– ముస్లిం..క్రైస్తవ ‘కుల’గణన మాటేమిటి?
– క్రైస్తవ, ముస్లిం మతాల్లోనూ ఉప కులాలు
– క్రైస్తవులలో 16 ఉప కులాలు
– ముస్లింలలో 16 ఉప కులాలు
– హిందువులలో 18 కులాలు
– కులగణనలో వాటిని లెక్కించరేం?
– హిందూమతంలో కులాలకే పరిమితమా?
– హిందువులది కులం.. ముస్లిం-క్రైస్తవలుది మతమా?
– వారిలోని ఉప కులాలపై సరికొత్త చర్చ
– సర్కారుది డివైడ్ హిందూ..యునైట్ అదర్స్ సూత్రమా?
– సోషల్‌మీడియాలో హిందూ సంస్థల ప్రచారపర్వం
– రేవంత్ సర్కారుకు మరో తలనొప్పి
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఇప్పటివరకూ కేవలం హిందూ మతంలోనే కులాలు ఉంటాయని భావిస్తున్న వారి కళ్లు తెరిపిస్తూ.. ఇటీవల సోషల్‌మీడియాలో తెరపైకి వస్తున్న కొత్త చర్చ, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి తలనొప్పిలా మారనుంది.
ఆ ప్రకారంగా ప్రస్తుతం కులగణన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. హిందూ మతంలోని కులాలతో పాటు, ముస్లిం-క్రైస్తవ మతాల్లోని ఉప కులాలను కూడా లెక్కించాలని, ఆ మేరకు ఫారంలో ఆప్షన్లు ఇవ్వాలన్న డిమాండ్ హిందూ సంస్థల నుంచి మొదలయింది. ‘‘ కేవలం హిందూమతంలోని కులాలను మాత్రమే లెక్కించి, క్రిస్టియన్లు-ముస్లింలను మాత్రం మతంగా లెక్కించడం ఏమిటి? ఆ రెండు మతాల్లోనూ బోలెడు ఉపకులాలున్నాయి కదా? వాటిని కూడా లెక్కించాలి కదా? అలా కాకుండా కేవలం హిందూ మతంలోని కులాలను మాత్రమే లెక్కించడం ద్వారా డివైడ్ హిందూ..యునైట్ అదర్స్ సూత్రాన్ని పాటించడమేనా కాంగ్రెస్ సిద్ధాంతం’ అని తెలంగాణ వీహెచ్‌పీ సీనియర్ నేత బాలస్వామి వ్యాఖ్యానించారు.
ముస్లిం-క్రైస్తవ మతాల్లోని ఉప కులాల లెక్కలు కూడా తేలిస్తేనే కులగణనకు సార్ధకం ఉంటుందన్న వాదన మొదలయింది. ఆ ప్రకారంగా ఆ రెండు మతాల్లోని ఉప కులాల జనాభాను తేలిస్తే, ఆయా మతాల సంఖ్య-ఉప కులాల స్వరూపం బయట ప్రపంచానికి తెలుస్తుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇది ఎవరికీ-ఏ మతానికీ వ్యతిరేకంగా చూడాల్సిన అవసరం లేదని, ఒకరకంగా ప్రభుత్వానికి మేలు చేసే కులగణనే అంటున్నారు.
దీని ద్వారా అసలు ముస్లిం-క్రైస్తవ మతంలో అసలు ఉప కులాలు ఉండవన్న భావన చెరిగిపోతుందని, అప్పుడు జనాభా దామాషా ప్రకారం.. ఆయా ఉప కులాల వారికి ప్రభుత్వం ఏమైనా సహాయం, పథకాలు అమలు చేసే అవకాశం ఉందన్న సూచన వ్యక్తమవుతోంది.
అలా కాకుండా కేవలం హిందూ మతంలోని కులాలను మాత్రమే లెక్కించి, క్రైస్తవ-ముస్లిం మతాల్లోని ఉప కులాలను లెక్కించకుండా వదిలేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం హిందువులను బలహీనులుగా చూపించే ప్రయత్నం చేస్తోందన్న విమర్శ ఎదుర్కోవలసి వస్తుందని, అటు కాంగ్రెస్ సీనియర్లు కూడా అభిప్రాయపడుతున్నారు.
ఈ వాదనకు సంబంధించి సోషల్‌మీడియాలో హిందూ సంస్థలు లేవనెత్తుతున్న చర్చ ఆసక్తికరంగా ఉంది. అదేమిటంటే..
