Suryaa.co.in

Andhra Pradesh

లంచాలు మెక్కి కంచాలు కొడతారా..?

– బకాసురిడి బామ్మర్దులంతా శ్రీకృష్ణుడి వేషం వేస్తారా..?
– సిగ్గు పడాల్సిన వాళ్ళంతా సింగారం చేసుకుని బయటకు వస్తారా..?
– తెలుగుదేశం పార్టీ వారు రేపు రాత్రి మోత మోగిస్తారట
– 2014 నుంచి 2019 వరకు 5 ఏళ్ళు మోగించిన అవినీతి మోత కారణంగానే చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు ఇంట్లో ఈగల మోత- జైల్లో దోమల మోత.. అన్నట్టుగా పరిస్థితి తయారైంది
– రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు

చంద్రబాబు నాయుడ్ని అరెస్టు చేసింది- రాష్ట్ర సీఐడీ అన్నది ఎంత నిజమో, ఆ సీఐడీ అరెస్టును, రిమాండ్ ను క్వాష్ చేయటానికి సీఐడీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు.. ఈ మూడు కూడా తిరస్కరించటం వల్లే చంద్రబాబు ఈరోజు రిమాండ్ లో ఖైదీగా ఉన్నారని దేశమంతటికీ తెలుసు.మరి, కంచాలు ఎవరి మీద మోగిస్తున్నారు.. విజిళ్ళు ఎవరి మీద ఊదుతారు..? హారన్లు ఎవరిని ఉద్దేశించి కొడతారు..?

స్కిల్ డెవలప్ మెంటు స్కాములో బాబు చేసిన పని, నిరుద్యోగుల కంచంలో పెట్టాల్సిన అన్నాన్ని తాను తినేయటం.. ఇలా అడ్డంగా తినేసినందుకు గుర్తుగా.. జన్మభూమి కమిటీలు మొదలు రాజధాని కుంభకోణాలు వరకు, ప్రతి ఒక్క విషయంలో 5 ఏళ్ళు అడ్డంగా తినేసిన బకాసురులంతా కలసి రేపు కంచాలు బయటకు తీసుకొచ్చి మోగిస్తారా..?

పేద కులాలకి, పేద వర్గాలకి జగన్ గారి నాలుగేళ్ళ పాలనలోనే డీబీటీ ద్వారా బటన్ నొక్కి, వారి బ్యాంకు అకౌంట్ కు రూ. 2.35 లక్షల కోట్లు అందిస్తే… అదే స్థాయిలో బడ్జెట్, నిధులు ఉన్నా, ఆ సొమ్మంతా టీడీపీ హయాంలో ఐదేళ్ళపాటు పేదలకు అందించకుండా ఉఫ్ అని ఊదేసినందుకు గుర్తుగా టీడీపీ వారంతా వచ్చి విజిళ్ళు ఊదుతారా..? అలాగే, అవినీతి చేసి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చి, బస్సులో పడుకున్నానని ఆడిన డ్రామాలకు గుర్తుగా హారన్లు మోగిస్తారా..?

ఏ మొహం పెట్టుకుని చట్టబద్ధ అరెస్టును అపహాస్యం చేస్తారు..?ఇదంతా వారు న్యాయ వ్యవస్థలు మేనేజ్ చేయలేనందుకు ఏడుస్తున్న ఏడుపే కదా..?అవినీతి అనేది అక్రమం.. అరెస్టు అనేది సక్రమం.. మరి అలాంటప్పుడు అవినీతి సక్రమం అని- అరెస్టు అక్రమం అనే వాళ్ళను ఏమనాలి..? రాజ్యాంగం మీద, చట్టం మీద నమ్మకం లేని యాంటీ సోషల్ ఎలిమెంట్లు అని అనాలా..?

చంద్రబాబు అవినీతిని, ఇదే స్కిల్ స్కాములో కేంద్ర ప్రభుత్వ ఎన్ ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ కూడా నిర్థారించి నలుగుర్ని అరెస్టు చేసింది. కాబట్టి, రెండు వారాలుగా ఢిల్లీలో దాక్కున్న లోకేష్- ఆ ఈడీ ఆఫీసు ఎదురుగ్గా నిలబడి, ఇది అక్రమం అని కంచాలు కొడితే బాగుంటుంది.

రాష్ట్రపతి, అమిత్ షా, మోడీ కార్యాలయాల ముందు నిలబడి, తమ ఎంపీలు, పురంధేశ్వరి, సీపీఐ నారాయణ, రామకృష్ణ, రేవంత్ రెడ్డి, సుజనా చౌదరి, సీఎం రమేష్, సత్యకుమార్, రేణుకా చౌదరి, కూనంనేని సాంబశివరావు, బీవీ రాఘవులు, జయ ప్రకాష్ నారాయణ.. వీళ్ళందర్నీ ఢిల్లీలో నిలబెట్టుకుని ఈడీ అరెస్టు అక్రమమని, స్కిల్ స్కామే లేదని ఢిల్లీలో కంచాలు కొడితే బాగుంటుంది. విజిల్స్ ఊదితే ఇంకా బాగుంటుంది. హారన్లు కొడితే మరింత బాగుంటుంది.

అలాగే, భారత ప్రభుత్వ ఐటీ శాఖ రూ. 119 కోట్ల చంద్రబాబు అవినీతిని నిర్థారించి, ఇప్పటికే మూడేళ్ళుగా దర్యాప్తు జరిపి, అనేక ఉత్తర ప్రత్యుత్తరాలు తర్వాత ఇదంతా అవినీతి సొమ్మే అని షోకాజ్ నోటీసు ఇచ్చింది. కాబట్టి, కేంద్ర ఆర్థిక మంత్రి ఇంటి ముందు, ప్రధానమంత్రి ఇంటి ముందు, ఢిల్లీలోని ఐటీ శాఖ ప్రధాన కార్యాలయం ముందు పైన పేర్కొన్న జాబితాలోని వారంతా కంచాలు, గిన్నెలు, తపాలాలు, గరెటలు, గ్లాసులు .. అన్నీ తీసుకువెళ్ళి కొడితే బాగుంటుంది.

వీలుంటే నల్ల చొక్కాల ప్రదర్శన చేసి, వాట్ ఐ యామ్ సేయింగ్.. అంటూ గతంలో కొట్టిన డైలాగుల్ని రిపీట్ చేస్తే బాగుంటుంది. అవినీతి చేసి కంచాలు కొడతారా..? తినేది లంచాలు.. మోగించేది కంచాలా..? మీ మీడియా బ్యారెన్లు మోగిస్తున్న అబద్ధాల హారన్లకు తోడు కారు హారన్లు మోగిస్తారా..? విజిళ్ళు ఊదుతారా..?

సిగ్గు పడాల్సిన చోట, తల దించుకోవాల్సిన చోట కూడా తల ఎగరేస్తున్నారు.. మీ అహంకారాన్ని మాత్రం ప్రజలు మరింతగా అణచాల్సిన అవసరం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం.

LEAVE A RESPONSE