– రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇస్తే, ఇక్కడ కూడా విమానాశ్రయం
– మోదీ ప్రభుత్వంలో వేగంగా హైవేల నిర్మాణం
– తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే ప్రజలకు మేలు
– రేషన్ కార్డులపై ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో పెట్టడం లేదు
– కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రముఖ న్యాయవాదులు, మేధావులు, డాక్టర్లు, పార్టీ కార్యకర్తలతో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు
కొమురం భీం ఆసిఫాబాద్ చారిత్రాత్మక జిల్లా. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, కొత్త జిల్లాలకు కోర్టు భవనాలు నిర్మించాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను డిమాండ్ చేశాను. గత ప్రభుత్వంలో న్యాయవాదుల సంక్షేమ నిధుల కోసం రూ.100 కోట్లు విడుదల చేయాలని కూడా డిమాండ్ చేశాను.
తెలంగాణలో రోడ్డు కనెక్టివిటీ పెంచేందుకు, జాతీయ రహదారుల నిర్మాణం పూర్తి చేసేందుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కృషి చేస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో రూ.3,900 కోట్ల జాతీయ రహదారి ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. భారీ హైవే నిర్మాణాలతో ప్రయాణ వేగం పెరిగింది, దూరం తగ్గింది.
అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో హైవే నిర్మాణం విస్తృతంగా జరిగింది, కానీ కాంగ్రెస్ హయాంలో మాత్రం జరగలేదు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు మోదీ ప్రభుత్వంలో హైవేల నిర్మాణం వేగవంతంగా జరుగుతోంది. ఆసిఫాబాద్ జిల్లాలో హైవేల నిర్మాణం వాణిజ్యాన్ని పెంచింది.
ఇక్కడి రైతుల పంటలకు నీరు అందించాలంటే, తుమ్మడిహట్టి వద్ద మరో ప్రాజెక్టు నిర్మించాలి. కొత్త ప్రాజెక్టుకు డీపీఆర్ సమర్పించగానే కేంద్రం అన్ని విధాల సహాయం అందించడానికి సిద్ధంగా ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్‌ను సమర్పించాలి.
ఆసిఫాబాద్ జిల్లాలో విమానాశ్రయం కావాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇస్తే, ఇక్కడ కూడా విమానాశ్రయం మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మోదీ ప్రభుత్వం రైతులకు ఎరువుల కొరతను తీర్చేలా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునఃప్రారంభించింది.
ఐఐటీలు, ఎయిమ్స్ పెరిగాయి, ప్రజల జీవనశైలి మెరుగుపడింది. ఉజ్వల యోజన ద్వారా గ్యాస్ కనెక్షన్లు అందించాం. రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి వ్యక్తికి 5 కిలోల ఉచిత బియ్యం ఇస్తోంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ రేషన్ కార్డులపై ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో పెట్టడం లేదు. ఎందుకంటే మోదీ గారికి ప్రజల్లో మరింత మంచి పేరుస్తుందనే అక్కసుతో.
గత 11 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సుమారు రూ.12 లక్షల కోట్లు ఇచ్చింది. వీటితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను కూడా కేంద్రమే చేస్తోంది. గ్రామీణ పేదలకు ఉచిత బియ్యం, ఇండ్లు, మరుగుదొడ్లు, గ్యాస్ కనెక్షన్లు, రూ.5 లక్షల ఉచిత వైద్యం, పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకు రుణాలు, యువతకు స్వయం ఉపాధి రుణాలు.. ఇవన్నీ కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయి.
గ్రామాల్లో రోడ్లు, మరుగుదొడ్లు, వీధి దీపాలు, స్మశాన వాటికలు, రైతు వేదికలు, హరితహారం కింద మొక్కలు నాటడం వంటి అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమలవుతున్నాయి. ప్రధానమంత్రి సడక్ యోజన కింద ప్రతి గ్రామానికి పక్కా రోడ్లు నిర్మించేందుకు నిధులు కేటాయించింది.
రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు, కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ.6,000 ఇస్తున్నారు.ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణలో ఇండ్లు కట్టాలని కేంద్రం నిధులు కేటాయించినా, లబ్ధిదారుల జాబితా గత రాష్ట్ర ప్రభుత్వం పంపలేదు. అసలు ఇండ్లు నిర్మించడమే జరగలేదు.
కేంద్ర ప్రభుత్వం నాబార్డ్, హడ్కో వంటి సంస్థల ద్వారా రుణాలు అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాల నుండి కేంద్రానికి వచ్చే రాబడిలో 8 శాతం నేరుగా గ్రామపంచాయతీల అభివృద్ధి కోసం సర్పంచులకు కేంద్రం పంపుతోంది, కానీ ఆ నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది.
తెలంగాణలో అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నిధుల్లేవని సాకులు చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ద్వారా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స అందిస్తోంది, కానీ తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయడం లేదు. కారణం.. కేంద్రానికి, ప్రధాని నరేంద్ర మోదీకి మంచి పేరు వస్తుందనే అసూయ.
నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మహిళలు, రైతులు, యువత.. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా ఉన్నాయి. తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుంది.