Suryaa.co.in

Andhra Pradesh

సైకిల్ తొక్కేది పవన్.. ఎక్కేది బాబు..!

– పవన్ కల్యాణ్ వ్యూహాలన్నీ సైకిల్ దారే
– ఎంతమంది కట్టకట్టుకుని వచ్చినా.. 2024లో ఫ్యాన్ జెండానే రెపరెపలాడుతుంది
– చంద్రబాబు పల్లకి మోయటానికి జనసైనికులు కష్టపడాలా పవన్ కల్యాణ్..!?
– రైతులకు సినిమాల్లో వచ్చిన డబ్బులు ఇస్తున్నాడో లేక ఎన్టీఆర్ ట్రస్టు డబ్బులు ఇస్తున్నాడో తేలాలి
– టీడీపీ హయాంలో రైతులను పచ్చి దగా చేసింది చంద్రబాబు, పవన్ లు కాదా..?
– మీ పాపాల పరిహారం కోసం రైతు భరోసా యాత్ర చేస్తారా..?
– మీది రైతు భరోసా యాత్రా లేక చంద్రబాబు భరోసా యాత్రా..?
– కౌలు రైతులను గుర్తించిందీ, రైతులకు మేలు చేస్తున్న రైతు పక్షపాతి ప్రభుత్వం ఇది
– రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబు, పవన్ కు లేదు
– జనసేనలో చంద్రబాబు పెట్టిన కాపలాదారుడు నాదెండ్ల మనోహర్
– అర్హులైన ప్రతి ఒక్కరికీ వారి గడప వద్దకే సంక్షేమం.. ఏ పార్టీతోనైనా చర్చకు సిద్ధం
– వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు

అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
రైతులను పచ్చిదగా, మోసం చేసింది బాబు, పవన్ లు కాదా..?
రైతులకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్న పవన్ కల్యాణ్ ఒక్క విషయం గుర్తు చేసుకోవాలి. 2014లో టీడీపీతో కలిసి పనిచేసింది పవన్ కల్యాణే. ఆ అయిదేళ్ల పాటు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. రైతుల పట్ల ఆ ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఎలా ఉంది? రైతుల కష్టాలకు, ఆత్మహత్యలకు బాధ్యులు ఎవరు అనేది పవన్‌ కల్యాణ్‌, జనసేన పార్టీ మర్చిపోయినట్లు ఉంది.

2014కు ముందు ఉమ్మడిగా మీరు ఎన్నికలకు వెళ్లినప్పుడు… తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే.. రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ప్రతిజ్ఞ చేశారు. రూ.87వేల 612 కోట్ల రైతులకు రుణమాఫిని చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చారు, మరి ఏం చేశారు? రద్దు చేశారా?

రైతుల రుణాలల్లో కోతలు వేసేందుకు కోటయ్య కమిటీని వేసి తమ్మిని బమ్మిని చేసి స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ అని… ఇన్‌స్టాల్‌మెంట్ల బేసిస్‌ మీద రుణమాఫీ చేస్తామని, 87,612 కోట్ల రూపాయిల రుణాలకు గానూ 25వేల కోట్లు మాత్రమే ఇవ్వగలమని చావు కబురు చల్లగా కోటయ్యగారి కమిటీతో చెప్పారు. అక్కడే రైతుల నడ్డి విరిగిపోయింది. 24వేల కోట్లు ఇచ్చారా? అదీ ఇవ్వలేదు, ఆఖరికి రూ. 15వేల కోట్లు ఇచ్చి సర్దుకున్నారు. ఆ అయిదేళ్లలో రైతుల పరిస్థితి దిగజారడానికి కారణం మీరు కాదా.. ?.

మీ మాటలు నమ్మి బ్యాంకుల్లో కుదవ పెట్టిన బంగారం ఇంటికి వస్తుందని రైతులు ఆశపడ్డారే. తాము చేసిన రుణమంతా అణాపైసలతో సహా మాఫీ అయిపోతుందని రైతులు కలలు కన్నారు, మీకు ఓటు వేశారు. మరి అధికారంలోకి వచ్చాక రైతులను పచ్చి దగా, మోసం చేసింది టీడీపీ, పవన్‌ కల్యాణ్‌లు కాదా?. అప్పుడు అధికారంలో ఉంది- మీరు మద్దతు ఇచ్చిన చంద్రబాబు నాయుడు కాదా? ఆరోజు రైతులు గుర్తురాలేదే? ఆరోజు రైతు భరోసా యాత్ర చేయాలని పవన్‌కు అనిపించలేదా?

