Suryaa.co.in

Andhra Pradesh

అరాచక… పైశాచిక పాలనకు చిరునామా ఆంధ్రప్రదేశ్

-క్రైమ్ లిస్ట్ చేయకుండానే క్రైమ్ రేట్ తగ్గిందంటే ఎలా?
-లారీ తో తొక్కించి చంపివేస్తే ప్రమాద కేసుగా నమోదు చేస్తారా?, ఇదెక్కడి విడ్డూరం?
-రాష్ట్రంలో 31 వేల 760 మంది మహిళలు మిస్సింగ్ వారి అడ్రస్ ఎక్కడ?
-ఒకే సామాజిక వర్గ కాంట్రాక్టర్లకే బిల్లులు చెల్లిస్తారా?
-చిన్న కాంట్రాక్టర్లను, పనులు చేసిన సర్పంచులకు బిల్లులు ఎందుకు చెల్లించలేదు?
-వైయస్ వివేక హత్య కేసులో సిబిఐ, అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన ధర్మాసనం
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

అరాచక, పైశాచిక పాలనకు చిరునామా ఆంధ్ర ప్రదేశ్ అని ప్రజలు అనుకుంటున్నారు. ఏపీ అంటే అరాచకత్వం… పైశాచికత్వమని పేర్కొంటున్నారు. అయినా రాష్ట్రంలో శాంతిభద్రతలు బేష్ గా ఉన్నాయని డీజీపీ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది.. తన పదవీకాలంలో నేర గణాంకాలను చూపెడుతూ, శాంతి భద్రతలు బాగున్నాయని చెప్పడం విడ్డూరం. అసలు రాష్ట్రంలో క్రైమ్ లిస్ట్ చేయడమే మానివేశారు. ఇక క్రైమ్ రేట్ ను ఎలా అంచనా వేస్తారు?. లారీ తో తొక్కించి చంపి వేస్తే, దాన్ని లారీ ప్రమాద కేసుగా నమోదు చేస్తున్నారు. డాక్టర్ సుధాకర్ దారుణ హత్య పోలీసుల దృష్టిలో నేరమే కాదు. రాష్ట్రంలో 31 వేల 760 మంది మహిళలు మిస్సింగ్ అయినట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వారి ఆచూకీ ఎక్కడ? అని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘు రామకృష్ణంరాజు ప్రశ్నించారు.

సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసం లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… మాయ మాటలతో మహిళలను లోబరుచుకొని తీసుకువెళ్లి ముంబై రెడ్ లైట్ ఏరియాలో సంఘ విద్రోహక శక్తులు విక్రయిస్తున్నారు. నిజంగానే పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే, మహిళల మిస్సింగ్ ను అరికట్టలేరా? అని ప్రశ్నించారు. రాష్ట్ర హోంమంత్రి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది.

గతంలో పనిచేసిన సుచరిత, ప్రస్తుతం హోంశాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్న తానేటి వనితకు ఎంతవరకు అధికారాలు ఉన్నాయో అందరికీ తెలుసు. హోం శాఖామంత్రికి సమాంతరంగా, సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అన్ని తానై వ్యవహరిస్తున్నారనేది జగద్వితం. నిజమైన అధికారాలు కలిగిన హోం మంత్రి ఉంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉంటాయి. కానీ ఈ మధ్య ఏ ప్రభుత్వంలోనూ నిజమైన అధికారాలు కలిగిన హోం మంత్రులు లేకుండా పోవడం దురదృష్టకరం. చిన్నపిల్లలను అపహరించే గ్యాంగులకు రాజకీయ నాయకులతో సంబంధాలు ఉండడం వల్ల, వారు యదేచ్చగా తప్పించుకుని తిరుగుతున్నారు.

అయినా ఒక్కరైనా పట్టించుకుంటున్నారా?, రాష్ట్రంలో ఆడపిల్లలను ఎత్తుకెళ్లడం ఆపలేమా??, నిజంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పోలీ సింగ్ పై చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, మిస్ అయిన ఆడపిల్లలను వెతికించాలి. రాష్ట్రంలో నేరాలను అదుపు చేయాలంటే పాలకులకు చిత్తశుద్ధి ఉండాలని రఘురామకృష్ణం రాజు అన్నారు.

