Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ నేతలు చెప్పిన మాటలనే అమిత్‌షా మాట్లాడారు

– మీరే కితాబులిస్తూ.. అవినీతి అని ఎలా మాట్లాడతారు..?
– అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలిచాం
– రూ. 2.16 లక్షల కోట్లు డీబీటీ ద్వారా ఇస్తే.. అవినీతి జరిగిందెక్కడ…?
– చెప్పుడు మాటలు విని మా ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలా..?
– బాబు రాళ్ళు వేయించింది మరిచారా షా..?
– మోడీని నోటికొచ్చినట్లు మాట్లాదింది చంద్రబాబు కాదా?
– అమరావతి పెద్ద స్కాం అని మాట్లాడింది మీరు కాదా?
– అమిత్‌షా నోట విభజన హామీల ప్రస్తావనేది..?
– భూదోపిడీ ఆరోపణల్లో నిజం లేదు
– ఆధారాలతో వస్తే మేం చర్చకు సిద్ధం
– సవాల్‌ విసిరిన మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు

అమిత్‌షా నోట రాష్ట్ర అవసరాల ప్రస్తావనేది..?
బీజేపీ అగ్రనేతల మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి. అమిత్‌షా సభకు స్పందన లేదంటే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు ఎంత అన్యాయం చేస్తుందనేది మనమందరం అర్థం చేసుకోవాలి. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను అన్నివర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. నిన్న బీజేపీ నేతల మాటల్లో ఆ విషయం గురించి కనీస ప్రస్తావన తేలేదు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని రద్దు చేస్తామని బీజేపీ నేతలు చెబితే మేం చాలా సంతోషించే వాళ్లం. అదేవిధంగా వారి మాటల్లో విశాఖ రైల్వేజోన్‌ గురించి పల్లెత్తు ప్రస్తావన తేలేదు. విశాఖ మైట్రోలైన్‌ ఊసే వినిపించలేదు. తగుదునమ్మా అంటూ.. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపై బురదజల్లేందుకు మాత్రం వారు సిద్ధపడ్డారు. రాష్ట్ర బీజేపీ నేతలతో పాటు పచ్చమీడియా వారికి చప్పట్లు కొట్టారు. బీజేపీ నేతలకు వత్తాసు పలికే వారిని, ఎల్లో మీడియాను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకహోదా వద్దా..? విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను రద్దు చేయనవసరంలేదా..? విశాఖ రైల్వేజోన్‌తో పాటు విశాఖ మెట్రో లైన్‌ అవసరం లేదనుకుంటున్నారా..? ఈ ప్రశ్నలకు ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలతో పాటు పచ్చమీడియా కూడా సమాధానం చెప్పాలి.

రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమం, అభివృద్ధిపై కేంద్రమే కితాబిచ్చింది వాస్తవంకాదా..?ః
ఈరోజు ఆంధ్రరాష్ట్రంలో అమలు జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలపై దేశంలోని మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు, ఇక్కడి పథకాలను శెభాష్ అని మెచ్చుకుంటున్నారు. ఆంధ్రరాష్ట్రంలో అమలవుతోన్న సంక్షేమ పథకాలను ఆయా రాష్ట్రాలవారు ఆదర్శంగా తీసుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అంతెందుకు, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం గురించి కేంద్రప్రభుత్వం నుంచి కూడా కితాబులిస్తున్నారు కదా..? ఆంధ్రరాష్ట్రం జీడీపీలో నెంబర్‌ వన్‌స్థానం అని మీరే చెప్పారు. విద్యా రంగంలో కూడా మూడోస్థానానికి వచ్చిందని కేంద్రంమే చెబుతుంది. ఇలా అనేకరంగాల్లో ముందంజలో ఉన్నామని చెబుతూనే.. మరోపక్కన అవినీతి అని ఏ ఆధారాలతో బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని నేను అడుగుతున్నాను.

రూ. 2.16 లక్షల కోట్లు డీబీటీ ద్వారా ఇస్తే.. అవినీతి జరిగిందెక్కడ…? 
ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు అండగా నిలుస్తోన్న నాయకుడు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని సమర్ధంగా అమలు చేస్తున్న మనసున్న ముఖ్యమంత్రి. జగన్‌ గారు అధికార బాధ్యతలు చేపట్టిన దగ్గర్నుంచి ఇప్పటివరకు అర్హులైన ప్రతీ లబ్ధిదారునికి డీబీటీ ద్వారా రూ.2.16 లక్షల కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమచేయడం జరిగింది. ఇందులో ఏం అవినీతి జరిగిందని బీజేపీ నేతలు మాట్లాడతారు..?