ఏ రైతు కుటుంబం అయినా, ఒక్కసారిగా అప్పులు పాలైపోరు. కాలానుగుణంగా అప్పులపాలు అవుతారు. ఇవాళ ఎక్కడైనా ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే.. దీనికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులను నట్టేట ముంచడం వల్లనే. వారి అప్పులు తీర్చకపోవడం వల్లే వాళ్లు నష్టపోయారు. రైతుల ఆశని అడియాశలు చేసారు. అందువల్లే అక్కడక్కడ రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి.

మీ పాప పరిహారం కోసం రైతు భరోసా యాత్రలా..?
ఆరోజున పవన్‌ కల్యాణ్‌కు రైతులు గుర్తుకురాలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండటం వల్ల గుర్తుకు రాలేదా…? ఇవాళ మాత్రమే ఆయనకు రైతులు గుర్తుకు రావడం సంతోషం. మా ప్రభుత్వం నిజమైన రైతు ప్రభుత్వం. మేము అధికారంలోకి రాగానే రైతు భరోసా ఇస్తున్నాం. ఎన్నికల సమయంలో మీరేమి చెప్పారు? మేమేమి చెప్పాం. మీరు రుణమాఫీ అని ఎగ్గొట్టారు.

మేం ప్రతి ఏడాది రూ.12500 చొప్పున నాలుగేళ్లపాటు ఇస్తామని హామీ ఇచ్చి, ఇవాళ రైతు భరోసా కింద రూ.13500 చొప్పున అయిదేళ్లలో అయిదుసార్లు అంటే మొత్తం రూ.67వేలు ఇస్తున్నాం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే కాదు… ఇచ్చిన మాటకన్నా ఎక్కువగా రైతులకు ఇవ్వాలనే చిత్తశుద్ధి, అంకితభావంతో పనిచేస్తున్న ప్రభుత్వం జగన్‌ మోహన్‌ రెడ్డిగారి ప్రభుత్వం అని స్పష్టంగా చెప్పగలం. 55.5 లక్షలమందికి రైతు భరోసా ఇస్తున్నాం. టీడీపీ, జనసేన, కమ్యూనిస్టులు, బీజేపీకి చెందిన రైతులకు కూడా ఇస్తున్నాం. కుల,మతాలు, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్క రైతుకూ ఇస్తున్నాం.

మరి, మీరేం చేశారు… మీ పార్టీకి చెందిన రైతులకు, మీ వాళ్లకు మాత్రమే మీ హయాంలో రూ.15వేల కోట్ల రుణమాఫీ చేశారు. అలాంటి మీరు ఇవాళ జగన్‌ మోహన్‌ రెడ్డి గురించి, జగన్‌ ప్రభుత్వం గురించి, రైతు విధానం గురించి మాట్లాడుతున్నారు. ఎస్‌.. మంచిదే మాట్లాడండి.

మీరంటున్న రైతు భరోసా యాత్ర… మీరు చేసిన పాపాలకు పరిష్కారం కోసం చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎన్టీఆర్‌ గారిని చంపి … ఆయన విగ్రహానికి దండ వేసినట్లుగా రైతులను మోసం చేసి, అన్యాయం చేసి … వారి ఆత్మహత్యలకు కారణం అయిన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ప్రభుత్వం చేసిన పాపాలకు మరణించిన వారికి దండలేసి వారికి పరిహారం ఇస్తున్నారేమో. కౌలు రైతుల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కు ఉందా?

మొట్టమొదటిసారిగా కౌలు రైతులను గుర్తించిన ప్రభుత్వం మాది. జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన కౌలుదారులకు గుర్తింపు కార్డులు ఇస్తూ వారికి రైతు భరోసా, లోన్లు ఇస్తున్న ప్రభుత్వం. పవన్‌కు అర్థం అవుతుందా? అర్థం కావడం లేదా? అనేది గమనించుకుంటే మంచిది. మాది రైతు ప్రభుత్వం. మీది రైతు వ్యతిరేక ప్రభుత్వం. పవన్‌కు గాని, చంద్రబాబు నాయుడుకు కానీ రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. మీరు రైతు భరోసా యాత్ర చేస్తారో… చంద్రబాబు భరోసా యాత్ర చేస్తారో అది మీ ఇష్టం. చంద్రబాబును అధికారంలోకి తీసుకువెళ్లేందుకు పల్లకిని మోస్తారనేది కూడా మీ ఇష్టం. అంతేకాని రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎవరికైనా ఈ రాష్ట్రంలో ఉందంటే అది జగన్‌ మోహన్‌ రెడ్డికి, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి తప్ప మరెవరికీ లేదని స్పష్టం చేస్తున్నాం.

పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన పవన్ చూసి మేం భయపడాలా..?
మరోవైపు పవన్‌ కల్యాణ్‌ రాజకీయ ఉపన్యాసం చేస్తూ.. చాలా కామెడీగా మాట్లాడారు. నాకు నిజంగా నవ్వు వచ్చింది. పార్టీ ఆవిర్భావ దినోత్సం రోజున పవన్‌ ఒకమాట చెప్పాడు. వైయస్సార్‌ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేక ఓటును చీలకుండా కాపలా కాస్తానని అన్నాడు. ఆయన ప్రకటనను చూసి మాకు భయమేస్తుందట. మేము భయపడిపోతున్నామట. పవన్‌ను, చంద్రబాబును చూసి భయపడాల్సిన పని మాకేంటి? నువ్వు రాజకీయ పార్టీ పెట్టావు. అధికారంలోకి రాలేదు సరే. సీట్లు ఎన్నివచ్చాయి? ఒకటి వచ్చింది. నీవు పోటీచేసిన చోట్లల్లో ఒకచోట కాదు… రెండుచోట్లా ఓడిపోయావు. అలాంటి నిన్ను చూసి మేము భయపడాలా?

అందరూ కట్టకట్టుకుని వచ్చినా భయపడం
– ఒంటిచేతితో 151 సీట్లు గెలుచుకున్న ప్రభుత్వం మాది. జగన్‌ మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ముందుకు వెళుతున్నటువంటి సమయంలో నిన్ను చూసి భయపడాల్సిందేముంది. పవన్ ఒక్కడే కాదు, చంద్రబాబు, కమ్యూనిస్ట్‌ పార్టీలు, చివరకు బీజేపీ … అన్ని పార్టీలు కట్టకట్టుకుని వచ్చినా.. మేం భయపడే ప్రశ్నే లేదు. భయపడాల్సిన అవసరమే లేదు. ఈ విషయాన్ని మీరు మిస్‌ అవుతున్నట్లు ఉన్నారు. దాన్ని మీరు గుర్తు పెట్టుకుంటే మంచిది.

పవన్ కల్యాణ్ నిన్న మాట్లాడుతూ.. మీ పార్టీ నాయకుల్లో కూడా భిన్నాభిప్రాయాలు ఉ‍న్నాయన్నావు. వాళ్లకు నువ్వు టీడీపీతో కలవడం ఇష్టం లేదేమో. ఆ విషయం వాళ్లతో చెప్పుకో. నీ పార్టీని తీసుకువెళ్లి టీడీపీకి లంకె వేస్తావనే నీ పార్టీ నాయకులు, క్యాడర్‌ భయపడుతున్నారన్నది నీవు గమనించాలి, ఇప్పటికైనా మీ క్యాడర్ ఏమనుకుంటున్నారో అర్ధం చేసుకో పవన్ కల్యాణ్. చివరకు నీ క్యాడర్‌ను చూసి నువ్వు భయపడాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో నీకు రాబోతోంది.

ఎందుకంటే మీ పార్టీ ఆవిర్భావం ఏంటి? మీ పార్టీ ఎలా ఆవిర్భవించింది. ప్రజల పల్లకి మోయడానికి కాదు, ఎవరి పార్టీ పల్లకి మోయడానికి జనసేన ఆవిర్భవించింది. పాపం ఇదే విషయం నేనంటే జనసేన నాయకులకు బాధేస్తుంది. 2014లో ఆవిర్భవించిన మీ పార్టీ నడక ఏంటయ్యా? అప్పుడు చంద్రబాబుతో కలిసి పోటీ చేశారు? ఫలితం ఏంటి ఒక్కసీటులో కూడా పోటీచేయలేదు. అప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చి అయిదేళ్లు ప్రజలను పీడించాడు.