అమర్నాథ్ పాశవిక ఘటనపై ముఖ్యమంత్రి ఒక్క ట్విటయిన చేశారా?
తన సోదరిని వేధిస్తున్న వారిని అడ్డుకునే ప్రయత్నంలో దుండగులు చేతిలో సజీవ దహనానికి గురైన 15 ఏళ్ల బాలుడు అమర్నాథ్ మృతికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సంతాపాన్ని, విచారాన్ని తెలియజేస్తూ ప్రకటన చేయకపోవడం అనేది దారుణం. రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి కార్యాలయం దౌర్భాగ్యంగా తయారయింది. అమర్నాథ్ సజీవ దహనానికి గురైన రోజే ప్రతిపక్ష నేతలపై అసభ్యకరమైన ట్విట్లు చేస్తూ, విమర్శలు చేయడాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారు.

ముఖ్యమంత్రి కార్యాలయ తీరు చూసి, ఇదేనా పరిపాలన అని సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ఇంతకంటే అరాచక పాలన మరొకటి ఉంటుందా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. శాంతి భద్రతలు అనేది రాష్ట్రానికి సంబంధించిన అంశం. ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోదు… పట్టించుకోదు., రాష్ట్రంలో ఇంకెన్నాళ్లు ఈ అరాచక పాలన. ప్రభుత్వ అరాచకాన్ని ప్రశ్నిస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను స్ఫూర్తిగా తీసుకొనిప్రజలు, ప్రజాస్వామిక వాదులు ప్రశ్నించాలి. ప్రభుత్వ అన్యాయాలను ప్రశ్నిస్తున్న పవన్ కళ్యాణ్ తన ప్రాణానికి రక్షణ లేదనే పరిస్థితి నెలకొన్నదంటే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏమిటో స్పష్టమవుతుందని రఘురామకృష్ణం రాజు అన్నారు.

జగన్ ప్రభుత్వ అరాచకాలపై బహిరంగ లేఖ రాసిన చంద్రబాబు
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అరాచకాలు, అకృత్యాలపై ప్రజలకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖను రాశారు. తన సోదరిని వేధిస్తున్న వారిని అడ్డగించిన అమర్నాథ్ గౌడ్ అనే బాలుడిని వెంకటేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు. బాలుడి సజీవ దహన సంఘటన గురించి తెలిసి బాధపడని వారంటూ లేరు. బాధిత కుటుంబానికి మాజీ బీసీ మంత్రి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించడానికి వస్తే, ప్రజలు ముందుకు వచ్చి మేమే మూడు లక్షల రూపాయలు ఇస్తామని తిప్పి పంపడం పరిశీలిస్తే… ఇంకా ప్రజల్లో స్వాభిమానం, ధైర్యం మిగిలి ఉన్నందుకు ముచ్చట వేసింది.

గతంలో శవాన్ని పార్సిల్ చేసిన ఘటనలో ఎమ్మెల్సీ ని ప్రశ్నించిన వారే లేరు. ఇటీవల పులివెందులలో ఒక దళిత యువకుడిని దారుణంగా చంపేశారు. రాష్ట్రంలో నమోదు చేసుకున్న 60 నుంచి 70 నేరాల గురించి పూర్తి ఆధారాలతో ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు వార్తా కథనాలను ప్రచురించాయి. అయినా చర్యలు శూన్యం. ఒక్క సాక్షి దినపత్రికలో మినహాయించి మిగతా అన్ని దినపత్రికలు క్రైమ్ కథనాలను ప్రచురిస్తూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి తరచూ నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనార్టీలని అంటూనే ఉంటున్నప్పటికీ అదే సామాజిక వర్గాలపై దాడులు కొనసాగుతున్నాయి.

బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన వారిని లారీ తోనో, ట్రాక్టర్ తోనే తొక్కించి చంపి వేస్తున్న ఘటనలను చూస్తూనే ఉన్నాము. వాటిని పోలీసులు ప్రమాదకర కేసులుగా నమోదు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తుచ్చమైన రాజకీయ నేతల సేవలో పోలీసులు తరిస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని పైకి పంపిస్తున్నారు. పార్టీలకతీతంగా బిసి, ఎస్సీ సామాజిక వర్గాలపై దాడులు కొనసాగుతున్నాయి. సజీవ దహన ఘటనకు గురైన అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పరామర్శించాలని నిర్ణయించుకున్నారు.

