Suryaa.co.in

Andhra Pradesh

జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అంబటి రాంబాబు

– ప్రాజక్టులను అన్నింటినీ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి రైతులకు నీరు అందజేస్తాం

అమరావతి, ఏఫ్రిల్ 21 : రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా అంబటి రాంబాబు గురువారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ లో కేటాయించిన ఛాంబరుకు విచ్చేసిన ఆయనకు వేద పండితులు వేద మంత్రాలు పటిస్తూ పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఛాంబరులో పండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా పూజనిర్వహించిన తదుపరి మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. తదనంతరం జలవనరుల శాఖ అధికారులు, పలువురు అనధికారులు మంత్రికి పుష్పగుచ్చాలు అందజేస్తూ అభినందనలు తెలిపారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తనకు ఎంతో కీలకమైన జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించినందుకు హృదయ పూర్వక ధన్యవాదములు తెలిపారు. దివంతగ ముఖ్యమంత్రి డా.వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన జలయజ్ఞం కార్యక్రమాన్ని పూర్తిచేసే క్రమంలో నావంతు బాధ్యతలను నిర్వహించడానికి అవకాశం కలిగినందుకు ఎంతగానో సంతోషిస్తున్నానన్నారు. రాష్ట్రంలోని అన్ని జల వనరుల ప్రాజక్టులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందించాలనే దృక్పధంతో ముందుకు వెళుతున్నటు వంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కి అన్ని విధాలుగా సహకరిస్తూ వారి లక్ష్యసాధనకు శక్తివంచన లేకుండా చిత్తశుద్దితో కృషిచేస్తానని ఆయన అన్నారు.

నూతనంగా బాధ్యతలను చేపట్టిన సందర్బంగా రెండు ఫైళ్లపై సంతకాలు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. గత ఆర్థిక సంవత్సరానికి మరియు అంతకు ముందున్న పెండింగ్ పనులకు సంబందించి గండికోట – పైడిపల్లి ఎత్తిపోతల పథకానికి ఆపరేషన్ అండ్ మెయింటినెన్సు గ్రాంటుగా రూ.4.70 కోట్లకు పరిపాలనా అనుమతులను మంజూరు చేస్తూ తొలి సంతకం చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. గతంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మడ్డువలస ప్రాజక్టు ఫేజ్-2 కెనాల్ కు సంబందించి 5 కి.మి.మేర కాలువ త్రవ్వడానికి రూ.26 కోట్ల 9 లక్షల గ్రాంట్ను మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి ఆమోదం కొరకు పంపించే పైల్ పై మరో సంతకం చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.

పోలవరం ప్రాజక్టుకు సంబందించి పాత్రికేయుల అడిగిన ప్రశ్నకు మంత్రి సమాదానం చెపుతూ పోలవరం అనేది ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుఅని, అది రాష్ట్రానికి జీవనాడి వంటిదన్నారు. ఈ ప్రాజక్టువల్ల రాష్ట్రంలోని రైతులు అందరికీ ఎంతో మేలు జరుగడమే కాకుండా ప్రత్యక్షంగా ఏడు రాష్ట్రాలకు కూడా లబ్దిచేకూరుతుందన్నారు. అటు వంటి ప్రాజక్టును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలనే తపన తమ ప్రభుత్వానికి ఉందన్నారు. అయితే ఎన్నో అడ్డంకులు ఉన్నాయని, వాటన్నింటినీ అదిగమించి ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషిచేస్తున్నదన్నారు.

ఈ మద్య కాలంలో పలు వార్తాపత్రికల్లో పోలవరం ప్రాజక్టుపై పలు కథనాలు ప్రచురితమవుతున్నాయని, ప్రాజక్టును అద్యయనం చేసేందుకు మరియు రి-డిజైన్ చేసేందుకు దేశంలోనే అత్యంత అనుభవం ఉన్నవారు మరియు ఐ.ఐ.టి. చైన్నై, డిల్లీ నుండి నిపుణుల బృందాలు వస్తున్నాయంటూ ఆ వార్తాంశాలు ప్రచురితమవుతున్నాయన్నారు. అయితే ప్రాజక్టు విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలవల్లే ఈ నిపుణుల బృందాలు రావడానికి ప్రదానమైన కారణమన్నారు. ప్రపంచంలో ఎక్కడా డయాప్రం వాల్ దెబ్బతిన్న పరిస్థితులే లేవని, కాని పోలవరం విషయంలో అదిజరిగిందన్నారు.

స్పిల్ వే పూర్తికాకుండానే త్వరత్వరగా కాపర్ డాం కట్టేసి, డయాప్రం వాల్ నిర్మించేసి బిల్లులు చేసుకుందామనే తాపత్రయంతోనే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. ఈ డయాప్రం వాల్ నిర్మాణానికి రూ.430 కోట్లు వెచ్చించి బిల్లులు కూడా చేసుకోవడం జరిగిందన్నారు. దెబ్బతిన్న డయాప్రం వాల్ కు ముందు ఉన్న గోదావరి నదిలో పెద్ద పెద్ద సుడిగుండాలు పడిపోవడం జరిగిందన్నారు. వాటిని పూడ్చాలన్నా, వాటిలో నుండి నీటిని తోడాలన్నా రూ.2,001 కోట్లు ఖర్చు అవుతుందని నిపుణులు అంచనా వేశారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే కోట్లాది రూపాయల నష్టమే కాకుండా కాలంకూడా వృద్దా అవుతున్నదనే ఆవేదనను మంత్రి వ్యక్తంచేశారు. అయితే వరద వల్ల దెబ్బతిన్న ఈ డయాప్రం వాల్ ను ఉపయోగించడానికి అవకాశం ఉందా? లేదా? అనే విషయాన్ని నిర్థారించడానికి మరియు ఈ ప్రాజక్టు నిర్మాణ విషయంలో తలెత్తిన పలు సమస్యల పరిష్కారానికి ఈ నిపుణుల బృందాలు వస్తున్నాయని మంత్రి స్పష్టంచేశారు. సాద్యమైనంత త్వరగా ఈ సమస్యలను అన్నింటినీ అదిగమించి పోలవరం ప్రాజెక్టును ఒక కొలిక్కి తేవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతుదని మంత్రి తెలిపారు.

LEAVE A RESPONSE