తెలంగాణలో ‘కుల గణన’ మొదలైంది, అందులో ఉండే వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
01. అయ్యంగార్లు, అయ్యర్లు
02. బ్రాహ్మణులు
03. బౌధ్ధులు
04. క్రిస్టియన్లు (బిసి – సి లో లేనివారు)
05. జైనులు
06. కమ్మ, చౌదరి
07. కాపు / నాయుడు
08. కరణం
09. కోమటి / వైశ్య / గుప్తా / శెట్టి
10. క్షత్రియ / రాజులు
11. లింగాయతులు
12 మార్వాడీలు
13. ముస్లిములు (బి సి – ఈ లో లేనివారు)
14. పట్నాయక్
15. రెడ్డి
16. సిక్కులు
17. వర్మ
18. వెలమ
19 ఇతరులు
హిందూ సమాజాన్ని ఈ విధంగా కులాల వారీగా విభజించి, ఇతర మతాల వారిని మాత్రం ఒకటిగా చూపించడం వల్ల హిందువులలో అనైక్యత రేపడం స్కామ్‌గ్రెస్ ఆలోచన.
మరి ముస్లిమ్స్ లో కులాలు లేవా? ఈ విధంగా ఉన్నాయి చూడండి. ఇవి కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవి మాత్రమే.
01. మెహతర్
02. నూర్ బాషా
03. ఆరె కటిక, కటిక, ఖురేషీ (మాంస విక్రయం)
04. అచ్చుకట్లవాళ్ళు సింగాలి, సింగంవాళ్ళు, అచ్చు పనివాళ్ళు.
05. అత్తరు సాయిబులు, అత్తరోళ్ళు, బుక్కా ముస్లిమ్స్
06. ధోబీ ముస్లిమ్, తురక చాకలి, తుళుక్క వన్నన్
07. ఆల్వీ, షా ఆల్వీ, ఆలం, దర్వేష్, షా
08. గారడి సాయిబులు, కనికట్టువాళ్ళు, పాములవాళ్ళు, గారడిగ
09. గోసంగి, ఫకీర్ సాయిబు
10. గుడ్డి ఎలుగువాళ్ళు, ఎలుగుబంటివాళ్ళు, కీలు గుఱ్ఱాలవాళ్ళు
11. హజ్జామ్, నాయి, నాయీ ముస్లిమ్స్, నవీద్
12. లబ్బీ, లబ్బాయ్, లబ్బన్, లబ్బా
13. పకీర్లు, బోరేవాలాలు, డేరా పకీర్లు బొంతల వాళ్ళు
14. ఖురేషీ, కసబ్, మరాఠీ కసబ్
15. సిద్ది, యాబా, హబ్షి, జాసి
16. తురక కాశ, కక్కు కొట్టేవాళ్ళు, జింక సాయిబులు
వీళ్ళందరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో Resolution No.12011/68/93 – BCC (C) dt.16-01-1996, dt.10-09-1993, dt.13-01-2004 ప్రకారం ముస్లిమ్స్ లోని వివిధ కులాలుగా గుర్తించబడ్డారు..
వీళ్ళు కాక పఠాన్, పస్తూన్, ఖాన్, మోమిన్, అన్సారీ, షేక్ లేక సౌదాగర్, ఇరానీ, బోహ్రా, కచ్చి మెమోన్, జమాయత్, నవాయత్, సయ్యద్, చౌష్ – ఆరబ్ …. ఇంకా అనేక కులాలు ఉన్నాయి.
అలాగే క్రైస్తవులలో..
01. రోమన్ కాథలిక్కులు
02. ప్రొటెస్టెంట్లు
03. మలబార్ క్రిస్టియన్స్
04. కేథలిక్ సిరియన్స్
05. మలంకర సిరియన్
09. జాకోబైట్ క్రిస్టియన్
10. సి యస్ ఐ సిరియన్
11. మార్థో మా సిరియన్
12. పెంతెకోస్తు క్రిస్టియన్
13. ఇవలాంజికల్ క్రిస్టియన్
14. మలబార్ ఇండిపెండెంట్ సిరియన్
15. సైరో – మలబార్
16. సైరో – మలంకర్
వీళ్ళు కాక దళిత క్రిస్టియన్, నాడార్ క్రిస్టియన్లు – ఇలా అనేకమైనవి ఉన్నాయి.
పై చెప్పబడిన కులాలను కూడా ‘కుల గణన’లోకి తీసుకోవాలి కదా!
‘ డివైడ్ హిందూ..యునైట్ అదర్స్ ‘ ఇదే ఆ పార్టీ విధానం.నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రంలో కులగణనపై చిత్తశుద్ధి ఉంటే.. హిందు-క్రైస్తవ-ముస్లిం మతాల్లోని అన్ని కులాలనూ లెక్కిస్తే తప్ప, దాని లక్ష్యం నెరవేరదంటున్నారు.