ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ టాటా సన్స్ ప్రతినిధి బృందంతో ముఖ్యమైన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో ఆర్థికాభివృద్ధి, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్-2047కు సంబంధించిన అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, ఈ సమావేశాన్ని “గొప్ప అనుభవం”గా అభివర్ణించారు.
అమరావతిలో టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో భేటీ అయిన చంద్రబాబు, రాష్ట్ర అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. “ఏపీ ప్రభుత్వం మేధావులు, పారిశ్రామిక దిగ్గజాలతో కలిసి స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్-2047ను దృష్టిలో ఉంచుకుని ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తోంది. ఈ టాస్క్ ఫోర్స్‌కు నటరాజన్ చంద్రశేఖరన్ కో-చైర్మన్‌గా వ్యవహరించనుండటం ఎంతో సంతోషంగా ఉంది” అని సీఎం పేర్కొన్నారు.
అదనంగా, అమరావతిలో సీఐఐ ఏర్పాటు చేయనున్న సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఆన్ కాంపిటీటివ్ నెస్ (జీఎల్ సీ)లో టాటా గ్రూప్ భాగస్వామిగా ఉండేందుకు అంగీకరించిందని తెలిపారు. అలాగే, విశాఖపట్నంలో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన అవకాశాలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది.
రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఎయిరిండియా, విస్తారా వంటి విమానయాన సంస్థల సేవల విస్తరణతో పాటు ఇతర రంగాల్లో భాగస్వామ్యంపై కూడా ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ కూడా పాల్గొన్నారు.