ఇక 2019లో చంద్రబాబు నాయుడుతో కలవలేదు. ఎందుకు కలవలేదు. టీడీపీ వ్యతిరేక ఓటు చీలకుండా, మళ్లీ పల్లకి మోసే కార్యక్రమం చేశారు, అవునా కాదా? మళ్లీ టీడీపీ ఓటు చీలిపోయి ఆ పార్టీ ఓడిపోతే… చివర్లో పత్రికాధిపతులు రాయాబారాలు చేస్తే మీరు ఒంటరిగా పోటీ చేశారు. ఫలితం ఏంటి.. మీరు గెలవలేదు. గెలిచినవాడు ఒక్కడు మీతో ఉండలేదు. చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు. జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఇదీ ఫలితం.
ఇప్పుడు మీ వ్యూహం ఏంటి? టీడీపీకి అనుకూలంగా వైయస్సార్‌సీపీకి వ్యతిరేక ఓటు చీలకుండా చేయాలట. మరి పోయినసారి ఎందుకు చేయలేదు…?

ఎవరి పల్లకి మోయాలో జన సైనికులకు చెప్పు పవన్..
ఇవాళ జగన్‌గారికి వ్యతిరేకంగా ఉన్న ఓటును చీలకుండా ఒకేచోట పెట్టి ఎవర్ని అధికారంలోకి తీసుకు వద్దామనుకుంటున్నారు? నువ్వు రావాలనుకుంటున్నావా? చంద్రబాబును అధికారంలోకి తీసుకువస్తావా? ఈ విషయాన్ని నీ జనసేన సైనికులకు చెప్పు పవన్‌. నీ పల్లకి మోయాలా? చంద్రబాబు పల్లకి మోయాలా? ప్రజల పల్లకి మోయాలా అనే విషయాన్ని చెప్పు. లేక లోకేష్‌ బాబు పల్లకి మోయడానికి వీళ్లంతా కష్టపడాలో చెప్పు నాయనా.

పవన్‌.. నీ విధానం, నీ పార్టీ పాలసీ ఏంటో చెప్పు. పాలసీని చెప్పరట. పాలసీని పవన్‌కు వదిలేసి, జన సైనికులు పనిచేయాలట. ఇందుకోసం ఒక కాపాలదారుడిని పెట్టాడు. ఆయన ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు చంద్రబాబుకు అందిస్తాడు. ఆయనే నాదెండ్ల మనోహర్. ఒకవైపు ఇలాంటి డీల్స్‌ జరుగుతుంటే.. మళ్లీ జనసేన భరోసా యాత్ర అంటుంటే ప్రజలు నమ్ముతారని అనుకోవద్దు.

రాజకీయ సన్యాసం ఎందుకు తీసుకోలేదు పవన్…
ఒక్కసారి జన సైనికులు గానీ, జనసేన నాయకులు గానీ … 2014, 2019లో ఏం జరిగిందో… 2024లో ఏం జరుగుతుందో ఈ మూడు స్టెప్స్‌ బుర్ర పెట్టి ఆలోచిస్తే బాగుంటుంది. ఇది ఎవరో పల్లకీ మోయడానికి పుట్టిన రాజకీయ పార్టీ తప్ప, మీ కాళ్ల మీద నిలబడే రాజకీయ పార్టీ కాదనేది గమనిస్తే మంచిది. లేకుంటే, మీరు ఏ గంగలో దూకినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు.

2024లో జగన్‌ మోహన్‌ రెడ్డి, వైయస్సార్‌ సీపీ అధికారంలోకి రాదని చెబుతున్నాడు. ఈయన రాదంటే అధికారంలోకి వస్తుందని అర్థం. పవన్‌ 2014లో ఏం చెప్పాడో యూట్యూబ్‌లో కొట్టి చూస్తే తెలుస్తుంది. జగన్‌ అధికారంలోకి ఎప్పటికీ రారని, వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటామన్నాడు. మరి రాజకీయ సన్యానం తీసుకున్నాడా? నువ్వు కాదంటే అవుననిలే… అవునంటే కాదనిలే… అన్నట్టు ఉంది.

