గుంటూరు: ఆంధ్రప్రదేశ్ లో వివిధ రంగాలలో అభివృద్ధి కాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అధ్యయన వేదికను మార్చి నాలుగో తేదీన విజయవాడలోని హోటల్ ఐలాపురం కాన్ఫరెన్స్ హాల్లో ప్రారంభిస్తున్నట్లు శాసనమండలి సభ్యులు కే.ఎస్ లక్ష్మణరావు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, ప్రొఫెసర్ డి ఏ ఆర్ సుబ్రమణ్యములు తెలిపారు.
గుంటూరులోని జనచైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అధ్యయన వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సాధించే దిశగా చేపట్టిన విధానాలు,సాధించిన ఫలితాలు,అవకాశాలు, సవాళ్లకు సంబంధించిన విషయాలను విమర్శనాత్మకంగా ప్రజాహితం లక్ష్యంగా అధ్యయనం చేస్తుందన్నారు చట్టబద్ధ పాలన సుపరిపాలన, గ్రామ స్వరాజ్, అభివృద్ధి వికేంద్రీకరణ,అవినీతి రహిత సమాజ స్థాపన కోసం అధ్యయనం చేస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అధ్యయన వేదిక వర్తమాన సామాజిక,ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలపై వివిధ ప్రాంతాలలో సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేస్తుంద అన్నారు. సామాజిక ప్రజాస్వామ్యాన్ని సర్వతోముఖమైన అభివృద్ధిని రాష్ట్ర ప్రజలు సాధించేందుకు ఆ దిశగా ప్రజాభిప్రాయాన్ని ప్రోది చేయటానికి,ప్రభావితం చేయడానికి కృషి చేస్తుందన్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం,ఉద్యోగ ఉపాధి కల్పన,వ్యవసాయ పారిశ్రామిక రంగాల పురోగతి, అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి, రాజకీయ పార్టీల పనితీరు,ప్రజాస్వామ్య పరిపుష్టి తదితర అంశాలపై నిష్ణాతులతో చర్చ గోస్టులు నిర్వహించి ప్రచారాన్ని నిర్వహిస్తామని తెలిపారు.
రాజకీయాలకు అతీతంగా సమాజ హితం కోరే మేధావులు, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలను కలుపుకొని ఐక్యంగా కృషి చేస్తామని వివరించారు..ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అధ్యయన వేదిక బుక్ లెట్ ను ఆవిష్కరించారు.