– కేసీఆర్ ని కలిసిన సందర్భంగా.. మాజీ మంత్రి జీవన్ రెడ్డి భావోద్వేగం.
– ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి కి ఘన స్వాగతం పలికిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు
ఎర్రవెల్లి: బిఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్ రావు తో ఎర్రవెల్లి నివాసంలో, మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి..శుక్రవారం మర్యాదపూర్వక భేటీ అయ్యారు. నివాసానికి చేరుకున్న జీవన్ రెడ్డికి, పుష్పగుచ్ఛాలందించి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు.
నిరంతరం తన నియోజకవర్గం, జిల్లా ప్రజలు, రైతుల గురించి ఆలోచన చేసే రైతు నాయకుడు, తెలంగాణ తనానికి దర్పణంగా నిలిచే మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి., తెలంగాణ సాధకుడు రైతు బాంధవుడు బిఆర్ఎస్ అధినేత కెసీఆర్ కలయిక సందర్భంగా భావోద్వేగ వాతావరణం నెలకొంది.
కేసీఆర్ ని కలిసిన సందర్భంగా జీవన్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు.
‘‘తెలంగాణకు నష్టం జరుగుతున్న సమయంలో మీతో కలిసి పనిచేయాల్సిన అవసరమున్నదని, మీతో కలిసి పనిచేయమని దేవుడే నన్ను మీదగ్గరికి పంపించిండు..అన్నా. చాలా గ్యాప్ తర్వాత ఇన్నాల్లకైనా మీతో కలిసిపనిచేసే అవకాశం రావడం సంతోషంగా వుంది అన్నా..’’ అంటూ తన మనసు మాటను భావోద్వేగంతో మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యక్తం చేశారు.
కాగా జీవన్ రెడ్డిని అనునయిస్తూ, వారిని అప్యాయంగా దగ్గరికి తీసుకున్న కేసీఆర్ హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకొని, దుశ్శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానించారు. కాసేపు ఇష్టాగోష్టి తర్వాత జీవన్ రెడ్డి బృందాన్ని లంచ్ ఆతిధ్యానికి కేసీఆర్ ఆహ్వానించారు.
వారివెంట మాజీ మంత్రులు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే డా. కె.సంజయ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కె. విద్యాసాగర్ రావు, పార్టీ నేతలు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి తదితరులున్నారు. జీవన్ రెడ్డి తోపాటు వచ్చిన వారిలో, వారి కుమారులు, జగిత్యాల మాజీ జడ్పీ చైర్ పర్సన్ వసంత సురేశ్ దంపతులు తదితరులున్నారు.