Suryaa.co.in

Andhra Pradesh

ఆర్థిక సునామీ అంచున ఆంధ్రప్రదేశ్

భారతదేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్రమోదీ గారికి నమస్కారములు.

అయ్యా,
భారతదేశాన్ని, ఆంధ్రప్రదేశ్ ను ఆర్థిక సునామీ నుండి కాపాడండి.

రెండు తెలుగు రాష్ట్రాలు ఆర్థికంగా గడ్డుపరిస్థితులు ఎదుర్కోబోతున్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి. కేసీఆర్ గారు ఏదో ఒకరకంగా ప్రస్తుతానికి మ్యానేజ్ చేస్తున్నట్లు కనపడుతోంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు చాలా ఆందోళనకరంగా ఉన్నాయంటున్నారు. ఇప్పటికే చేయి దాటిపోయింది.

శ్రీలంకలో వచ్చిన ఆహార సంక్షోభం, ఆర్థిక సంక్షోభం, రాజకీయ సంక్షోభం చూసి ఉలిక్కిపడ్డ మన ప్రధాని నరేంద్రమోడీ గారు, కేంద్ర ఆర్థిక కార్యదర్శి మరియు ఇతర సీనియర్ IAS అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి, దేశంలోని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై నివేదిక ఇవ్వమని కోరారు. కేంద్ర కార్యదర్శులు ఇచ్చిన నివేదికలో విస్తుగొలిపే వాస్తవాలు బయటకు వస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక పతనం అంచున వున్నదని, తర్వాత స్థానాల్లో పంజాబ్, ఢిల్లీ, తెలంగాణా ఉన్నట్లు వారు నివేదిక ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణా గురించి కూడా వినాల్సి రావడం బాధగా ఉంది. గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ గారు అయినా, ప్రస్తుతం ఉన్న తన్నీరు హరీశ్ రావు గారు అయినా అత్యంత సమర్థువంతమైన నాయకులు. నీటిపారుదల ప్రాజెక్టులకు భారీ స్థాయిలో నిధులు ఖర్చు చేసినారు. ఇది ఒక కారణం కావచ్చు. తెలంగాణా రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతోంది. విద్యా, వైద్య రంగాల బలోపేతానికి కృషి జరుగుతున్నట్లు కనబడుతోంది. భవిష్యత్తు లో రైతుబంధు, దళితబంధు పథకాలు గుడిబండలుగా మారవచ్చు. ఈ రెండు పథకాలను సంస్కరించి అమలు చేయకపోతే, పులిపై స్వారీ చేసినట్లే. ఉచిత పథకాలు వీలున్నంత వరకు అపుచేయక పోతే, రాబోయే రోజుల్లో తెలంగాణా కూడా ప్రమాదంలో పడవచ్చు.

దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో జరగని విధంగా, ఆంధ్రప్రదేశ్ ఆదాయ, వ్యయాలు, అప్పులు, ఆర్థిక నిర్వహణ, అవకతవకలు, కేంద్ర నిధులు దారి మళ్లించడం లాంటి అనేక విషయాలను సమగ్రంగా, లోతుగా పరిశీలించి నివేదిక ఇవ్వడానికి ‘ ఫోరెన్సిక్ ఆడిట్ ‘ కొరకు CAG ద్వారా కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలుస్తోంది. గత ఆరునెలల నుండీ చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక అత్యవసర పరిస్థితి అమలుకు సిద్ధంగా ఉందని. కేంద్రం ఎందుకు తాత్సారం చేసినట్లు. గౌరవ ప్రధాని శ్రీలంక దేశంలో చోటుచేసుకున్న పరిణామాలు చూసిన తర్వాత మాత్రమే ఎందుకు స్పందించారు.

గౌరవ కేంద్ర ఆర్థిక మంత్రి ఏం చేస్తున్నట్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అధ్యక్షుడు పయ్యావుల కేశవ్ గారు కొన్ని నెలల క్రితమే రాష్ట్రంలో 42,000 కోట్ల రూపాయలకు లెక్కలు లేవని, పెద్ద ఎత్తున్న నిధుల దారి మల్లింపు, దుర్వినియోగం జరిగింది అని హెచ్చరించారు. ఒక సీనియర్ జర్నలిస్ట్ అభిప్రాయపడ్డారు. అటల్ బిహారీ వాజ్ పాయ్ గారు ప్రధానిగా ఉండగా, వారి క్యాబినెట్ లో ఆర్థికమంత్రి గా యశ్వంత్ సిన్హా గారు అత్యంత సమర్ధవంతంగా విధులు నిర్వహించారు.

ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నారు, ఒకప్రక్క RBI హెచ్చరిస్తున్నప్పటికీ, ఆర్ధికంగా కుప్ప కూలుతున్న ఆంధ్రప్రదశ్ కు పరిమితిని మించి అప్పులకు ఎందుకు అనుమతులు ఇచ్చినట్లు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి చంద్రబాబు గారి పాలనలో చేసిన అప్పులతో సహా, 2019 నాటికి, ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు మూడున్నర లక్షల కోట్లు ఉంటే, ఇపుడు అది కాస్తా ఇపుడు మొత్తం ఎనిమిది లక్షల కోట్లు అయింది అంటున్నారు.

అంటే చంద్రబాబు గారి ఐదు సంవత్సరాల పాలనా కాలంలో రెండున్నర లక్షల కోట్లు అప్పు చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారి రెండున్నర సంవత్సరాల పాలనలో ఐదు లక్షల కోట్లు అప్పు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఎందుకు అనుమతులు ఇస్తున్నట్లు. రాజకీయ అవసరాల కొరకేనా. కేంద్రం జవాబు చెప్పాలి.
శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఉన్నత విద్యావంతురాలు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ప్రతిష్ఠాత్మక సంస్థలో చదువుకున్నారు. ఎందుకు శ్రద్ద పెట్టలేక పోయారు?

ఫోరెన్సిక్ ఆడిట్ లో అవకతవకలు రుజువైతే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి రావత్ గారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రావత్ గారు సమర్థవంతుడైన సీనియర్ IAS అధికారి. కాకపోతే వీరికి ఆర్థిక విషయాలపై పెద్దగా పట్టు లేదంటున్నారు. ఫోరెన్సిక్ ఆడిట్ లో నిధుల దుర్వినియోగం జరిగినట్లు రుజువైతే, రాష్ట్రానికి ఎలాంటి ఇబ్బంది ఉంటుంది. రాబోయే రోజుల్లో , కేంద్ర నిధులకు భారీ ఎత్తున కోత పడుతుంది . (ఇప్పటికే అనేక కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేక పోవడం వల్ల, ఆయా పథకాల నిధులు వెనక్కి వెళ్లిపోతున్నాయి). అప్పుడు పరిస్థితి ఏమిటి?

వస్తున్న ఆదాయం వడ్డీలకు సరిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు, నవరత్నాలకు డబ్బులు ఎక్కడ తెచ్చి ఇస్తారు. విద్యుత్, విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు …. మొదలగు కీలకమైన రంగాల భవిష్యత్తు ఏమిటి. ఒక రాష్ట్ర స్థాయి ఉద్యోగ సంఘ నాయకుడు అంటున్నట్లు, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులు, పెన్షనర్స్ కు వేతనాలు 3 లేదా 4 నెలలకు ఒకసారి మాత్రమే ఇవ్వగలరు. అది కూడా ఇచ్చే మొత్తంలో కొంత కోత పడే ప్రమాదం ఉంది అని. ఒకప్పుడు బీహార్ లో ఇదేవిధంగా ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయినా ఏమీ చేయలేడు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు లేదా నరేంద్రమోదీ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా పనిచేసినా, రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం చాలా కష్టమైన పని అంటున్నారు.

కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఏమిటి ?
అత్యవసరంగా అఖిల పక్ష సమావేశం నిర్వహించి, దేశంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీల నాయకులతో సమగ్రంగా చర్చించడం, సానుకూలత రాకపోతే ఉచిత హామీలకు కళ్లెం వేసేందుకు పార్లమెంట్ లో సమగ్ర చట్టం చేయడం. అప్పటివరకు రాష్ట్రాలు విపరీతంగా అప్పులు చేయకుండా, నిబంధనలు కఠినతరం చేయడం. దేశ హితం కోసం అందుబాటులో ఉన్న అన్ని మార్గాలు అన్వేషించాలి అని ప్రార్థిస్తూ..
ఒక సాధారణ పౌరుడు…

– వై.వెంకటేశ్వర్లు , ఖమ్మం

LEAVE A RESPONSE