అమరావతి, నవంబరు 12:ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం శుక్రవారం అమరావతి సచివాలయం 5వ బ్లాకులో రాష్ట్ర ఆర్థిక, సర్వీస్ మరియు హెచ్ ఆర్ శాఖల ముఖ్య కార్యదర్శులు ఎస్ఎస్ రావత్, శశిభూషణ్ కుమార్ ల నేతృత్వంలో జరిగింది.
గత నెల 29వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అధ్యక్షతన జరిగిన ఎపి సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశానికి కొనసాగింపుగా ఈసమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొని ఉద్యోగులకు సంబందించిన పలు అంశాలను వారి దృష్టికి తెస్తూ వాటిని సత్వరమే పరిష్కరించాలని కోరారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ మాట్లాడుతూ 2014 లో జరిగిన రాష్ట్ర విభజన వల్ల రాష్ట్రం తీవ్ర ఆర్థిక లోటును ఎదుర్కొంటూ ముందుకు వెళుతున్న సమయంలో కోవిడ్ మహమ్మారి వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత చిన్నాబిన్నం అయిందన్నారు. అటు వంటి పరిస్థితులను అన్నింటినీ ప్రభుత్వం దైర్యంగా ఎదుర్కొంటూ ఉద్యోగులకు సంబందించిన అన్ని అంశాలను సానుకూల దృక్పధంతో పరిష్కరించడమే కాకుండా 27 శాతం ఐ.ఆర్. ను కూడా ప్రకటించడం జరిగిందన్నారు. అయితే గత రెండు మూడు మాసాల నుండి రాష్ట్ర రెవిన్యూ రాబడులు మెరుగుపడ్డ నేపధ్యంలో రానున్న మార్చి మాసానికల్లా ఉద్యోగులకు సంబందించిన జిపిఎప్, ఏపిజిఎల్ఐ, మెడికల్ రిఇంబర్స్ మెంట్ తదితర అన్నిరకాల పెండింగ్ బిల్స్ ను దశల వారీగా క్లియర్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
పెండింగ్ లోనున్న డి.ఏ.లను కూడా క్లియర్ చేసేందుకు కార్యచరణ ప్రణాళికను అమలు చేయనున్నట్లు తెలిపారు. 2018 లో ప్రారంబించిన సి.ఎప్.ఎం.ఎస్. సెంట్రలైజ్డు డిజైన్లో కొన్ని మంచి, చెడులు ఉన్న నేపథ్యంలో ఆ వ్యవస్థను వికేంద్రీకరించడం వల్ల చాలా వరకూ సమస్యలు పరిష్కారం అయ్యాయన్నారు. ఏ ఒక్క ఉద్యోగి కూడా సి.ఎప్.ఎం.ఎస్. కార్యాలయం చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా సుమారు 90 శాతం అధికారాలను డి.డి.ఓ.లకు డెలిగేట్ చేయడం జరిగిందన్నారు.
వచ్చే ఏడాది మార్చి మాసాంతాని కల్లా ఈ వ్యవస్థను పూర్తి స్థాయిలో పునరుద్దరిస్తామని తెలిపారు. ఉద్యోగులకు జీతాలు చెల్లింపు విషయంలో దేశంలోనే సుమారు ఏడో స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని ఈ ఏడాది ఒకటో స్థానానికి తీసుకువచ్చేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్లు ఆ స్పష్టంచేశారు. ఒక ఉద్యోగ సంఘం ప్రతినిధి అడిగి ప్రశ్నకు ఆయన సమాదానం చెపుతూ ఉద్యోగుల అనుమతి లేకుండా వారి జి.పి.ఎఫ్. ఖాతాల నుండి నిధులను డ్రా చేసే అంశంపై విచారణ జరుపుతామని అన్నారు.
రాష్ట్ర సర్వీసెస్ మరియు హెచ్.ఆర్.ఎం.శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడతూ పి.ఆర్.సి. నివేదిక పరిశీలనకై ఐదారుగురు ఉన్నతాధికారులతో ఏర్పాటు చేయబడిన ఆఫీసర్స్ కమిటీ త్వరలో సమావేశమై కమిటీ సిఫార్సులతో ప్రభుత్వానికి ఆ నివేదికను సమర్పించడం జరుగుతుందన్నారు.
అయితే ఆ కమిటీ అధికారులు ఈ నెల 14 న తిరుపతిలో జరుగనున్న 29 వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాట్లపై నిమగ్నమైఉన్నందున త్వరలో సమావేశం అవుతారని ఆయన స్పష్టం చేశారు. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అందరికీ ప్రతి నెలా ఒకటవ తేదీకే జీతాలు వారి ఖాతాలకు జమ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఆర్థిక శాఖ ఇఓ కార్యదర్శి కె.వి.వి.సత్య నారాయణ, సిఎఫ్ ఎంఎస్ సిఇఒ రవి పట్టంశెట్టి తోపాటు 13 ఉద్యోగ సంఘాలు ఎపిఎన్జిఓ,ఎపి సచివాలయ ఉద్యోగుల సంఘం, ఎస్టియు ఎపి, ఎపిటిఎఫ్, ఎపియు టిఎఫ్,ఎపి రెవెన్యూ అసోసియేషన్, ఎపి గవర్నమెంటు ఎంప్లాయిస్ అసోసియేషన్, ఏపీ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్, ఎపి కోఆపరేటివ్ సర్వీసెస్ అసోసియేషన్, ఏపీ సర్వే ఎంప్లాయిస్ అసోసియేషన్, ఏపీ కమర్షియల్ టాక్సెస్ ఎన్జిఓ అసోసియేషన్, లైవ్ స్టాక్ అసిస్టెంట్, రూరల్ లైవ్ స్టాక్ యూనిట్, ఏపీ స్టేట్ టైపిస్ట్స్ అండ్ స్టెనోగ్రాఫర్స్ అసోసియేషన్ల అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.