మాత్రమే ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. 1999 నుంచి 2004 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పానని చెబుతారు. అప్పటి ఎన్డీఏ ప్రభుత్వ కన్వీనర్‌గా కూడా ఉన్నారు. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి తాను వెన్నెముక అని చెప్పుకునే చంద్రబాబుగారు, అప్పుడు ఎన్టీరామారావుకు భారతరత్న ఇవ్వాలని కోరలేదు. నిజం చెప్పాలంటే ఎన్టీరామారావుకు ఎలాంటి గౌరవం ఇవ్వడం ఇష్టం లేదు. అందుకే ఈ డ్రామాలు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటున్న సీఎం శ్రీ వైయస్ జగన్, కృష్ణా జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాకు ఎన్టీ రామారావు పేరు పెట్టారు.
ఆ పార్టీలూ అదే బాటలో..:
ఇవాళ వామపక్షాలు కూడా తమ వైఖరి మార్చుకున్నాయి. సీపీఐ రామకృష్ణ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, తమను ప్రభుత్వం ఏ విషయంలోనూ సంప్రదించడం లేదని అంటున్నారు. మరి ఆరోజు అమరావతిలో రాజధాని పెడుతున్నట్లు చంద్రబాబు చెప్పారా?. నిజానికి సీపీఐ.. చంద్రబాబు పార్టీ ఆఫ్ ఇండియాగా మారిపోయింది. ఒక పెట్టుబడి పార్టీగా మారిపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఉద్యమాలు జరుగుతుంటే సమర్థిస్తున్నారు.
కానీ ప్రజల కోసం, అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటే, దాన్ని కూడా తప్పు పట్టడం దురదృష్టకరం.
రబ్బర్‌సింగ్:
ఇక చంద్రబాబుతో సహజీవనం చేస్తున్న ఒక పార్టీ ఉంది. ఆ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ కూడా మాట్లాడుతున్నారు. జిల్లాల ఏర్పాటు సహేతుకంగా లేదని ఆయన లేఖ రాశారు. చంద్రబాబుకు రబ్బర్ స్టాంప్‌గా మారిన పవన్ కళ్యాణ్, ఆయన పంపిన లేఖ మీద సంతకం పెట్టి రిలీజ్ చేశారు. ఆయన గబ్బర్‌సింగ్ అనుకున్నాం. కానీ రబ్బర్‌సింగ్‌గా మారిపోయారు.
సిద్ధాంతం లేదు:
2024 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తారా. ఆ ధైర్యం ఉందా. ఉంటే ఆ విషయం స్పష్టంగా చెప్పండి. మీకు ఒక సిద్దాంతం లేదు. మీ పార్టీకి ఒక సిద్ధాంతం లేదు. మీకు ఒక ఆలోచన లేదు. రోడ్ మ్యాప్ లేదు. బీజేపీ ఏం చెబితే అది చేస్తాం. లేదా చంద్రబాబు చెవిలో ఏది చెబితే అది చేస్తాం. ఆయన లేఖ పంపిస్తే సంతకం పెట్టి రిలీజ్ చేస్తాం.. అన్నట్లుగా ఉన్న ఒక పార్టీ రాష్ట్రంలో ఉండడం బా«ధాకరం. చరిత్రాత్మక నిర్ణయాలను కూడా తప్పు పట్టడం కూడా బాధాకరం.
ఒక పార్టీ అధ్యక్షుడు రెండు చోట్లా ఓడిపోయినా, ఆయనలో మార్పు రాలేదు. ప్రజల ముందుకు వచ్చి, ఇదీ తన సిద్ధాంతం, ఇదీ తన ఆలోచన అని కూడా చెప్పుకోలేదు. చివరకు తన పార్టీని ముందుకు తీసుకుపోయే రోడ్ మ్యాప్ కూడా లేదు.
ఎందరికో ఆదర్శంగా నిల్చాం:
దేశంలో అనేక రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలబడింది. గ్రామ, వార్డు సచివాలయాలు. వలంటీర్ల వ్యవస్థ. ఇవన్నీ ఇతర రాష్ట్రాలకు కేస్ స్టడీగా మారాయి. ఇక్కడి పథకాలపైనా వేరే రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయి. వలంటీర్లు ప్రతి నెల ఒకటో తేదీని ఇంటింటికి వెళ్లి, పెన్షన్ ఇస్తున్నారు.
ఇదీ చిత్తశుద్ధి:
ప్రజలకు మంచి చేయాలంటే 40 ఏళ్ల విజనరీ అవసరం లేదు. అంత అనుభవం రాజకీయాల్లో ఉందని చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు.
ప్రజలకు మంచి చేయాలన్న తపన, పేదల బతుకులు మార్చాలన్న చిత్తశుద్ధి, ప్రజల మనోభావాలు, అభీష్టం మేరకు పని చేస్తే చాలు. సీఎం చేస్తోంది అదే. ఇవాళ ఆయన గొప్ప చేసిన చరిత్రాత్మక నిర్ణయం, గొప్ప నిర్ణయం. పరిపాలనా వికేంద్రీకరణ. దీని ద్వారా ప్రజలకు మరింత చేరువగా పాలన. అధికారులు మరింతగా ప్రజలకు అందుబాటులో ఉంటారు.
అదే మా లక్ష్యం:
అన్ని ప్రాంతాల అభివృద్ది. పరిపాలనా వికేంద్రీకరణపై ఇటీవలే సభలో సీఎంగారు చెప్పారు. మాకు అమరావతిపై కోపం లేదు. అందరి సంక్షేమం, అన్ని ప్రాంతాల అభివృద్ది మా ప్రభుత్వ లక్ష్యం. దానికే కట్టుబడి ఉన్నాం. ఇప్పటి వరకు అన్ని ఎన్నికల్లో మేము ఒంటరిగానే పోటీ చేశాం. మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చాం.
విమర్శించే హక్కుందా?:
ప్రభుత్వాన్ని విమర్శించే ముందు, అసలు ఆ పార్టీకి కనీసం వి«ధానపరమైన ఆలోచన అయినా ఉండాలి కదా? పవన్‌కళ్యాణ్‌కు కానీ, ఆ పార్టీకి కానా కనీసం అవైనా ఉన్నాయా?
ఇక మా పార్టీ అధికారంలోకి వచ్చాక, విశాఖలో వందల కోట్లు విలువ చేసే, అన్యాక్రాంతమైన 400 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. అలాగే ఎవరికీ ఒక్క సెంటు భూమి కూడా ఊర్కెనే ధారాదత్తం చేయదు. అది మా ప్రభుత్వ విధానం. సింగపూర్ కంపెనీతో సంబంధాలు కలిగి ఉన్నది చంద్రబాబుకు మాత్రమే.. అని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ స్పష్టం చేశారు.