– రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు హర్షం
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ 2026–27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి గణనీయంగా దోహదపడే విధంగా ఉందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు తెలిపారు. ఈ బడ్జెట్ రాష్ట్ర భవిష్యత్తు ఆర్థిక పురోగతికి బలమైన పునాదిని వేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
డేటా సెంటర్ల ఏర్పాటుకు పన్ను ప్రోత్సాహకాలు కల్పించడం, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి బలమైన మద్దతు ఇవ్వడం, క్రిటికల్ మినరల్స్ కారిడార్ ఏర్పాటు వంటి కీలక నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో ప్రయోజనకరంగా మారనున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానానికి ఈ బడ్జెట్ మరింత సహకారం అందిస్తోందని అన్నారు.
ప్రత్యేకించి విశాఖపట్నంలో గూగుల్ సహా పలు అంతర్జాతీయ సంస్థలు డేటా సెంటర్లు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్న తరుణంలో, డేటా సెంటర్లకు 2047 వరకు పన్ను మినహాయింపులు కల్పించడం రాష్ట్రానికి మైలురాయిగా నిలుస్తుందని సానా సతీష్ బాబు అన్నారు.
అలాగే, డెడికేటెడ్ రేర్ ఎర్త్ (అరుదైన ఖనిజాల) కారిడార్‌లో ఆంధ్రప్రదేశ్‌ను చేర్చడం ద్వారా రాష్ట్రానికి విస్తృత అవకాశాలు లభిస్తాయని తెలిపారు. బీచ్ సాండ్‌తో పాటు రాష్ట్రంలో లభ్యమయ్యే వివిధ రకాల ఖనిజాల వెలికితీత ద్వారా ఉపాధి అవకాశాలు పెరిగి, రాష్ట్ర ఆర్థిక స్థితి మరింత బలోపేతం అవుతుందని అన్నారు.
కొబ్బరి ఉత్పత్తుల కోసం ప్రత్యేక ప్రోత్సాహక పథకం, తీర ప్రాంతాల్లో కొబ్బరి గంధం చెట్ల సాగుకు మద్దతు, ఖేలో ఇండియా మిషన్‌లో భాగంగా క్రీడల అభివృద్ధి, 15 పురావస్తు ప్రాంతాల అభివృద్ధి వంటి అంశాలు రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహదపడతాయని చెప్పారు.
పేదలు, బలహీన వర్గాలు, దళితులు, ఆదివాసీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సామాజిక సమానత్వానికి దారి తీస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్పష్టంచేశారని ఆయన గుర్తు చేశారు.
మొత్తంగా ఈ కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించే దిశగా ఉందని, రాష్ట్ర ప్రజల ఆశయాలను ప్రతిబింబించే బడ్జెట్‌గా నిలుస్తుందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు హర్షం వ్యక్తం చేశారు.