Suryaa.co.in

Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలం

– కానీ రాష్ట్ర ప్రభుత్వ తీరు ప్రతికూలం
అరాచక దాడులు పరిశ్రమల ఏర్పాటుకు ప్రతికూలం
– ప్రభుత్వం మొద్దు నిద్ర వల్ల కనీసం ఒక లక్ష కోట్ల పెట్టుబడులు , కనీసం 6 లక్షల మంది ఉపాధి కోల్పోయాం
– ఆర్ 5 జోన్ ఏర్పాటు నిజాల నిగ్గు తేలుస్తాం
– గ్రానైట్ గనులను, క్వారీలను, ఇసుక రీచ్ లను లాగేసుకుంటే పెట్టుబడులకు అనుకూలత ఎక్కడ ఉంటుంది ?
– జగన్మోహన్ రెడ్డి అనుయాయుల నాసిరకం మద్యం తయారీ కంపెనీలు తప్ప, వేరే ఏ ఇతర పరిశ్రమల పరిస్థితి బాగో లేదు
– ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరమ్ విజయవాడ లో నిర్వహించిన ” ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలకు అనుకూలమా … ప్రతికూలమా?! ” అనే అంశం పైన రౌండ్ టేబుల్ సమావేశంలో ఏపీ బీజేపీ పొలిటికల్ ఫీడ్ బ్యాక్ ప్రముఖ్ లంకా దినకర్

ఆంధ్ర ప్రదేశ్ భౌగోళికం గా పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలం, కానీ రాష్ట్ర ప్రభుత్వ తీరు ప్రతికూలం. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పాలన నిర్ణయాల తీరు, రాష్ట్రంలో అరాచక దాడులు వెరసి పరిశ్రమల ఏర్పాటుకు ప్రతికూలంగా మారాయి.

మాట వినకపోతే మార్గదర్శి పైన వేధింపులు, ఇబ్బంది పెట్టి అమర్ రాజా బ్యాటరీస్ హైద్రాబాద్ కు తరిమేసిన విధానం, స్వంత పార్టీ ఎంపీ విశాఖపట్నం నుండి తన వ్యాపారం కోసం పక్క రాష్ట్రానికి వెళ్లిపోతానని బహిరంగంగా చెప్పాకా, ప్రభుత్వం రాగానే కియా పరిశ్రమ నిర్వాహకులను బెదిరించిన సందర్భంగా అనుబంధ పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలించడం వంటి ఉదాహరణలు పెట్టుబడులు రాకపోవడానికి నిదర్శనం.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడగానే విద్యుత్ కంపెనీల ఒప్పందాల పీపీఏ లను రద్దు చేయడం, అమరావతి నిర్వీర్యం చేయడంతో పారిశ్రామిక వేత్తలు రాష్ట్రం వైపు చూడ లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకాశం జిల్లా కనిగిరి , చిత్తూరు జిల్లా ఏర్పేడులలో వస్తు తయారీ పరిశ్రమల కోసం నిమ్జ్ ఏర్పాటుకు అనుమతి ఇస్తే వాటికి అవసరమైన 25 వేల ఎకరాల భూమి అందించడంలో విఫలం అయ్యింది.

మనతో పాటు రాజస్థాన్ లో నిమ్జ్ ఏర్పాటుకు అనుమతి ఇస్తే, ఇప్పటికే పూర్తీ చేసి 65 వేల కోట్ల పెట్టుబడులుతో 4 లక్షల మందికి ఉపాధి దొరికింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వల్ల కనీసం ఒక లక్ష కోట్ల పెట్టుబడులు , కనీసం 6 లక్షల మంది ఉపాధి కోల్పోయాం. దీనితో పాటు ఈ పరిశ్రమల వల్ల రాష్ట్రానికి వచ్చే ఆదాయం మరియు జీ ఎస్ డీ పీ కోల్పోయాం.

కేంద్ర ప్రభుత్వం 5 పారిశ్రామిక నోడులు రాష్ట్రానికి కేంద్రం విశాఖ – చెనై పారిశ్రామిక కారిడార్ పరిధి క్రింద ఆమోదించి దాదాపు 5 సంవత్సరాలైనా రాష్ట్ర ప్రభుత్వం నిర్లిప్తత గా వ్యవహరించింది.