ప్రభుత్వం ఆయన్ని అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు అనుమతి ఇస్తుందా?, లేదా?? అన్నది ప్రశ్నార్థకమే. సోషల్ మీడియాలో మా పార్టీ కి అనుకూలంగా మాట్లాడుతూ.. ట్విట్లు చేసే ఒక వెధవ, అమర్నాథ్ గౌడ్ తనకు తానే పెట్రోల్ పోసుకోగా, ఆయన అక్కే తమకు అడ్డంగా ఉన్నాడని వెంకటేశ్వర్ రెడ్డిని సజీవ దహనం చేయాలని చెప్పిందని పేర్కొనడం సిగ్గుచేటు. నెల్లూరులో వెంకట రమణారెడ్డి ఇంటిపై కొంతమంది వ్యక్తులు దాడి చేయగా, పోలీసులు వారిపై చర్యలు తీసుకోకపోగా సమర్ధింపు వ్యాఖ్యలు చేయడం విస్మయాన్ని కలిగించింది.

వెంకట్ రమణారెడ్డి పేరున్న వ్యక్తి కావడంతో ఆయనపై దాడి చేసినట్లుగా నటిస్తే, తమకు కూడా పేరు వస్తుందని మాత్రమే దాడి చేసినట్లుగా అభినయించారని పోలీసులు పేర్కొనడం చూస్తే వారు అన్నం తింటున్నారా?… గడ్డి తింటున్నారా? అన్నది అర్థం కావడం లేదు. మా పార్టీ వెధవల బుద్ధి తెలిసే, వెంకట్ రమణారెడ్డి తన పక్కనే అనుచరులను పెట్టుకున్నారు. నెల్లూరు కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి పై పేరు కోసం ఇదే చిలిపి దాడి ఎవరైనా చేస్తే పోలీసులు కేసులు పెట్టకుండా ఊరుకుంటారా?, అని ప్రశ్నిస్తూనే… ప్రజలు అసహ్యించుకుంటారని భావన కూడా లేకుండా పోలీసుల సమర్ధింపు వ్యాఖ్యలు ఉన్నాయని రఘు రామ కృష్ణంరాజు మండిపడ్డారు.

కులం చూడం అంటూనే చూసేది అదే
కులం చూడం… మతం చూడం అంటూనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూసేది కులమేనని మరోసారి స్పష్టమైందని రఘు రామకృష్ణంరాజు వెల్లడించారు. గత రెండు రోజుల క్రితం ప్రభుత్వం రెండు నియామకాలను ప్రకటించింది. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ సభ్యుడిగా పివిఆర్ రెడ్డి నియమించింది. ముగ్గురు సభ్యులు కలిగిన ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ లో ఇప్పటికే ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సభ్యుడు ఉండగా, మరొక వ్యక్తిని అదే సామాజిక వర్గం నుంచి నియమించడంలో ఆంతర్యం ఏమిటి?

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జైల్లో ఉన్న మా పార్టీ కార్యదర్శి శివ శంకర్ రెడ్డి వియ్యంకుడు పద్మా జనార్దన్ రెడ్డి ని సెంట్రల్ డిస్కం చైర్మన్ గా గతంలో నియమించారు. ఆయనకు రెండుసార్లు పదవిని పొడిగించారు. రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు పనులు చేసిన కంపెనీలకు బిల్లులను చెల్లించింది. బిల్లులన్నీ ఒకే సామాజిక వర్గానికి చెందిన కంపెనీల యజమానులకు చెల్లించడమే ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఎందుకంటే తరచూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కులం చూడం… అంటూనే, అదే కులాన్ని పరిగణలోకి తీసుకొని బిల్లులు చెల్లించినట్లుగా కనిపిస్తోంది. పనిచేసిన వారికి బిల్లులు చెల్లించడం తప్పేమీ కాదు కానీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన 1500 కోట్ల రూపాయలలో 750 కోట్ల రూపాయలు చిన్నాచితక కాంట్రాక్టర్ లతోపాటు గ్రామాలలో సొంత నిధులతో పనులు చేసిన సర్పంచులకు కూడా చెల్లించి ఉంటే బాగుండేది.