బాబు రాళ్ళు వేయించింది మరిచారా షా..?
ఈ సందర్భంగా నేనొక విషయాన్ని గుర్తుచేస్తున్నాను. అమిత్‌షా తిరుపతికి వచ్చినప్పుడు ఇదే టీడీపీ నేతలు, కార్యకర్తలు కలిసి ఆయనపై రాళ్లు విసిరి తరిమేస్తే.. మీకు కోపం రాలేదు. మీకు సిగ్గులేకపోతే.. మాకేమీ అభ్యంతరంలేదు. అదేవిధంగా ప్రధాని మోదీని ఉద్దేశించి గతంలో చంద్రబాబు ఏమన్నారో తెలుసుకదా..? “మోదీకి భార్యా పిల్లల్లేరు..నాకు మాత్రం భార్య, కొడుకు, కోడలు, మనువడు ఉన్నాడు.. మోదీ బ్రహ్మచారి. ఏమీ లేనోడు. నాకుమాత్రం అన్నీ ఉన్నాయని చంద్రబాబు పలికాడు. పైగా, మోదీ అనే వ్యక్తి రూ.2లక్షల కోట్లు ఆస్తిపరుడని” ఇదే చంద్రబాబు అన్నాడు. ఇప్పుడేమో యూటర్న్‌ తీసుకుని బీజేపీ జపం చేస్తున్నాడు.

అసలు, నిన్న అమిత్‌షా మాట్లాడిన వేదికపై ఎవరున్నారో అందరూ చూశారు కదా.. అందరూ టీడీపీ కండువా స్థానంలో బీజేపీ కండువా కప్పుకున్నవారే కదా.. సృజనా చౌదరి, గరికపాటి రామ్మోహనరావు, పురంధేశ్వరి, టీజీ వెంకటేశ్, సీఎం రమేశ్‌ ఉన్నారు. వీరందరు ఎవరు..? ఒకప్పటి టీడీపీ నేతలే కదా..? మనసు ఒకచోట మనిషి ఒఒకచోట ఉన్నట్లు.. టీడీపీ మనుషులుగా మాత్రమే వీరంతా బీజేపీ సభావేదికపై కూర్చొంటే.. మనసంతా చంద్రబాబుపై ఉందనడం వాస్తవం. ఇలాంటోళ్లు చెప్పే చాడీలు విని మీరు మాట్లాడతారా..? వాస్తవాల్ని తెలుసుకుని మాట్లాడాలని బీజేపీ నేతలకు నేను హితవు పలుకుతున్నాను.

40 గుళ్లు కూల్చినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు
అమిత్‌షాను నేనొక ప్రశ్న అడగుతున్నాను. 2014 నుంచి 2019 వరకు బీజేపీ, టీడీపీ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అప్పట్లో చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా సైతం పనిచేసినప్పుడు, ఈ రాష్ట్రంలో 40 హిందూ దేవాలయాల్ని కూల్చినప్పుడు ఏమైనా మీరు నోరుమెదిపారా..? అప్పుడు మీ బీజేపీ ఎమ్మెల్యేనే దేవాదాయశాఖ మంత్రిగా ఉన్నారు కదా..? మరి, అప్పుడు ఎందుకు నోరుమూసుకుని కూర్చొన్నారు. ఇవాళ ఇక్కడేదో జరిగిపోతుందని లేనిపోని కబుర్లు చెబుతూ ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.

అమరావతి పెద్ద స్కాం అని మాట్లాడింది మీరు కాదా?
ఇసుక గురించి మాట్లాడుకుంటే.. ఐదేళ్ల టీడీపీ హయాంలో ఇసుక మీద రాష్ట్ర ఖజానాకు ఏమైనా ఆదాయం వచ్చిందా..? అంటే, రాలేదనే సమాధానం వస్తుంది. అదే, మా ప్రభుత్వం వచ్చాక రూ.వేలకోట్ల ఆదాయాన్ని ఇసుక మీద ఖజానాకు జమచేశాం. ఐదేళ్ల టీడీపీ పాలనలో ఇసుక దోపిడీ, దందాలు ఇంతాఅంతా కాదు. ఇందులో అప్పటి మిత్రపక్షమైన బీజేపీకి కూడా భాగస్వామ్యం ఉంటుందికదా..? మరి, అమరావతి గురించి అప్పట్లో బీజేపీ నేతలు ఏమని మాట్లాడారు. అమరావతి పెద్ద అవినీతి కుంభకోణానికి వేదికగా నిలిచింది. అమరావతి కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీనే మాట్లాడింది కదా..? నాడు చంద్రబాబుపై టీడీపీ గురించి ఇన్ని మాటలు మాట్లాడి.. ఇప్పుడేదో ఆ నాయకుడు, ఆ పార్టీ సచ్ఛీలత తెలిసినట్లు.. మా వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నానికి బీజేపీ సాహసించడం మంచిదికాదని.. మీ ప్రయత్నాలు బెడిసికొడతాయని హెచ్చరిస్తున్నాను.

