Suryaa.co.in

Andhra Pradesh

కేసులు పెట్టాల్సింది ఎవరిపై జగన్ రెడ్డి?

– న్యాయపోరాటం చేస్తే నేరమా?
– నిధులు కాజేసినవారిపై చర్యలేవి?
– రేపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ 

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్ర అభివృద్ధికి పట్టుకొమ్మలైన గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేస్తోంది. పంచాయతీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోగా… కేంద్రం ఇచ్చిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం కాజేస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ఏ గ్రామంలోనూ అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు.

కేంద్ర ప్రభుత్వం 14, 15 వ ఆర్థిక సంఘం నుండి విడుదలైన రూ.8,548.29 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కాజేసింది. 12,918 పంచాయతీల్లో కనీసం బ్లీచింగ్ చల్లడానికి కూడా నిధులు లేకుండా ప్రభుత్వం సర్పంచ్ లను రోడ్డున పడేసింది. కనీసం చెత్త ఎత్తే కార్మికులకు కూడా పంచాయతీల్లో నిధులు లేవు. దీంతో సర్పంచ్ లే ఇంటింటికీ తిరిగి చెత్త ఎత్తే దుస్థితిని జగన్ రెడ్డి తెచ్చారు. పంచాయతీలకు న్యాయబద్ధంగా రావాల్సిన నిధులను పంచాయతీ ఖాతాల్లో జమ చేయాలని కోరిన సర్పంచ్ లపై క్రిమినల్ కేసులు పెట్టడం జగన్ రెడ్డి నియంత పాలనకు నిలువెత్తు నిదర్శనం.

టీడీపీ అధికారంలో ఉండగా ఆదర్శవంతమైన గ్రామాలను నిర్మించింది. ఇందుకుగాను పంచాయతీలకు అవసరమైన నిధులను అందించింది. గ్రీన్ అంబాసిడర్లను నియమించుకుని చెత్తరహిత గ్రామాలను నెలకొల్పింది. కేంద్ర ప్రభుత్వం నుండి వేలాదిగా స్వచ్ఛ గ్రామాల అవార్డులను కైవసం చేసుకుంది. సర్పంచులకు సర్వాధికారాలు ఇచ్చి, నిధులు ఇచ్చి టీడీపీ ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేసింది. 26 వేల కిలోమీర్ల సిమెంటు రోడ్లను నిర్మించింది. ప్రతి ఇంటికీ మరుగుదొడ్లు, ప్రతి గ్రామంలో సురక్షిత మంచినీటి పథకాన్ని అమలు చేసింది. ఎల్ఈడీ లైట్లతో గ్రామాల్లో వెలుగులు నింపింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పథంలో నడిచిన గ్రామాలు నేడు అంధకారంలో మగ్గుతున్నాయి.

సర్పంచులను డమ్మీలు చేసి వాలంటీర్లతో గ్రామాలను నింపేశారు. సచివాలయ సిబ్బందిని పార్టీ కార్యకర్తల్లా వాడుకుంటున్నారు. వైసీపీ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి శూన్యం. జగన్ రెడ్డి వేతనాలు మీ సలహాదారులకేనా సర్పంచ్ లకు ఇవ్వరా ? వైసీపీ పాలనలో పంచాయతీల అభివృద్ధిని గాలికొదిలారు. మూడున్నరేళ్ల వైసీపీ పాలనలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధి ఏంటో వైసీపీ నేతలు చెప్పగలరా? ఈ మూడున్నరేళ్లల్లో ఎక్కడైనా ఒక కిలోమీటరు సిమెంటు రోడ్డు వేశారా?

ఒక్క సెంటీమీటరు సైడు కాలువ కట్టారా? పంచాయతీల అభివృద్ధికి నిధులు కేటాయించకపోగా కేంద్రం కేటాయించిన నిధులను కూడా దారి మళ్లించారు. జగన్ రెడ్డి తన సలహాదారులకు నెల నెలా జీతాలు ఇస్తున్నారు తప్ప ప్రజాసేవ చేస్తున్న సర్పంచ్ లకు మాత్రం వేతనాలు ఇవ్వకుండా వేధిస్తున్నారు. దేశానికి పట్టుకొమ్మల్లాంటి పంచాయతీలపట్ల నిర్లక్ష్యం గా వ్యహరించడం సిగ్గుచేటు.

టీడీపీ హయాంలో గ్రామపంచాయతీలకు సర్వాధికారాలు ఇచ్చేవారం, నేడు ఎస్సీ, ఎస్టీ సర్పంచులకు అధికారాలు ఇవ్వకుండా జగన్ రెడ్డికి చెందిన సామాజికవర్గ వైసీపీ నేతలు గ్రామాల్లో పెత్తనం చలాయిస్తున్నారు. జగన్ రెడ్డికి దమ్ముంటే పంచాయతీ నిధులు దోచుకున్నవారిపై కేసులు పెట్టాలి. సర్పంచులపై పెట్టిన కేసులు ఎత్తేయాలి. సర్పంచులపై ప్రభుత్వం కేసులు బనాయించడాన్ని టీడీపీ తీవ్రంగా ఖండిస్తోంది.

LEAVE A RESPONSE