– ఎంపీ కుటుంబ సభ్యులనే కిడ్నాప్ చేయడం క్షీణించిన శాంతిభద్రతలకు నిదర్శనం
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు
భూకబ్జాలు, సెటిల్‌మెంట్లు, పేకాట క్లబ్బులు, లిక్కర్ మాఫియాతో విశాఖ ప్రతిష్టను జగన్ రెడ్డి దిగజారుస్తున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసి 24 గంటలపాటు నిర్భంధించి డబ్బు డిమాండ్ చేశారంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలకు ఈ సంఘటన అద్దం పడుతుంది.
వైసీపీ ఎంపీ భార్య, కుమారుడితో పాటు ఆడిటర్‌ను కూడా కిడ్నాప్ చేయడంపై హోంమంత్రి, ముఖ్యమంత్రి, డీజీపీ ఎందుకు మౌనంగా ఉన్నారు? కిడ్నాప్ విషయాన్ని బయటకు రాకుండా రహస్యంగా దాచాల్సిన అవసరం ఏంటి? ఆర్థిక నగరంగా ఎదగాల్సిన విశాఖపట్నాన్ని క్రైం కేపిటల్‌గా మార్చారు. రికార్డును తారుమారు చేస్తూ, భూములను బలవంతంగా లాక్కుంటూ ల్యాండ్ మాఫియా కేంద్రంగా ఉత్తరాంధ్రను వైసీపీ నేతలు మార్చారు.
భూకబ్జాలు, భూకుంభకోణాలపై మీడియాలో ప్రతిరోజూ కథనాలు వస్తున్నా ప్రభుత్వం ఒక్క రోజు కూడా స్పందించిన దాఖలాల్లేవు. స్పందిస్తే ఇలాంటి ఘటనలు జరిగేవా. ఉత్తరాంధ్రలో ఈ నాలుగేళ్లలో జరిగినన్ని కుంభకోణాలు దేశంలో ఎక్కడా జరిగి ఉండవు. రైతు తన భూమిలో సాగు చేస్తుండగానే అతనికి తెలియకుండా ఆ భూమిని వేరే వారి పేరుతో రికార్డులు మారిపోయిన ఘటనలు ఉత్తరాంధ్రలో చోటు చేసుకున్నాయి.
జగన్ రెడ్డి పాలనలో ప్రకృతి సృష్టించిన విపత్తులు సృష్టించిన బీభత్సం కంటే.. వైసీపీ నేతలు చేసిన ఆగడాలే ఎక్కువ. గత 4 సంవత్సరాలుగా విశాఖ సహా ఉత్తరాంధ్రలో జరిగిన భూలావాదేవీలపై సమగ్ర విచారణ జరిపించాలి. తాజాగా చోటు చేసుకున్న ఘటనకు ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యం, దోపిడీలే కారణం.