– మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపాటు
గుంటూరు: రాష్ట్రంలో రైతాంగానికి సరిపడినన్ని ఎరువులను కూడా అందించలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం అసమర్ధ పాలనను కొనసాగిస్తోందని మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గుంటూరు లో కలెక్టర్ ని కలిసి మెమోరాండం సమర్పించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద రాంబాబు మీడియాతో మాట్లాడారు. గతంలో ఆర్బికేల ద్వారా వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందే వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కావాల్సిన ఎరువులను సకాలంలో అందజేసేదని అన్నారు.
నేడు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు వెన్నుముకగా నిలిచిన ఆర్బికేలను నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. దాని ఫలితంగా నేడు ఎరువులు లభించక బ్లాక్ మార్కెట్లో నకిలీ ఎరువులు కూడా కొనుగోలు చేసి రైతులు నష్టపోయే పరిస్థితికి చంద్రబాబు నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు.