-పారిశ్రామికవేత్తలు, బ్యాంకర్లకు మధ్య వారధిగా ఏపీఐఐసీ
-యూనియన్ బ్యాంకుతో ఏపీఐఐసీ కీలక ఒప్పందం
-ఎమ్ఎస్ఎమ్ఈ పారిశ్రామికవేత్తలకు తక్షణ రుణ సదుపాయం
అమరావతి, జూలై, 18 : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మార్గనిర్దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలకు పెద్ద మేలు చేసే దిశగా ఏపీఐఐసీ మరో కీలక ఒప్పందం చేసుకుందని వీసీ, ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది వెల్లడించారు. ఎమ్ఎస్ఎమ్ఈ పరిశ్రమలకు రుణ సదుపాయంలో ఎదురయ్యే ఇబ్బందులను తొలగించేందుకు యూనియన్ బ్యాంకుతో ఏపీఐఐసీ ఎంవోయూ కుదుర్చుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఒప్పంద పత్రాలపై ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది, యూనియన్ బ్యాంకు/ ఎస్ఎల్ బీసీ లీడ్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్, బ్రహ్మానందరెడ్డి సంతకాలు చేసి ఎంవోయూలని పరస్పరం ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఏపీఐఐసీ మంగళగిరి కార్యాలయంలో జరిగిన ఎంవోయూ సందర్భంగా ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది మాట్లాడుతూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ స్టార్టింగ్ బిజినెస్ పై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు తెలిపారు.
తొలి దశలో ఏపీఐఐసీ గుర్తించిన 39 ఇండస్ట్రియల్ పార్కులలోని ఎమ్ఎస్ఎమ్ఈలకు, వాటిని ప్రారంభించడంలో అవసరమైన రుణ సదుపాయం కల్పించడంలో యూనియన్ బ్యాంకు కీలక భాగస్వామ్యం కానుందని పేర్కొన్నారు. తొలి విడత ప్రగతిని అంచనా వేసుకుని మలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పారిశ్రామిక పార్కులలోని పారిశ్రామికవేత్తలకు కూడా ఈ వెసులుబాటు కల్పించే దిశగా కలిసి ముందుకు సాగుతామన్నారు. అంతకు ముందు పత్రాల వెరిఫికేషన్ , నియమ నిబంధనలు వంటి కారణాలతో లోన్ మంజూరులో జాప్యం జరిగేది. ఇపుడు ఇక ఆ ఇబ్బందులు లేకుండా దరఖాస్తు చేసుకున్న 10 రోజులలో రుణం పొందేలా ఒప్పందం చేసుకున్నట్లు స్పష్టం చేశారు.
అందుకు సంబంధించి జిల్లాకు ఒకరు చొప్పున 26 జిల్లాలలో యూనియన్ బ్యాంకు నుంచి 26 మంది నోడల్ ఆఫీసర్లని, ఏపీఐఐసీ నుంచి కూడా కొంత మంది అధికారులతో టీమ్ ని ఏర్పాటు చేయనున్నట్లు ఎండీ తెలిపారు. ఈ సదుపాయం గురించి పారిశ్రామికవేత్తలకు అవగాహన కలిగించేలా ప్రత్యేక సదస్సులు ఏర్పాటు చేయాలని , ఆయా జోన్లలో ప్రత్యేక స్టాల్ ని ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు. పారిశ్రామికవేత్తలకు , బ్యాంకర్లకు ఏపీఐఐసీ వారధిగా నిలుస్తూ ముఖ్య భూమిక పోషించనుందన్నారు. ఇటీవల “వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం”లో భాగంగా ఎస్సీ,ఎస్టీ పారిశ్రామికవేత్తలకు చెందిన 500కు పైగా పరిశ్రమలు తిరిగి ప్రారంభించుకోవడంలో ఏపీఐఐసీ కీలక పాత్ర పోషించిందన్నారు.
ఒక మంచి పని మొదలైనపుడు కొన్ని ఇబ్బందులు రావడం సహజమని, వాటిని అధిగమించి ఈ ఒప్పందాన్ని ఒక శక్తిగా మార్చడంలో అందరూ కలిసి ముందడుగు వేయాలన్నారు. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో మీ అందరి పాత్ర కూడా ఉండేలా మీ ముద్ర వేసేలా ఒక్కటిగా కలిసి పని చేయాలన్నారు.
ప్రభుత్వం, ఏపీఐఐసీతో పని చేయడం గొప్ప అవకాశం: యూనియన్ బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్ బ్రహ్మానందరెడ్డి
ప్రభుత్వం, ఏపీఐఐసీతో ఎంవోయూ కుదర్చుకోవడం మాకు గొప్ప అవకాశమని ఆ బ్యాంకు సీజీఎం బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. ఎమ్ఎస్ఎమ్ఈలు లేనిదే జీవితమే లేదన్నారు. ఉదయం నిద్ర మేల్కొన్నప్పటి నుంచి రాత్ర పడుకునే వరకూ ప్రతీ వస్తువును తయారు చేసే ఎమ్ఎస్ఎమ్ఈలకు, పారిశ్రామికవేత్తలకు రుణ సదుపాయంలో అండగా నిలవడం సంతోషంగా ఉందన్నారు. లోన్ ల విషయంలో పారిశ్రామికవేత్తలకు జాప్యం రాకుండా చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేలా తోడ్పాటునందిస్తామని బ్రహ్మానందరెడ్డి తెలిపారు.
యూనియన్ బ్యాంకు, ఏపీఐఐసీ మధ్య జరిగిన ఎంవోయూ కార్యక్రమంలో ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సుదర్శన్ బాబు, రాజేంద్రప్రసాద్, ఓఎస్డీ ల్యాండ్స్ సాధన, సీజీఎం సుబ్బారెడ్డి(ఫైనాన్స్), సీజీఎం జ్యోతి బసు (పర్సనల్, అడ్మిన్), కంపెనీ సెక్రటరీ శివారెడ్డి, జీఎం గెల్లి ప్రసాద్(అసెట్ మేనేజ్ మెంట్), అడ్మిన్ విభాగం జీఎం క్రిష్ణ ప్రసాద్, సిడ్బి కో ఆర్డినేటర్, యూనియన్ బ్యాంకు ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.