-నిబంధనల ఉల్లంఘన పేరుతో నోటీసులు జారీ
-వారం రోజుల్లో సమాధానం ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటామని బాలానగర్ ఏసీపీ పేరుతో నోటీసులు
-ప్రజా స్పందనను చూసి ఓర్వలేక పాదయాత్రను అడ్డుకునే కుట్రలో భాగమే నోటీసులు : పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి
-ఎన్ని అడ్డంకులు స్రుష్టించినా పాదయాత్ర ఆగదు…
-అవసరమైతే న్యాయపోరాటం చేస్తామన్న మనోహర్ రెడ్డి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన ‘‘ప్రజా సంగ్రామ యాత్ర’’కు కనీవినీ ఎరగని రీతిలో విశేష స్పందన వస్తుండటంతో టీఆర్ఎస్ ప్రభుత్వం పాదయాత్రను అడ్డుకునేందుకు మరో కుట్రకు తెరదీసింది. నిబంధనలు ఉల్లంఘించారంటూ నోటీసులు జారీ చేసింది. పాదయాత్రలో డీజే సౌండ్ ఉపయోగించారని, మోటార్ సైకిళ్లను వాడారని, రాత్రి పొద్దుపోయేదాకా పాదయాత్ర చేశారని పేర్కొంటూ విచిత్రమైన అంశాలను జోడిస్తూ బాలా నగర్ ఏసీపీ పేరుతో పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో… తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన వివిధ పార్టీల నేతలు ఎన్నో పాదయాత్రలు చేశారు. వారిలో ఏ ఒక్కరికీ ఇలాంటి నిబంధనలు విధించలేదు. ఎవరికీ నోటీసులు కూడా జారీ చేసిన దాఖలాల్లేవు. ఆశ్చర్యంగా బండి సంజయ్ పాదయాత్రకు మాత్రం కేసీఆర్ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు స్రుష్టిస్తోంది.
వాస్తవానికి తొలి మూడు పాదయాత్రలకు అసలు లిఖిత పూర్వకంగా అనుమతి ఇవ్వనేలేదు. మౌఖిక అనుమతి మాత్రమే ఇచ్చారు. కానీ పాదయాత్రకు విశేష స్పందన లభిస్తుండటం.. ఊరూవాడాసహా ఎక్కడికి వెళ్లినా బండి సంజయ్ ను ఆదరిస్తూ తమ కష్టాలు సుఖాలు పంచుకోవడంతోపాటు తమ వాడిగా ప్రజలు భావిస్తుండటంతో టీఆర్ఎస్ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
పలు చోట్ల పాదయాత్రను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ నేతలు ధర్నాలు, ఆందోళనల పేరుతో చేయని ప్రయత్నం లేదు. చివరకు దాడులకు కూడా తెగబడ్డారు. అలంపూర్, దేవరుప్పల ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తున్న సమయంలో అకారణంగా టీఆర్ఎస్ గూండాలు బీజేపీ కార్యకర్తల తలలు పగలకొట్టారు. తిరిగి బీజేపీ నేతలపైనే కేసులు పెట్టారు.
అదే సమయంలో పాదయాత్రకు అనుమతి లేదంటూ బండి సంజయ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కరీంనగర్ లో గ్రుహ నిర్బంధం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అరాచకాలు, అప్రజాస్వామిక పోకడలను సవాల్ చేస్తూ బీజేపీ లీగల్ సెల్ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ, పోలీసుల తీరును తప్పుపట్టిన రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం పాదయాత్రకు అనుమతి ఇవ్వడంతో మూడో విడత సాఫీగా సాగింది.
తిరిగి నాలుగో విడత పాదయాత్ర కు బీజేపీ నాయకులు దరఖాస్తు చేయడంతో ఎన్నికల సమయంలో విధించే నిబందనలన్నీ వర్తింపజేస్తూ పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. తాజాగా 4వ విడత పాదయాత్ర రేపు పూర్తి కాబోతుంది. ఈ నేపథ్యంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ తరుణంలో ఈరోజు బాలా నగర్ ఏసీపీ పేరుతో ప్రభుత్వం పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోపు సంజాయిషీ ఇవ్వాలని, లేనిపక్షంలో తగిన చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొంది.
బండి సంజయ్ పాదయాత్రకు విశేష స్పందన వస్తుండటంతో కేసీఆర్ ఫ్రభుత్వం ఓర్వలేకపోతోందని మనోహర్ రెడ్డి మండిపడ్డారు. సర్కార్ ఎన్ని అడ్డంకులు స్రుష్టించినా పాదయాత్రను ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. త్వరలో 5వ విడత పాదయాత్ర షెడ్యూల్ ను కూడా ప్రకటించబోతున్నట్లు ప్రకటించారు. పోలీసుల నోటీసులకు సమాధానమిస్తామని… అవసరమైతే న్యాయపోరాటం చేసేందుకు వెనుకాడబోమని తెలిపారు.