Suryaa.co.in

Andhra Pradesh

మరో పది, ఇరవై ఏళ్ళు మేమే బడ్జెట్ ప్రవేశపెడతాం

– పచ్చి అబద్ధాలను ప్రచారం చేయడంలో టీడీపీకి ఎవరూ సాటిరారు
– టీడీపీ నేతల ఊహకు కూడా అందని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు
– టీడీపీ హయాంలో ఆర్థికరంగాన్ని నిర్వీర్యం చేశారు, వారు చేసిన అప్పులకు మేం వడ్డీలు చెల్లిస్తున్నాం
– బడ్జెట్ పై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ప్రభుత్వ చీఫ్ విప్ జి. శ్రీకాంత్ రెడ్డి

మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. ఏమన్నారంటే…
సమాజంలోని అట్టడుగు వర్గాలు, పేదలు, రైతుల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి జగన్ ఎంత కమిట్ మెంటుతో ఉన్నారనేదానికి ఈరోజు ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్, వ్యవసాయ బడ్జెట్ లే తార్కాణం.రాబోయే కొత్త జిల్లాలతో కలిపి.. ప్రతి జిల్లాలో వైఎస్ఆర్ రైతు భవన్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. గ్రామాల నుంచి రైతులు పట్టణాలకు, నగరాలకు వచ్చినప్పుడు, వారి సౌకర్యార్థం, విశ్రాంతి తీసుకోవడానికి, భోజనం, వసతి కోసం వైఎస్ఆర్ రైతు భవన్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. రైతుల సంక్షేమం కోసం సూక్ష్మ స్థాయిలో ఆలోచించి నిర్ణయాలు చేస్తున్న ప్రభుత్వం ఇది.

పచ్చి అబద్ధాలను ప్రచారం చేయడంలో తెలుగుదేశం పార్టీకి సాటి మరెవరూ రారు. రైతుల కోసం ఆర్బీకేలు ఏర్పాటు చేసి, ఒక మంచి విధానాన్ని తీసుకొచ్చినా టీడీపీ నేతలకు కడుపు మంట ఎందుకు..? ఎరువుల కోసం ఆర్బీకేల చుట్టూ తిరుగుతున్నారని పసలేని విమర్శలు చేస్తున్నారు. గతంలో మాదిరిగా క్యూ లైన్లలో గంటల తరబడి నిల్చొనే పరిస్థితి రాకూడదనే, ఆర్బీకేలకు వెళ్ళి రైతులు పేరు నమోదు చేసుకుంటే, వారికి గ్రామాల్లోనే నేరుగా విత్తనాలు, పురుగు మందులను ఆర్బీకేల ద్వారా ఇస్తుంటే.. దానిపైనా విమర్శలు చేయడం విడ్డూరం.

గత రెండేళ్ళు కొవిడ్ వల్ల ఏ పనులూ జరగని పరిస్థితి ఉంది. ఇక నుంచి ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు తప్పకుండా వేగవంతం అవుతాయి. జలయజ్ఞం అనేది మహానేత వైయస్ఆర్ ప్రారంభించినది, ఆయన బ్రాండ్ పథకం అది. ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి డాక్టర్ రాజశేఖరరెడ్డి గారి విధానాలకు కొనసాగిస్తూ, అంతకు మించి చేసి చూపిస్తాం.

రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఒక్క ఆంధ్రప్రదేశ్ కే కేంద్రం డబ్బులు ఇవ్వట్లేదు, దేశంలోని అన్ని రాష్ట్రాలకూ దామాషా ప్రకారం నిధులు ఇస్తుంది.
టిడిపి నేతల ఊహకి కూడా అందని విధంగా, రాష్ట్రంలో సంక్షేమ‌ పథకాలు అమలు చేస్తున్నాం. వీటిని చూసి, టిడిపి నేతలు తట్టుకోలేకపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ రంగంలో పదివేల డ్రోన్లను ప్రవేశపెడుతున్నాం. గ్రామాలలో యువతకి డ్రోన్ల వినియోగంపై శిక్షణఇస్తాం.

ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఏమన్నారంటే…
గత తెలుగుదేశం ప్రభుత్వం ఆర్ధిక రంగాన్ని సర్వనాశనం చేసి, పూర్తిగా నిర్వీర్యం చేసి, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకి ఇప్పుడు మేము వడ్డీలు కడుతున్నాం.ఇది మా ప్రభుత్వంలో నాలుగో బడ్జెట్. ఇప్పటివరకూ మా ప్రభుత్వం ప్రారంభించి, అమలు చేస్తున్న ఏ ఒక్క పథకంలోనైనా కేటాయింపులు తగ్గించామా..? అంటే లేదు. అమ్మ ఒడి నుంచి రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన.. ఏ పథకం తీసుకున్నా గత మూడేళ్ళుగా, యేడాదికి యేడాది నిధుల కేటాయింపులు పెరుగుతున్నాయనేది అర్థమవుతుంది. ప్రతి పథకాన్ని శాచురేషన్ పద్ధతిలో అమలు చేస్తున్నాం.

చంద్రబాబు, యనమలలే పెద్ద ఆర్ధికవేత్తలుగా, నోటికొచ్చిన లెక్కలు మాట్లాడుతున్నారు. వారు ఎంతసేపటికీ అబద్ధాలను, అసత్యాలను పోగేసి, ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారు తప్పితే వారి మాటల్లో నిజం లేదు.

ఇపుడు కొత్త బిచ్చగాడుగా లోకేష్ తయారయ్యాడు. ముఖ్యమంత్రి జగన్ ని తిడితే తనకు మైలేజ్ పెరుగుతుందనే భ్రమల్లో ఉన్నాడు. అందుకే కనీస మర్యాదలు పాటించకుండా బూతులు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి మీ నాన్న హయాంలో జరిగిన దుర్మార్గాలను తెలుసుకో. మీ హయాంలో జరిగిన అన్యాయాలను, దుర్మార్గాలను, తప్పిదాలను సరిదిద్దుకుంటూ మేం ముందుకు వెళుతున్నాం. అదే మీరు మీ వ్యక్తిగత ఎజెండాలతో రాష్ట్రాన్ని అన్నింటా దోచుకున్నారు.

మేం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడి ఉన్నాం. బడ్జెట్ లో నవరత్నాలతో పాటు అన్ని రంగాలకి సమాన ప్రాధాన్యతమిచ్చాం. మంచి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ కి అభినందనలు చెబుతున్నాం. ఇప్పటికి నాలుగు బడ్జెట్ లు ప్రవేశ పెట్టాం. మరో రెండేళ్ళే కాదు.. ఇంకో పదేళ్ళు- ఇరవై ఏళ్ళు కూడా మేమే బడ్జెట్ లు ప్రవేశపెడతాం.

శాసనసభ గౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశమే టీడీపీకి లేదు. ప్రతిరోజూ సభలో అల్లరి చేయడం, రన్నింగ్ కామెంట్లు చేయడం తప్ప వారికి మరో పని లేదు. కుప్పం ఎన్నిక ఓటమిని డైవర్షన్ చేయడానికే చంద్రబాబు గత సమావేశాల్లో ఆర్గనైజ్డ్ ఏడుపు ఏడ్చి సభ నుంచి బయటకు వెళ్ళాడు. బడ్జెట్ ప్రసంగాన్ని సైతం అడ్డుకోవడానికి ప్రయత్నించిన దుర్మార్గపు ప్రతిపక్షం ఈరోజు రాష్ట్రంలో ఉంది.

LEAVE A RESPONSE