దేశంలోనే తొలిసారిగా.. సికె దిన్నె పాఠశాల ఆవరణలో ప్రారంభమైన ‘సెంట్రలైజ్డ్ అడ్వాన్స్ డ్ స్మార్ట్ కిచెన్’ వెనుక ఓ గొప్ప ఆశ ఉంది. ఇది కేవలం రెండు కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన భవనం మాత్రమే కాదు, చదువుల యజ్ఞంలో ఆకలిని దూరం చేసే ఒక నూతన అధ్యాయం.
ఇక్కడ వంట చేసేది మనుషులు మాత్రమే కాదు, సోలార్ పవర్ తో పనిచేసే ఆధునిక యంత్రాలు. ప్రతీ మెతుకులోనూ నాణ్యత, శుభ్రత ఉండాలని ఆర్.ఓ. ప్లాంట్ నీటినే వంటకు వాడుతున్నారు. ఈ కిచెన్ నుంచి కమలాపురం, జమ్మలమడుగు, కడపలలోని 136 పాఠశాలలకు చెందిన 10,332 మంది చిన్నారులకు ప్రతిరోజూ రుచికరమైన, ఆరోగ్యకరమైన భోజనం పంపిణీ అవుతుంది. ఇది ఒక చిన్న అడుగు, కానీ వేలాది మంది పిల్లల భవిష్యత్తుకు వేసిన బలమైన పునాది.
ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వచ్చిన లోకేష్ కేవలం ఒక మంత్రిగా కాకుండా, ఒక అన్నగా, ఒక స్నేహితుడిగా విద్యార్థులతో కలిసిపోయారు. పదో తరగతి విద్యార్థులతో ముచ్చటించిన లోకేష్, వారి నుంచి సలహాలు, సూచనలు అడిగి తెలుసుకున్నారు. సన్నబియ్యం భోజనం రుచిగా ఉందని చెప్పిన చిన్నారి జాస్మిన్ మాటల్లో ఉన్న ఆనందం, కొత్త పుస్తకాల మోత తగ్గిందని చెప్పిన విద్యార్థుల మాటల్లో ఉన్న సంతోషం.. ఇవి కేవలం సంస్కరణల ఫలితాలు కాదు, అవి ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉన్న మానవ బంధానికి నిదర్శనం.
విద్యార్థులు అడిగిన కంప్యూటర్ ల్యాబ్స్, కొత్త బెంచీల వంటి చిన్న కోరికలకు వెంటనే స్పందించి, వాటిని నెరవేరుస్తామని హామీ ఇవ్వడం, మంత్రిని చూసి ఓ విద్యార్థిని ప్రేమతో వేసిన చిత్రం బహుకరించడం.. ఇవి కేవలం ప్రోటోకాల్ లో భాగం కాదు. ఒక నాయకుడిని తమవాడిగా భావించే భావి చిన్నారుల ఆశలు.
“ఈసారి మీకు మాత్రమే కాదు, నాకు కూడా పరీక్షే,” అని లోకేష్ అన్న మాటలో ఉన్న నిజాయితీ, భరోసా.. అది ఒక నాయకుడు తన ప్రజల పట్ల ఎంత బాధ్యతగా ఉన్నాడో తెలియజేస్తుంది. డిసెంబర్ కల్లా కడప జిల్లా మొత్తం ఈ స్మార్ట్ కిచెన్ల వెలుగులు నింపుతాయన్న ఆశను ఆయన వ్యక్తం చేశారు.
ఈ ‘స్మార్ట్ కిచెన్’ కార్యక్రమం కేవలం ఆహారం పంపిణీ కాదు. ఇది సమాజంలో ఆకలిని, అసమానతలను పారదోలి, ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్యను, పోషణను అందించాలన్న తపనకు ఒక ప్రతీక. ఇది మొదలైన చోటు కమలాపురం కావచ్చు, కానీ ఈ ఆశలు, ఆశయాలు రాష్ట్రం మొత్తం విస్తరించాలన్నదే అందరి కోరిక
ఇది వ్రాస్తుంటే కళ్లు చమర్చాయి. కడప జిల్లా అంటే సాధారణంగా ఒకప్పుడు రాజకీయ కక్షలు, ప్రతీకారాలతో వార్తల్లో ఉండే ప్రాంతంగా భావిస్తారు. కానీ ఆధ్యాత్మిక, కాలజ్ఞాన, వాగ్గేయ కారుల, తత్వచింతన, పండరి భజనల దేవుని గడపగా భాసిల్లిన చరిత్ర గుర్తుకు వచ్చింది. మళ్లీ ఆ రోజులు వచ్చాయి అనిపిస్తోంది.