ప్యాకేజీ గాళ్ళకు.. వేరే వాళ్ళ పల్లకి మోసే వారికి జనం ఓట్లేయరు
2024లో జరిగే ఎన్నికల్లో మళ్లీ తిరిగి రాజ్యాధికారం దక్కేది వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకే. ఇది ఎంత సత్యం అంటే మా ఇంటికి వచ్చి మా పిల్లలను ఆశీర్వదించినంత సత్యం. 2024లో మళ్లీ వచ్చేది వైయస్సార్‌ సీపీనే. చిత్తశుద్ది, అంకితభావంతో పనిచేసే జగన్‌ మోహన్‌ రెడ్డిగారికి ప్రజలు ఓట్లు వేస్తారు కానీ, నీబోటి ప్యాకేజీ గాళ్లకు ఓట్లు వేసే ఛాన్సే ఉండదు. మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఒకరి పల్లకి మోసే నాయకులుగానే మిగిలిపోతారు.

సీఎం ఢిల్లీ వెళితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా..?
ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి తో పాటు పలువురు కేంద్రమంత్రులను కలిశారు. ఈ సందర్భంగా ఎల్లో మీడియాలో ముఖ్యమంత్రి పర్యటనకు వ్యతిరేకంగా పుంఖానుపుంఖాలుగా కథనాలు, డిబేట్లు చూశాను. కేంద్రంతో ముడిపడిన రాష్ట్రానికి సంబంధించిన ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇన్ని సమస్యలను గురించి మాట్లాడటానికి వెళ్లిన ముఖ్యమంత్రిని అడుక్కోవడానికి వెళ్లారంటారా? ఏపీని శ్రీలంకలాగా చేస్తారంటారా? చంద్రబాబు, పవన్ కల్యాన్ …. ఇద్దరిదీ ఒకటే మాట, ఒకటే బాట.

ఎందుకయ్యా ప్రజలను భయపెడతారు? పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి 200 గ్రామాలు ముంపు ప్రాంతాలవారిని ఖాళీ చేయించి, వారికి పరిహారం అందించాలి, ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తి చేయాలి. ప్రాజెక్టుకు సంబంధించి రూ. 31,188కోట్లు మనకు రావాలి. పునరావాసానికే రూ. 22, 600 కోట్లు కట్టాలి. ఇవన్నీ అడగాల్సిన బాధ్యత లేదా? తెచ్చుకోవాల్సిన బాద్యత లేదా? మన హక్కులు సాధించుకోవడం కోసం ముఖ్యమంత్రి ఢిల్లీ వెళితే అడుక్కోవడానికి వెళ్లారని నీచంగా మాట్లాడుతున్నారు.

విభజన హామీలు నెరవేర్చాలని ముఖ్యమంత్రి కోరారు. 1,45 లక్షలమంది వైట్‌ కార్డు రేషన్‌ దారులు ఉన్నారు, వారికి సబ్సిడిలు ఇవ్వాల్సిన అంశాలు, భోగాపురం ఎయిర్‌పోర్టు గురించి అడగాల్సిన అంశాలు.. వీటన్నింటిపై ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులను కలిస్తే.. మీరు ఇష్టం వచ్చినట్లు అవాకులు చెవాకులు పేలుతున్నారు.

ఇంకోవైపు ప్రజలు ఏ పన్ను కట్టకూడదు. ఏ పథకం అమలు జరగకూడదు. కేంద్రం సాయం చేయకూడదు. అప్పులు ఎవరూ ఇవ్వకూడదు అని మీరంతా కోరుకుంటున్నారు. మీరు కలలుగన్నట్టు ఆంధ్రప్రదేశ్ కు ఎప్పటికీ శ్రీలంక పరిస్థితి రాదు. ఇది జగన్‌ మోహన్‌ రెడ్డిప్రభుత్వం. ఎంతమంది కట్టకట్టుకుని వచ్చినా… 2024 ఫ్యాన్‌ జెండానే రెపరెపలాడుతోంది.

మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. రైతులకు పవన్ కల్యాణ్ తాను సినిమాల్లో సంపాదించిన డబ్బులు ఇస్తున్నారో లేక ఎన్టీఆర్ ట్రస్టు భవన్ నుంచి వచ్చిన డబ్బులు ఇస్తున్నారో తేలాల్సిన అంశం. పవన్ కల్యాణ్ ఏ వ్యూహం చేసినా… అవన్నీ సైకిల్ దారే.. అన్నది జగమెరిగిన సత్యం.

LEAVE A RESPONSE