Suryaa.co.in

Editorial

జగన్‌కు మరో ఝలక్

వైసీపీ ఎంపి ఆర్ కృష్ణయ్య రాజీనామా
– కృష్ణయ్య రాజీనామా ఆమోదం
– రాజ్యసభలో 8కి పడిపోయిన వైసీపీ బలం
– ఇటీవలే మోపిదేవి, బీదా మస్తాన్ రాజీనామా
– బీజేపీలో చేరనున్న కృష్ణయ్య?
( సుబ్బు)

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు వరస వెంట వరస శరాఘాతాలు తగులుతున్నాయి. బీవసీ ఓట్ల కోసం ఆయన ఏరికోరి తెలంగాణ నుంచి తెచ్చుకుని.. రాజ్యసభ సీటు ఇచ్చిన బీసీ నేత ఆర్.కృష్ణయ్య, తాజాగా తన ఎంపి పదవికి రాజీనామా చేయడం జగన్‌కు షాక్ ఇచ్చినట్లయింది. కష్ణయ్య రాజీనామాను ఆమోదిస్తున్నట్లు రాజ్యసభ సెక్రటేరియేట్ ధృవీకరించింది.

దానితో రాజ్యసభలో వైసీపీ బలం 8కి పడిపోయింది. ఇటీవల రేపల్లెకు చెందిన మోపిదేవి వెంకటరమణ, కావలికి చెందిన బీదా మస్తాన్‌రావు తమ ఎంపి పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

కాగా ఎన్నికల్లో ఏపీ బీసీల ఓట్లు సాధించవచ్చన్న వ్యూహంతో, తెలంగాణకు చెందిన బీసీ నేత ఆర్.కృష్ణయ్యను తన పార్టీలో చేర్చుకున్న జగన్.. ఆయనకు అనూహ్యంగా రాజ్యసభ సీటు కూడా ఇచ్చారు. ఆ సందర్భంలో కృష్ణయ్య టీడీపీని తీవ్రస్ధాయిలో విమర్శించారు. బీసీలంతా జగన్‌ను సమర్ధించాలని పిలుపునిచ్చారు.

కాగా జగన్ నుంచి ఎంపీలు జారిపోతున్న నేపథ్యంలో.. ఇప్పటికే రాజీనామా చేసిన మోపిదేవి, బీదా మస్తాన్‌రావు టీడీపీలో చేరడం ఖాయమయింది. ఇక తాజాగా రాజీనామా చేసిన కృష్ణయ్య బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆయనకు జాతీయ బీసీ కమిషన్ లేదా ఆ స్థాయి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు, తెలంగాణ బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న తెలంగాణకు చెందిన ఓ కీలకనేత, ఈ విషయంలో చొరవ తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

LEAVE A RESPONSE