అమిత్‌షా చెప్పుడు మాటలు వినడం సరికాదు
వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చాక చేపట్టిన ప్రతీ మంచి పనికీ ఏదోరకంగా అడ్డుపడటమే రాజకీయ లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు లాంటి దుర్మార్గమైన నేతల మాటలు విని అమిత్‌షా లాంటి బీజేపీ అగ్రనేత మాపై బురదజల్లడం మంచి పద్ధతి కాదు. వారి ఆరోపణల్లో నిజనిజాల్ని తెలుసుకోవాలని మనవి చేసుకుంటున్నాను. అందరూ చూస్తుండగానే కళ్లముందు జరిగిన అమరావతి భూముల కుంభకోణాన్ని వదిలేసి మేమేదో వైజాగ్‌లో భూదోపిడీకి పాల్పడ్డామనే నిరాధారమైన ఆరోపణలు చేయడం వారికి సరికాదని తెలియజేస్తున్నాను. నిజంగా, మేం గానీ మా నాయకులు గానీ భూముల కబ్జా చేసినట్లు ఆధారాలుంటే వాటిపై చర్చించేందుకు కూడా మేం సిద్ధంగా ఉన్నాం. బీజేపీ ముందుకొస్తుందా..? అని ప్రశ్నిస్తున్నాను.

ప్రజలకు మేలు చేస్తుంటే మోకాలడ్డుతున్న బాబు
ఈరోజు జగనన్న విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన పథకాల ద్వారా ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివే ప్రతీ విద్యార్థికి పుస్తకాలు, బ్యాగ్, వారికి యూనిఫాంతో పాటు మధ్యాహ్న భోజనం, వారికి అమ్మ ఒడి కానుక ఇలా అన్నిరకాల సదుపాయాలు కల్పిస్తున్న మనసున్న ప్రభుత్వం మాది. పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియం బోధన అమలు చేస్తామంటే, ఇదే టీడీపీ అన్నిరకాలుగా కోర్టులకెక్కి మరీ అడ్డుపడింది. నాడు- నేడు కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల్ని మారుస్తుంటే.. రకరకాల వంకలు, కారణాలు చూపుతూ కోర్టులకెక్కి మోకాలడ్డే ప్రయత్నం చేశారు. పేదలకు రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షలకు పైగా ఉచితంగా ఇళ్ల స్థలాల్ని పంపిణీ చేయడంతో పాటు అమరావతి ప్రాంతంలో మరో 50వేల ఇళ్ల స్థలాలిస్తుంటే.. డెమోగ్రఫికల్‌ ఇం బ్యాలెన్స్‌ అంటూ ఈ పెత్తందారీ వర్గ నేత చంద్రబాబు సుప్రీంకోర్టు దాకా వెళతాడా..? అడుగడుగునా మా ప్రభుత్వంపై కుట్రలు, కుతంత్రాలు చేస్తూ బాబు రాజకీయం చేయడం వృధాప్రయాసేనని .. ప్రజలు ఆయన పాతచింతకాయ పచ్చడి మాటల్ని విని నమ్మే పరిస్థితి లేదని చెబుతున్నాను.

మచ్చలేని నాయకుడు జగన్‌
ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌గారు రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణ పేదలకు ఆరాధ్యదైవంగా నిలిచారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన ప్రతీ హామీని నెరవేరుస్తూ.. ఇప్పటికే 99 శాతం హామీల్ని అమలు చేసిన మచ్చలేని నేత మా జగన్‌గారు అని .. వారి నాయకత్వంలో మేమంతా మంత్రులుగా పనిచేయడం మా అదృష్టంగా మేం గర్వంగా చెప్పుకుంటున్నాం.

విభజన హామీలపై నోరు విప్పరెందుకు..?
ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాలకు సంబంధించి ప్రత్యేక ప్యాకేజీ గురించి బీజేపీ ఎందుకు మాట్లాడదు..? విభజన చట్టంలో కేంద్రం చేస్తానన్న హామీలలో చాలావరకు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి కదా.. వాటిపై బీజేపీ ఎందుకు నోరు మెదపదు..?. మీ పక్కనున్న స్థానిక నేతలు ఏదిచెబితే అది మాట్లాడటం కాకుండా, అమిత్‌షా వంటి అగ్రనేతలు తమ మాటల్ని సరిచేసుకోవడం ఉత్తమమని చెబుతున్నాను.

సింగిల్‌గా వస్తాం..175 చోట్ల గెలుస్తాం
కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ పరిపాలన ఎలా నడిచిందనేది అందరూ చూశారు. కనుకనే, వారికి మొన్నటి ఎన్నికల్లో జరిగిన పరాభవం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పరిపాలన అనేది సంతృప్తికరంగా ఇవ్వక పోవడంతోనే బీజేపీని కర్ణాటక ప్రజలు సాగనంపారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు పొత్తులతో వచ్చినా, కూటమి కట్టినా.. మా నాయకుడు శ్రీ వైఎస్‌ జగన్‌ గారి నేతృత్వంలో వైఎస్‌ఆర్‌సీపీ సింగిల్‌గా పోటీకి దిగి, రాష్ట్రంలోని 175కి 175 స్థానాల్ని గెలిచి తీరతామని సవాల్‌ చేసి చెబుతున్నాను.

LEAVE A RESPONSE