పి ఎల్ ఆర్ ఇన్ఫ్రా కు 600 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించింది. ఈ కంపెనీ మా పార్టీ లోక్ సభ పక్ష నాయకుడు మిథున్ రెడ్డి కి చెందిన కంపెనీ. రాఘవ కన్స్ట్రక్షన్స్ 300 కోట్ల చెల్లించింది. ఈ కంపెనీ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందినది. ఎం ఆర్ కె ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీకి 250 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించింది. ఈ కంపెనీ యజమాని మేడ మల్లికార్జున్ రెడ్డి. మా పార్టీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కంపెనీకి 185 కోట్ల రూపాయల బకాయిలను ప్రభుత్వం చెల్లించింది. మాక్స్ ఇన్ఫ్రా అనే కంపెనీ యజమాని ఫణి కుమార్ రెడ్డికి 50 కోట్ల రూపాయల బకాయిలను ప్రభుత్వం చెల్లించింది.

ఈ జాబితాలో మెగా ఇంజనీరింగ్ కంపెనీ పేరు లేకపోవడం పట్ల అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే మెగా ఇంజనీరింగ్ కంపెనీ వంటి సంస్థ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అడ్వాన్సులను తీసుకొని పనులు చేస్తుందని, పనులు చేసిన తరువాత బిల్లుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఆ సంస్థ యాజమాన్యానికి ఎదురు కాదని రఘురామకృష్ణం రాజు అన్నారు.

అంతిమ విజయం సునీతదే… రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఆమెకు ఉన్నాయి
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎనిమిదవ నిందితుడు అవినాష్ రెడ్డికి, సిబిఐ కి సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సిబిఐ కి, అవినాష్ రెడ్డికి సునీత తరపు న్యాయవాదులు కూడా నోటీసులు అందజేసేలా ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

సిబిఐకి, అవినాష్ రెడ్డికి గత ధర్మాసనం నోటీసులు ఇచ్చేందుకు విముఖతను ప్రదర్శించింది. అయితే, జస్టిస్ సూర్యకాంత్, ఎం ఎం సుందరేషన్ ధర్మాసనం సిబిఐ, అవినాష్ రెడ్డికి నోటీసులను జారీ చేస్తూ, జులై మూడవ తేదీకి కేసు వాయిదా వేసింది. జులై మూడవ తేదీన ఈ కేసు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచుముందుకు రానుంది. గతంలో తెలంగాణ హైకోర్టు మద్యంతర ముందస్తు బెయిల్ జారీ చేయడాన్ని, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ కొట్టివేసింది. మీడియా వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ జారీ చేస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఈ ముందస్తు బెయిల్ చెల్లుతుందా?, లేదా?? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో మద్యంతర ముందస్తు బెయిల్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ కే, ఈ కేసు రావడం జరిగింది. సోమవారం నాడు కోర్టు విచారణకు సీబీఐ హాజరు కాలేదు. అవినాష్ రెడ్డి పెదవి విప్పడం లేదని ఆయనని కస్టడీకి ఇవ్వాలని గతంలో హైకోర్టును కోరిన సిబిఐ, రేపు సుప్రీం కోర్టు ముందస్తు బెయిల్ రద్దు చేస్తే అరెస్టు చేస్తుందా?, వైయస్ వివేక హత్య కేసు విచారణ ఈనెల 30వ తేదీలోగా పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు గడువు నిర్దేశించింది.

అయితే ఈ గడువు సమయాన్ని పొడిగించాలని కోరే అవకాశాలు ఉన్నాయి. వైయస్ వివేక హత్య అనంతరం ఆయన వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డి తెలియజేయకముందే జగన్మోహన్ రెడ్డికి తెలుసునని సిబిఐ తన కౌంటర్ అఫిడవిట్లో పేర్కొంది. వైయస్ జగన్మోహన్ రెడ్డి ని, వైయస్ భారతి రెడ్డి ఫార్మాలిటీ కోసమైనా సిబిఐ ప్రశ్నించాలి. వారి స్టేట్మెంట్లను రికార్డు చేయాలని రఘు రామ కృష్ణంరాజు తెలిపారు.

ఒక ఎంపీ ని అపహరించి లాకప్ లో చిత్రహింసలకు గురిచేసిన వ్యవస్థలో, మరొక ఎంపీ కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసి సెటిల్మెంట్ చేసుకునే వ్యవస్థలో ఎన్నో అవస్థలు పడుతూ న్యాయ పోరాటం చేస్తున్న డాక్టర్ సునీతదే అంతిమ విజయం. రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఆమెకు ఉన్నాయి. మహిళ అనే పదానికి గర్వకారణం సునితా రెడ్డి అని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE