విశాఖ అక్రిడేటెడ్ వర్కింగ్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ వినతి పై వై.వి.సుబ్బారెడ్డి హామీ
విశాఖపట్నం, నవంబర్ 15: ఇళ్ల స్థలాల జీవోలో జర్నలిస్టులు కోరుతున్న సవరణలను సీఏం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఉత్తరాంధ్ర జిల్లాల వైసిపి కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు.జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ విడుదల చేసిన జీవో లో కొన్ని సవరణలు చేయాలని కోరుతూ ఉత్తరాంధ్ర జిల్లాల వైసిపి కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి కి విశాఖ అక్రిడేటెడ్ వర్కింగ్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు బుధవారం ఉదయం వినతిపత్రం సమర్పించారు. ఈ ఉత్తర్వుల్లో వున్న కొన్ని నిబంధనలు కారణంగా అత్యధిక శాతం మంది జర్నలిస్టులు
ఎటువంటి లబ్దీ పొందలేరని ఆయన దృష్టికి తీసుకుని వెళ్లారు.
ఎండాడలోని పార్టీ కార్యాలయంలో ఆయనను కలిసిన సొసైటీ ప్రతినిధులు జీవోలో ఉన్న కొన్ని నిబంధనలను సడలించాలని కోరారు. ముఖ్యంగా 60 : 40 ప్రాతిపదికన రూపొందించిన నిబంధనను జర్నలిస్టుల ఆర్దిక పరిస్థితి రీత్యా అందరికీ అనువుగా ఉండేలా 90:10 నిష్పత్తిలో చెల్లించేలా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు .గతంలో ప్రభుత్వం నుంచి ఇళ్ల స్థలాలు పొందిన వారిని మినహాయించవచ్చనీ ..కానీ భార్య పేరున గాని భర్త పేరున గాని ఇళ్ల స్థలం, ఫ్లాట్ ,ఇల్లు ఉంటే అనర్హులని ప్రకటించడం వలన ఎనభై శాతానికి పైగా జర్నలిస్టులు నష్టపోతారని వివరించారు. ఈ నిబంధనను తొలగించేలా కృషి చేయాలని కోరారు.
2023లో అక్రిడేషన్ లేని జర్నలిస్టులకు సీనియార్టీ ప్రాతిపదికన ఇళ్ల స్థలాల కేటాయింపునకు అర్హులుగా చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఇళ్ల స్థలాల ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి వీలుగా దరఖాస్తు చేసుకునే సమయాన్ని ఆరువారాల నుంచి మూడు వారాలకు తగ్గించాలని కోరారు. విశాఖ నగరానికి దగ్గర్లో , నివాసయోగ్యం ఉన్నచోట స్థలాల కేటాయింపు జరిగేలా చూడాలని అన్నారు. చేశారు.గతంలో జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీలకి ఇచ్చిన నిబంధనలు పరిగణలోకి తీసుకొని ఇప్పుడు కూడా అదే విధంగా వర్తింప చేయాలని కోరారు.
ఏజెన్సీ ప్రాంతాలలో 1/70 చట్టం అమల్లో ఉన్నందున అక్కడ పనిచేస్తున్న జర్నలిస్టులకు ఎదురవుతున్న అడ్డంకుల నేపథ్యంలో మైదాన ప్రాంతాలలో ఇళ్ల స్థలాలు కేటాయించాలని వై వి సుబ్బారెడ్డిని కోరారు. సొసైటీ ప్రతినిధులు తీసుకువచ్చిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని వై వి సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు. జీవో నెంబర్ 395లో ఎదురవుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువెళ్లి జర్నలిస్టులకు న్యాయం జరిగేలా చూస్తానని చెప్పారు.
జర్నలిస్టులు కోరుతున్న సవరణలను పరిష్కరించేందుకు తప్పకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రెండు మూడు రోజులలో పూర్తి స్థాయిలో జీవో విడులవుతుందని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో విశాఖ అక్రిడేటెడ్ వర్కింగ్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ గౌరవ అధ్యక్షులు జి .జనార్దన్ రావు, అధ్యక్షుడు బి. రవికాంత్, సహాయ కార్యదర్శిలు అనూరాధ, బందరు శివ ప్రసాద్, కోశాధికారి ఆలపాటి శరత్ కుమార్, ప్రత్యేక ఆహ్వానితులు ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.