విశాఖపట్నం వద్ద నక్కపల్లి నోడ్ – 6,848 ఎకరాలు .
మచిలీపట్టణం నోడ్ – 12,145 ఎకరాలు.
దొనకొండ నోడ్ – 17,117 ఎకరాలు.
కొప్పర్తి నోడ్ – 2,596 ఎకరాలు.
శ్రీకాళహస్తి -ఏర్పేడు నోడ్ – 23,324 ఎకరాలు
చెన్నై – బెంగుళూరు పారిశ్రామిక కారిడార్ క్రింద కృష్ణపట్నం నోడ్ – 12,944 ఎకరాలు పైన జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి శ్రద్ధ లేదు.
బెంగళూరు – హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్ క్రింద ఓర్వకల్లు నోడ్ – 9,350 ఎకరాలు, హిందూపూర్ నోడ్ – 3,000 ఎకరాలు మరియు అనంతపురం నోడ్ – 3,000 ఎకరాలు
పైన తెలిపిన నోడ్లను సకాలంలో పూర్తీ చేసుకొని ఉంటే ఉత్తరాంధ్ర మరియు రాయలసీమలలో ఏర్పాటు చేసుకొనే పరిశ్రమలకు తరుగుదల మరియు పెట్టుబడి అలవెన్స్ ఆదాయపన్ను చట్టం క్రింద వెసులుబాటు వచ్చేవి, ఇప్పటికే కియా వంటి పరిశ్రమలు ఈ రాయితీలు పొందుతున్నాయి.

విశాఖ – చెనై పారిశ్రామిక కారిడార్, చెనై – బెంగుళూరు పారిశ్రామిక కారిడార్ మరియు బెంగళూరు – హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్ ఈ మూడు కారిడార్ల పరిధిలోని 9 నోడ్లకు ఒక లక్ష ఎకరాలు అవసరమని తెల్సిన ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం అడుగు ముందుకు పడలేదు.

కానీ, కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ని పక్కన పెట్టి, జగన్ తమ జేబు సంస్థ అయిన షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ మరియు ఇండో సెల్ కంపెనీలకు ఆర్ధిక సామర్ధ్యం లేకున్నా వేలాది మెగా వాట్ల పవర్ ప్రాజెక్టులకోసమని, 2.50 లక్షల ఎకరాల దారాదత్తం చేయడానికి ఆ కంపెనీలనుండి వచ్చిన ప్రతిపాదనలకు అనుకూలంగా, ఎమ్ఓయు లకన్నా ముందే జీఓ లు ఇస్తే విశాఖపట్నం నుండి గతంలో ప్రశ్నిస్తే ఇప్పటివరకు సమాధానం రాలేదు.

అనుమతులున్న పారిశ్రామిక నొడులకు ఒక లక్ష ఎకరాలు ఇవ్వలేని ప్రభుత్వం, తమ జేబులోని స్వంత వారికి మాత్రం సామర్ధ్యం లేకున్నా 2.50 లక్షల ఎకరాలను ధారాదత్తం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవ్వడం సిగ్గు చేటు.

రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పారిశ్రామిక ప్రగతి నిర్వీర్యం చేశారు. కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతి రాజధానిగా ఎదగాలనే ఉద్దేశ్యంతో, ల్యాండ్ పూలింగ్ లో భూములిచ్చిన రైతులకు వారి భూమి అమ్మకాల పైన, బదలాయింపు పైన క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ మినహాయింపు ఇచ్చి ప్రోత్సహించింది.

స్మార్ట్ సిటీ గా , హెరిటేజ్ సిటీగా రాజధాని అమరావతి ని గుర్తించింది, ఔటర్ రింగ్ రోడ్ ప్రతిపాదన ఆమోదించింది, రాజధాని నుండి రాయలసీమకు కొత్త జాతీయ రహదారి మరియు రాజధాని నుండి మచిలీపట్టణం కు రెండు వరసల రహదారిని నాలుగు వరుసల రహదారిగా తీర్చిదిద్దడం జరిగింది, అమరావతి రాజధాని చుట్టు పక్క ప్రాంతాల అభివృద్ధి కోసం అని కనకదుర్గ వారధి మరియు బెంజ్ సర్కిల్ వద్ద ఫ్లై ఓవర్లు పూర్తీ చేయడం జరిగింది.

ఇప్పుడు విజయవాడ తూర్పు మరియు పడమర బైపాస్ రోడ్లు చెరో పక్క మొత్తం 100 కిలోమీటర్ల బైపాస్ రోడ్లను ఎన్ హెచ్ ఏ ఐ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం వేస్తున్నది…. ఈ మౌలిక సదుపాయాలన్నీ పెట్టుబడుల ఆకర్షణకు ఉపయోగ పడేవే, రాష్ట్ర ఆర్ధిక చోదకశక్తి కోసం ఉపయోగ పడేవే.
కేవలం జగన్మోహన్ రెడ్డి దార్శనిక పాలన దృష్టి లోపం వల్ల ముందు పేర్కొన్న అన్ని ప్రాంతాలకు సంబందించిన పారిశ్రామిక వాడలు, రాష్ట్ర రాజధాని నిర్మాణం నిర్వీర్యం చేయడం వల్ల రాష్ట్రంలో అడుగు పెట్టాలనుకున్న పారిశ్రామిక వాడలు బెంబేలెత్తారు.

ముఖ్యంగా ఆర్ 5 జోన్ ఏర్పాటు చేసి ఎక్కడో దూరంగా ఉన్న పేదలకు స్థలాల కేటాయింపు చేసి గృహాలని కట్టిస్తామని కోర్టులో రాజధాని అంశం పెండింగ్లో ఉన్న ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టె ప్రయత్నం చేస్తూ జగన్ గారు వికృతానందం పొందుతున్నారు. ఈ అంశంలో వార్తా పత్రికలలో వచ్చిన సమాచారం మేరకు కేంద్ర ప్రభుత్వం గృహాల నిర్మాణానికి ఇచ్చిందనే ఆరోపణల నేపధ్యంలో, వాస్తవాలను పటాపంచలు చెయ్యాలనే ఉద్దేశ్యంతో మా పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కేంద్ర పట్టణ శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పూరి కి లేఖ రాయడం జరిగింది, త్వరలోనే నిజాల నిగ్గు తేలుస్తాం.

మా పార్టీ రాష్ట్ర శాఖా అధ్యక్షులు సోము వీర్రాజు ప్రతి బహిరంగ సభలో, అన్ని ప్రాంతాలలో అమరావతి అభివృద్ధికి బీ జె పీ కట్టుబడి ఉందని స్పష్టం చేస్తున్నారు. అర్హులైన పేదలకు ఏ ప్రాంతంలో నివసించే వారికి ఆ ప్రాంతంలో ఇవ్వవచ్చు, కానీ అమరావతి ని స్మశానం తో పోల్చి, వరదకు మునిగిపోయే ప్రాంతమని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, ఈ రోజు అదే ప్రాంతంలో ప్రజల మధ్య చిచ్చు పెట్టె నాటకం రక్తి కట్టించ లేకుండా ఉంది.

ఈ విధంగా భూములిచ్చిన రైతులను మోసం చేస్తే, పీపీఏ లను రద్దు చేసి మరల బేరాలు కుదిరాక అంతకన్నా ఎక్కువ ధరలకు అగ్రిమెంట్ అయితే, రాష్ట్రంలో అరాచక విధానాలతో భయాందోళనలను సృష్టిస్తే, పారిశ్రామిక వేత్తలను బెదిరించి వాటాలు తీసుకుంటే, గ్రానైట్ గనులను, క్వారీలను మరియు ఇసుక రీచ్ లను లాగేసుకుంటే పెట్టుబడులకు అనుకూలత ఎక్కడ ఉంటుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎక్కడ నుండి వస్తాయి?

రాష్ట్రంలో ఏదైనా పరిశ్రమ బాగుంది అంటే అది జగన్మోహన్ రెడ్డి అనుయాయుల నాసిరకం మద్యం తయారీ కంపెనీలు తప్ప, వేరే ఏ ఇతర పరిశ్రమల పరిస్థితి బాగో లేదు. ప్రభుత్వం నిర్వహించే మద్యం దుకాణాలలో కేవలం నగదు చెల్లింపుల ద్వారా ఎన్ని వేల కోట్ల ప్రభుత్వ ఆదాయం ఎవరి జేబుల్లోకి వెళ్తుందో ప్రజలకు అర్ధ అయ్యింది.

విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో సెంటిమెంట్ ఉంది అన్నది నిజం, దాన్ని బ్రతికించే విధంగానే ప్రయత్నం జరుగుతుంది. విశాఖ ప్లాంట్ కోసం జరిగిన బలిదానాలకు సార్థకత ఆ ప్లాంట్ బ్రతికి బట్టగలిగినప్పుడే.

ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడుల ఉపసంహరణ పీవీ నరసింహరావు గారు ప్రధానమంత్రి గా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం, వివిధ సందర్భాలలో 1990 తరువాత అన్ని కేంద్ర ప్రభుత్వాలు పెట్టుబడుల ఉపసంహరణ పాలసీగా తీసుకున్నది నిజం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు అన్ని పార్టీలు ఉన్నప్పుడు పెట్టుబడుల ఉపసంహరణ చేసింది కూడా నిజమే.

అనేక మంది పెట్టుబడుల ఉపసంహరణ సమయంలో ఏంపీలుగా ఉన్నవారు అప్పుడు మిన్నగా ఉండి, నేడు వ్యతిరేకిస్తున్నారు. మరికొందరు అమరావతి నిర్మాణ సమయంలో నేటి ముఖ్యమంత్రి నాటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కి అనుకూలంగా ఇదే రాజధానిలో నిలబడి, నేడు అదే పెద్దలు అమరావతి రైతుల చుట్టు నిలబడి మీకు మా మద్దతు అంటూ తిరుగుతున్నారు. ఇటువంటి వారి విధానాల వల్లనే జగన్మోహన్ రెడ్డి లాంటి వారికి అవకాశం దొరికింది, ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

ప్రస్తుత తరుణంలో మేధావులు అవ్వని కార్యక్రమాలతో ప్రజలను మభ్య పెట్టకుండా, సరైన ప్రత్యమ్నాయ మార్గాలను సూచించాలి. రాజకీయ నాయకులు రాజకీయమే చేస్తారు, మేధావులు రాజకీయ నాయకుల్లా కాకుండా సహేతుకంగా రాష్ట్రానికి మేలు జరిగే విధంగా నడుచుకోవాలి.

LEAVE A RESPONSE